క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే.. | ED Raids including Chikoti Praveen, Madhav Reddy residences in Hyderabad | Sakshi
Sakshi News home page

క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..

Published Thu, Jul 28 2022 1:28 AM | Last Updated on Thu, Jul 28 2022 5:37 PM

ED Raids including Chikoti Praveen, Madhav Reddy residences in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సైదాబాద్‌: ఆయన చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయన ఏ కార్యక్రమం చేసినా ఫుల్‌ హడావుడి, సెలబ్రిటీలే దగ్గరుండి ఏర్పాట్లు చూస్తారు. అలా అనీ ఆయనేం పవర్‌ సెంటర్‌ కాదు.. పత్తాలాడించే ఓ సామాన్య వ్యక్తేగానీ.. గల్లీలో పేకాట ఆడించే వాడు కాదు. ఏకంగా ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తీసుకెళ్లి కోట్లలో క్యాసినోలు ఆడించే ఖతర్నాక్‌ ఆర్గనైజర్‌. అతడే చీకోటి ప్రవీణ్‌. అలాంటివాడిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసులు నమోదుచేసి బుధవారం నగరంలోని 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.కోట్ల హవాలా ద్వారా ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. బోయినపల్లికి చెందిన అతడి భాగస్వామి మాధవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ముఖ్యమైన డాక్యుమెంట్లు, క్యాసినోలతో చేసుకున్న ఒప్పందాలు, హవాలా మార్గంలో తెచ్చిన నగదుకు సంబంధించి ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్‌పై ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపాయి. అలాగే, మాధవరెడ్డి ఇంట్లో ఒక కారుపై మంత్రికి సంబంధించిన కారు స్టిక్కర్‌ అతికించి ఉంది. 

హవాలాతో అడ్డంగా దొరికి.. 
చీకోటి ప్రవీణ్‌ ఒకప్పుడు నగరంలో సాదాసీదా పేకాట క్లబ్బులు నడిపించిన వ్యక్తి. బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌ తది తర ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటుచేసి దందా సాగించేవాడు. 2014 తర్వాత అతడి సుడి మారిపోయిందని చెబుతారు. ఇద్దరు మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేల సాన్నిహిత్యంతో చీకోటి వ్యవహారం విదేశాలకు విస్తరించింది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు తీసుకెళ్లి రూ.కోట్లలో పేకాట ఆడించడం వరకు వెళ్లాడు. ఇక్కడే అసలు కథ అడ్డం తిరిగింది. ఇండోనేషియా, నేపాల్, శ్రీలంకలో పేకాట ఆడించేందుకు హవాలా ద్వారా నగదు లావాదేవీలు చేసి ఈడీకి అడ్డంగా బుక్కయినట్టు తెలిసింది.

హైదరాబాద్‌లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి.. నేపాల్, ఇండోనేషియాలో తనకు ఎంత కావాలో ఆమేరకు అక్కడి కరెన్సీని తీసుకునేవాడు. ఇలా గత జూన్‌ 10, 11, 12, 13 తేదీల్లో 8 ప్రత్యేక విమానాల్లో నేపాల్‌లోని హోటల్‌ మిచీక్రౌన్‌లో భారీ ఎత్తున క్యాసినో ఏర్పాటుచేసి చాలామంది ప్రముఖులను తరలించాడు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు హవాలా ద్వారా వెళ్లిన నగదుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించి రంగంలోకి దిగినట్టు తెలిసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రవీణ్‌ నివాసం, ఫాంహౌజ్‌తోపాటు మరో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఈడీ అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. 
 
సెలబ్రిటీల వీడియోలు 
బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు, హీరోయిన్లు సైతం చీకోటితో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈడీ అధికారులను షాక్‌ తినేలా చేసినట్టు తెలుస్తోంది. గతంలో బేగంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన బర్త్‌డే ఫంక్షన్‌లో క్యాసినో ఏర్పాటుచేసిన అంశం పెద్ద దుమారమే రేపింది. ఆ పార్టీకి ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు సీనియర్‌ ఐఏఎస్‌లు హాజరవడం సంచలనం రేపింది. ఆరు నెలల క్రితం చీకోటి పేకాట వ్యవహారాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది.  
 
