సాక్షి, జగిత్యాల: ప్లాస్టిక్‌తో తయారయ్యే వస్తువులు పర్యావరణం, మనిషి ఆరోగ్యానికి హానికరంగా మారాయి. ఈనేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా లెక్చరర్‌గా పనిచేస్తున్న ఓ అభ్యుదయ మహిళ, ఆవు పేడ, సహజసిద్ధమైన పూలతో అందమైన రాఖీలు తయారు చేసి, హైదరాబాద్ లాంటి నగరాల్లో విక్రయిస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన డాక్టర్ చెన్నమనేని పద్మ హైదరాబాద్‌లో లెక్చరర్‌గా పనిచేస్తోంది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు ఎలాంటి రసాయనాలు లేని పంటలు పండించడమంటే ఇష్టం. బోర్నపల్లిలో 200 దేశీయ ఆవులతో మురిళీధర గోదామం గోశాల ఏర్పాటు చేసింది. వీకెండ్‌తో పాటు సెలవుల్లో ఆవు మూత్రం, పేడతో రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు దీపావళికి ప్రమిదలు, వరలక్ష్మీ పూజకు అవసరమైన సామగ్రి తదితర వస్తువులను ఆవు పేడతో తయారు చేసి శభాష్ అన్పించుకుంది.
గోమయ రాఖీలు..
గోశాలలో ఆవులు విసర్జించిన పేడను దాదాపు నెల రోజుల పాటు ఎండబెట్టారు. పిడకల మాదిరిగా తయారైన ఆవుపేడను గ్రైండర్ లేదా ప్రత్యేక మిషన్‌లో వేసి గోధుమ పిండిలా తయారు చేశారు. అలా తయారైన మెత్తటి పేడకు గోరు గమ్ పౌడర్ (సోయా చిక్కుడుతో తయారైనది)తో పాటు కొంత చెరువు మట్టిని రొట్టె పిండిలా కలిపి రకరకాల డిజైన్ సాంచా(మోడల్)ల్లో పెట్టి నీడలో ఆరబెట్టి, దారాన్ని అతికించారు. తర్వాత చామంతి, గులాబీ పూలను ఎండబెట్టి, పూల రేకులను గ్రైండ్ చేసి రంగులు తయారు చేస్తారు. రాఖీలకు ఏ రంగు అవసరమనుకుంటే ఆ రంగులను వాడుతారు.
ఉపయోగాలు..
రక్షాబంధన్ అనంతరం చేతిక కట్టిన రాఖీ తీసివేసిన తర్వాత అది ఎరువుగా ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా రాఖీ చేతులకు ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా గోమయ రాఖీ యాంటీ రేడియేషన్‌గా పనిచేసి, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. దీంతో వీటికి నగరాలు, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది. అయితే వీటి ద్వారా సంపాదన కంటే ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
జీవితం విలువైనది
మనిషి జీవితం చాలా విలువైనది. ప్రస్తుత మన అలవాట్లు, వాడే రసాయన పదార్థాల వల్ల అనారోగ్యం పాలవుతున్నాం. ఆవు మూత్రం, పేడను పంటలకు ఎరువుగానే కాకుండా, మనిషి రోజు వారీ అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. దీంతో రాఖీలు తయారు చేశాం.
– డాక్టర్ పద్మ, గోమాయ రాఖీల తయారీదారు
గి‘రాఖీ’ వెలుగులు
సిరిసిల్ల: కొన్నేళ్ల క్రితం వరకు రాజన్న సిరిసిల్ల్ల వస్త్రోత్పత్తి, బీడీల తయారీకి ప్రసిద్ధి చెందింది. నేత కుటుంబంలోని మహిళలు బీ డీలు తయారు చేస్తూ ఇంటి పోషణలో తోడుగా నిలిచేవారు. ఈనేపథ్యంలో చాలా రోజులు గా సిరిసిల్లలో బీడీ పరిశ్రమ కుదేలై పనిదొ రక్క సతమతమవుతున్న మహిళలు ప్రత్యామ్నాయ ఉపాధిగా రాఖీలు తయారు చేస్తూ ఆర్థికంగా సంపాదిస్తున్నారు. బీడీల తయారీ కంటే మంచిది కావడంతో యువత, విద్యార్థులు, గృహిణులు ఉత్సాహంగా ఏడాదిలో పదినెలలు రాఖీలు తయారు చేస్తున్నారు.
కలిసొచ్చిన లాక్‌డౌన్..
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి రాఖీల దిగుమతి చాలా వరకు తగ్గింది. అయితే సిరిసిల్ల, చందుర్తిలో రాఖీ పరిశ్రమను శ్రీహరి–తేజస్విని దంపతులు ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నారు. ఇక్కడి రాఖీలు ప్రజలను ఆకట్టుకోవాలంటే మహా నగరాల్లో నుంచి వచ్చే రాఖీలకు దీటుగా తయారు చేయాలి. ఈక్రమంలో రాఖీల తయారీకి ముడి సరుకును ముంబాయిలోని మల్లాడ్ ప్రాంతం నుంచి తీసుకొస్తున్నారు.
రంగురాళ్లు, సిల్వర్, గోల్డెన్, దేవుళ్ల బొమ్మలు, వివిధ పార్టీల గుర్తులతో రాఖీలు తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. మణికంఠ రాఖీ సెంటర్ బ్రాండ్ పేరు పక్క జిల్లాలకు పాకింది. రాఖీల నాణ్యత ఎక్కువ, ఖరీదు తక్కువ కావడం, లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో రాఖీల తయారీ తగ్గడం సిరిసిల్ల రాఖీలకు మరింత కలిసొచ్చింది.
తక్కువ ధరల్లో..
సిరిసిల్లలో తయారయ్యే రాఖీలు చూసేందుకు అందంగా, తక్కువ ధరలో దొరకడం వీటికి క్రేజ్ పెరిగింది. రూ.2 నుంచి రూ.100 వరకు ఖరీదు చేసే రాఖీలు ఇక్కడ తయారవుతున్నాయి. ఏటా జిల్లా కేంద్రంతో పాటు చందుర్తి మండలం లింగంపేట లో సుమారు 16లక్షల రాఖీలు తయారు చేస్తున్నా రు. జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ తది తర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment