సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మరో వేడుకకు సిద్ధమవుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం నిమజ్జనం గావిస్తారు.
ఈ నేపథ్యంలో నగరంలోని ధూల్‌పేట్‌లో దుర్గామాత ప్రతిమల తయారీ పనులు ఊపందుకున్నాయి. కళాకారులు వీటికి రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు.
నగరం వేదికగా దసరా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ఆదివారం ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు.
నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్‌కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. (క్లిక్: దాండియా జోష్...స్టెప్పులు అదరహో..)
26 నుంచి రామాయణ్ మేళా
అబిడ్స్: ఈ నెల 26 నుంచి 50వ రామాయణ మేళా వేడుకలు నిర్వహిస్తున్నట్లు రామాయణ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్‌రాఠి పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామాయణ మేళాలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించి పలువురు కవులను సన్మానిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే రామాయణ్ మేళాలో ప్రతి రోజు రామాయణం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు.
29 నుంచి 3వ తేదీ వరకు గర్బా దాండియా నిర్వహిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో దాండియా వేడుకలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. దసరా రోజు అక్టోబర్ 5న వేలాదిమంది భక్తుల మధ్య రావణ దహనం, శమీ పూజ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమల్‌నారాయణ అగర్వాల్, గిరిధర్ లాల్, మనోజ్ జైస్వాల్, రామ్‌దేవ్, సుమిత్‌రాఠి పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు)
Comments
Please login to add a commentAdd a comment