మియాపూర్: కాలుష్య నివారణతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించడమే ఈ– గరుడ ముఖ్యోద్దేశ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈ– గరుడ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ.. మియాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని బస్టాప్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సమాజం కోసం ఎలక్ట్రికల్ వాహనాలను టీఎస్‌ఆర్టీసీ విస్తరిస్తోందన్నారు.
రానున్న రోజుల్లో 1300 బస్సులు హైదరాబాద్ సీటీలో, 550 సదూర ప్రాంతాలలో నడుపుతామని తెలిపారు. ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీలకు సంబంధించిన యూనిట్లకు అమర్‌రాజా సంస్థతో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో శంఖుస్థాపన చేశారన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 50 ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించామని, అందులో ప్రస్తుతం 10 బస్సులు ప్రారంభించామని, విడతల వారీగా మిగతా బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామరని తెలిపారు.
ఎన్ని ఇబ్బందులున్నా.. కొత్త బస్సులను ప్రవేశ పెడుతూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 10 వేల బస్సులు ప్రజా రవాణాకు వినియోగిస్తున్నామని తెలిపారు. త్వరలో నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో ప్రైవేటు వాహనాలను తట్టుకోవడం ఆర్టీసీకి కష్టంగా ఉండేదని, కానీ ప్రస్తుతం ఆర్టీసీ వాహనాలను తట్టుకోవడం ప్రైవేటుకు కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఆర్‌టీసీ నడుస్తోందని తెలిపారు.
కొత్త కారులలో ఉండే ఆధునిక సదుపాయాలు ఆర్టీసీ బస్సుల్లో కల్పిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సుల కారణంగా ట్రాఫిక్ సమస్య పెరిగిందని, నియంత్రించేదుకు బస్సు టెర్మినల్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఒలెక్ట్రా ప్రతినిధులు, అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment