
సాక్షి, హైదరాబాద్: నా కొత్త చీర ఎలా ఉంది? ఈ రోజు డాటర్స్ డే..మా అమ్మాయిని దీవించండి.. మా యువ జంట ఎలా ఉంది? అంటూ రకరకాల చాలెంజ్‌లతో ఫొటోలు, సెల్ఫీలు అప్‌లోడ్ చేసి వాటికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోతున్నారా? అయితే జర జాగ్రత్త. ఇలాంటి చాలెంజ్‌ల పేరుతో మీ కుటుంబసభ్యుల ఫొటోలు మీరే సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టి వారు వేధింపులకు గురయ్యేందుకు కారణమవుతున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజమని చెబుతున్నారు పోలీసులు.
ఇటీవల కపుల్ ఛాలెంజ్ పేరుతో చాలామంది సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన ఫొటోలను సైబర్ నేరగాళ్లు డౌన్‌లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి ఆర్థిక, లైంగిక వేధింపులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి వాటిని తొలగించాలంటే..తాము సూచించినంత డబ్బులు పేటీఎం, గూగుల్ పేలో వేయాలని బెదిరింపులకు దిగుతున్నారని, ఫొటోలతో ఇతరులకు సైబర్ వలవేసి నేరాలలో ఇరికించిన ఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినట్లు చెబుతున్నారు. కాబట్టి ఎవరికి వారు సోషల్ మీడియాలో స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని, ఇష్టం వచ్చినట్లుగా మహిళల ఫొటోలను అప్‌లోడ్ చేయవద్దని పోలీసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment