సాక్షి, హైదరాబాద్: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో దేశ రక్షణ రంగంలో కొత్త శకం మొదలైంది. ‘మేడిన్ ఇండియా’ రక్షణ ఉత్పత్తులు విదేశాలకు విస్తరించనున్నాయి.. ఆకాశ్ ఎగుమతులు సరే.. కానీ ఎగుమతుల జాబితాలో తర్వాత ఉన్నవేమిటి? ఏయే దేశాలు భారత రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నాయి? ఆత్మనిర్భర్ భారత్ సాకారంలో డీఆర్‌డీవో భాగస్వామ్యమెంత..? తదితర ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ సమాధానాలను డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు.
ప్రశ్న: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఏయే దేశాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి?
జవాబు: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులు దేశ రక్షణ రంగ చరిత్రలో ఓ కీలక మలుపనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని భారత్ ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.. రక్షణ పరిశ్రమ రంగానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చే పరిణామం. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి చాలా ఆసియా దేశాలు ఆకాశ్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యూఏఈ కూడా ఆసక్తి కనబరిచింది. ఆకాశ్ ఎగుమతులు మొదలైతే అందులోని ఉప వ్యవస్థల గురించి కూడా అంతర్జాతీయ సమాజానికి తెలుస్తుంది. తద్వారా ఆ ఉప వ్యవస్థల అమ్మకాలు, నిర్వహణల్లోనూ దేశానికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
ఎగుమతులు ఎప్పుడు ప్రారంభం కావచ్చు? వీటి విలువపై మీ అంచనా?
మిలటరీ ఉత్పత్తులను వీలైనంత వేగంగా ఎగుమతి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఆయా దేశాల అవసరాల ఆధారంగా ఎగుమతి ప్రక్రియ ప్రారంభిస్తాం.. 2024 నాటికల్లా భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.36,566 కోట్ల వరకు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో డీఆర్‌డీవో భాగస్వామ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది.
ఆకాశ్ తర్వాత ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఇతర క్షిపణి, రక్షణ వ్యవస్థలేవి?
తీరప్రాంత నిఘా వ్యవస్థపై చాలాదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ధ్వని కంటే వేగంగా ప్రయాణించగల క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, అత్యాధునిక ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి వ్యవస్థల్లోని పలు రకాలపై, సోనార్లు, యుద్ధభూమిలో ఉపయోగించే రాడార్ల కోసం దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు సమాచారం కోరుతున్నాయి. కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి కూడా.. కొన్ని దేశాలు భారత్ సొంతంగా తయారు చేసుకున్న దృశ్య కాంతికి ఆవల కూడా పని చేయగల ‘అస్త్ర’కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. వేర్వేరు యుద్ధ విమానాలతో అనుసంధానించగలగడం ఈ అస్త్ర ప్రత్యేకత..
క్షిపణి వ్యవస్థల ఎగుమతుల కారణంగా భారత్‌కు వ్యూహాత్మకంగా ఏమైనా నష్టం జరుగుతుందా?
అలాంటిదేమీ ఉండదు.. ఎందుకంటే ఈ క్షిపణి వ్యవస్థల్లోని సాంకేతిక పరిజ్ఞానాలు అన్నింటినీ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సున్నా నుంచి మొదలుపెట్టి పూర్తి చేశారు కాబట్టి. ఈ టెక్నాలజీలను ఎలా ఒక రూపంలోకి చేర్చాలన్నది మనకు మాత్రమే తెలిసిన విషయం.. కమాండ్ కంట్రోల్ సిస్టమ్, సాఫ్ట్‌వేర్, అల్గారిథమ్స్ వంటివి పూర్తిగా దేశీయంగానే తయారు చేసుకున్నాం.. ఈ కారణంగానే అతితక్కువ ఖర్చుతో, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం.. మన టెక్నాలజీలు అంతర్జాతీయ మార్కెట్‌లోకి చేరితే మనకు లాభమే తప్ప నష్టమంటూ ఏదీ లేదు. భారత్ తన మిత్ర దేశాలకు మాత్రమే రక్షణ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తుండటం వల్ల భవిష్యత్తులో ఆయా దేశాలతో సహకారానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది..
ఆత్మనిర్భర్ భారత్ కోసం డీఆర్‌డీవో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ఎప్పటివరకు పూర్తవుతాయి?
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో రక్షణ రంగం ఓ కీలకమైన అంశం. రానున్న ఐదు, పదేళ్లలో భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించనుంది. కీలకమైన టెక్నాలజీలను దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రులు, టోర్పెడోలు, సమాచార వ్యవస్థల విషయంలో మనం ఇప్పటికే స్వావలంబన సాధించాం. భారత్‌కు తనదైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ట్యాంకులను కూడా సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం.
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఎంత శాతం రక్షణ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం?
రక్షణ అవసరాలకు సంబంధించి 2020 డిసెంబర్‌లో దిగుమతులపై నిషేధం విధించారు. మన అవసరాల్లో చాలావాటిని దేశీయ పారిశ్రామిక వర్గాల ద్వారా తీర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న ఆరు, ఏడేళ్లలో ఇది అవుతుంది. రక్షణ అవసరాలు ఎంతమేరకు తగ్గించుకోగలుగుతామన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే దేశీయంగా తయారుచేసుకుంటున్న పలు వ్యవస్థలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. డిజైన్, డెవలప్‌మెంట్‌తో పాటు తయారీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఐదేళ్లలో పూర్తిస్థాయి స్వదేశీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నాం.
2020 నాటికి మన రక్షణ అవసరాల్లో దిగుమతుల శాతమెంత? అవి ఏయే రంగాల్లో ఉన్నాయి?
దిగుమతులపై ఆధారపడటం క్రమేపీ తగ్గుతోంది. ఇప్పటికే సుమారు 4,700 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిల్లో చాలావాటిని సొంతంగా తయారు చేసుకునే ప్రక్రియలో డీఆర్‌డీవో ఉంది. రాడార్లు, సోనార్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, టొర్పెడోలు, మందుపాతరల వంటి వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. హోవిట్జర్ ఏటీఏజీఎస్, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించల క్షిపణుల్లోనూ భారత్ తన సామర్థ్యాన్ని చాటుకుంది. కార్బైన్ల పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. ఈ కార్బైన్లతోపాటు అనేక ఇతర చిన్న ఆయుధాలను కూడా దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం.
Comments
Please login to add a commentAdd a comment