ఆయనకు సారీ చెప్పి మరీ... 
గత నెల 17న కర్మన్‌ఘాట్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో చీకోటి తన 46వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాడు. ఫంక్షన్‌ హాలంతా సెలబ్రిటీలే. బర్త్‌డే సందర్భంగా తాను ఇష్టపడి బుక్‌ చేసుకున్న రేంజ్‌ రోవర్‌ ఆటో బయోగ్రఫీ కారును ప్రముఖ హీరో, ఓ రాజకీయ పార్టీ అధినేత కూడా ఇష్టపడ్డాడు. సేమ్‌ కలర్‌ కూడా కావడంతో ఆ హీరో ప్రవీణ్‌కు ఫోన్‌చేసి ఆ కారు కావాలని అడగ్గా, సారీ.. సర్‌.. తనకే కావాలని సున్నితంగా చెప్పి సొంతం చేసుకున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. కారు విలువ సుమారు రూ.3.5 కోట్లు. 
►నగర శివార్లలోని కడ్తాల్‌లో ప్రవీణ్‌కు 20 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌ ఉందని సమాచారం. ఇక్కడే అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులకు హైఫై పార్టీలు ఇస్తుంటాడని తెలుస్తోంది. వీటిలో అత్యంత ఖరీదైన మద్యం ఏరులై పారుతుంది. అనేక మందిని ఆకర్షించడానికి టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోయిన్లతో గానా బజానాలూ ఏర్పాటు చేస్తుంటాడు. ఉత్తరాది టాప్‌ మోడల్స్‌ కూడా తళుక్కుమంటారని సమాచారం.  
 
జైల్లో పరిచయాలతో... 

ఓ రియల్టర్‌ను బెదిరించి రూ.30 లక్షలు గుంజిన కేసులో ప్రవీణ్‌ కొద్ది రోజులు జైల్లోఉన్నాడు. అప్పడు ఏర్పడిన పరిచయాలతోనే ప్రవీణ్‌ క్యాసినో నిర్వాహకుడిగా మారాడని అంటుంటారు. తొలినాళ్లల్లో క్రికెట్‌ బుకీగా వ్యవహరించాడు. రాష్ట్రంలో క్లబ్స్‌ నిషేధించడంతో గోవాకు చెందిన ప్రముఖ గో డాడీ క్యాసినోలో పార్ట్‌నర్‌గా మారాడని, ఆపై చెన్నై శివార్లలో సొంతంగా ఓ క్యాసినో పెట్టాడని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌లో వివిధ ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాలు, పేకాట శిబిరాలూ ఇతడి నేతృత్వంలోనివే అని పోలీసులు చెప్తున్నారు.  
 
కుడి భుజంగా మాధవరెడ్డి 
బోయిన్‌పల్లికి చెందిన మాధవరెడ్డి.. ప్రవీణ్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు ఓ మంత్రితో దగ్గర బంధుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రవీణ్‌ నిర్వహించే క్యాసినోలు, గ్యాంబ్లింగ్‌లకు ప్రముఖులను తీసుకొచ్చే బాధ్యతల్ని తీసుకునేవాడు. బోయిన్‌పల్లికే చెందిన ఓ వ్యక్తి ఇటీవల నేపాల్‌లోని వీరి క్యాసినోకు వెళ్లారు. ముందుగానే రూ.10 లక్షలు చెల్లించారు. అయితే అక్కడ అదనపు ఖర్చులకంటూ మాధవరెడ్డి ఆయనకు డబ్బులు ఇచ్చాడు. తిరిగి వచ్చాక ఆ డబ్బు ఇవ్వాలని బెదిరించి ఆ వ్యక్తికి సంబంధించిన స్థలాన్ని తమ వారి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది పేకాటరాయుళ్ల భూములను వీరిద్దరూ ఇదే పంథాలో బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సందర్భాలు అనేకం. కొంపల్లిలో ఓ ఫంక్షన్‌ హాల్‌ ఇప్పటికీ పేకాటరాయుళ్లకు అడ్డాగా ఉంది. ప్రవీణ్, మాధవరెడ్డి దాన్ని లీజ్‌కు తీసుకున్నారు. అక్కడ ప్రతి నెలా రెండు రోజులపాటు పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు. ఇటువైపు పోలీసులు కన్నెత్తి చూడరన్న ఆరోపణలున్నాయి. 
 
బంగారం వ్యాపారంలోనూ... 
చీకోటి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు క్యాసినో ద్వారా జరిగిన హవాలా లావాదేవీలు మాత్రమే కాకుండా బంగారం దందా వ్యవహారంలోనూ సంబంధాలున్నట్టు గుర్తించినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన ప్రముఖ బంగారు వ్యాపారికి హవాలా ద్వారా డబ్బు ఏర్పాట్లు చేసి తాను బంగారం బ్లాక్‌మార్కెట్‌ ద్వారా తీసుకున్నట్లు ఈడీ గుర్తించినట్టు సమాచారం. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఈడీ అధికారి ఒకరు చెప్పారు.  
 
ఫామ్‌హౌస్‌లో ప్రైవేట్‌ జూ 
చీకోటి కుటుంబం ప్రస్తుతం ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ వినయ్‌నగర్‌ కాలనీలోని సాయి కిరణ్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. ప్రవీణ్‌ కడ్తాల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఓ ప్రైవేట్‌ జూ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో రూ.కోట్ల విలువైన వైట్‌హార్స్‌తోపాటు మాట్లాడే చిలుకలు, కొండచిలువలు, పశువులు.. ఇలా అనేక రకాల జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు వీడియోల్లో కనిపిస్తోంది. సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్న ప్రవీణ్‌ 15 ఏళ్ల క్రితం ఒక తెలుగు సినిమాలో విలన్‌గానూ నటించాడు. 2007లో పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఓ చిత్ర నిర్మాణం కోసం ఒక హీరోకి కొంత అడ్వాన్స్‌ కూడా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రవీణ్‌ తొలినాళ్లల్లో కాంగ్రెస్‌ నాయకుడిగా చురుగ్గా తిరిగి తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పాడు. ఆడంబర జీవితం గడిపే అతని వెంట అనునిత్యం ప్రైవేట్‌ సైన్యం ఉంటుంది. తన కుమారులకు రూ.కోట్ల విలువైన కార్లు బహుమతులుగా ఇచ్చాడు.  

ఒక్కో దేశానికి ఒక్కో రేటు   
చీకోటి ప్రవీణ్‌ ఒక్కో ఆటకు ఒక్కో రేటు ఫిక్స్‌ చేస్తాడు. ఒక్కో దేశానికి ఒక్కో రకమైన డిపాజిట్‌ తీసుకుంటాడు. హైదరాబాద్‌ నుంచి ప్రతీ శుక్ర, శని, ఆదివారాల్లోనే విదేశాలకు క్యాసినో ఆడేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఇలా తనకు 200 మంది రెగ్యులర్‌ కస్టమర్లుండగా వారికి అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసి పెడతాడు. ప్రయాణానికి ముందే కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకుంటాడు. ఇండోనేషియా, నేపాల్‌కు క్యాసినో ఆడేందుకు వెళ్లే వారు రూ.5 లక్షల నుంచి 50లక్షల వరకు డిపాజిట్‌ చేస్తారు. రూ.15లక్షల వరకు చెల్లించిన వారిని సాధారణ విమానాల్లో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో తీసుకెళ్తాడు. రూ.20లక్షల నుంచి రూ.50 లక్షలు డిపాజిట్‌ చేసే వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్తాడు.  

ఒక్కో వీకెండ్‌కు రూ.40 లక్షల సంపాదన 
ఒక్కో టేబుల్‌పై రూ.2 లక్షల నుంచి 2కోట్ల వరకు పేకాట నడుస్తుంది. ఇందులో ఒక్కో గేమ్‌ను ఒక్కో కిట్‌గా పిలుస్తారు. ప్రతీ కిట్‌పై 5 శాతం కమిషన్‌ను ముందే తీసుకుంటాడు. ఉదాహరణకు ఐదుగురు కలిసి రూ.5లక్షల గేమ్‌ ఆడితే మొత్తం ఆట విలువ రూ.25లక్షలు అవుతుంది. ఈ ఆటలో కమీషన్‌ కింద 5 శాతం అంటే రూ.1.75లక్షలు వస్తుంది. ఇలా ఒక్కో వీకెండ్‌లో రూ.40 లక్షల వరకు ప్రవీణ్‌ సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.5లక్షల వరకే ఆడదామని వెళ్లిన వారు అక్కడి వాతావరణానికి రెచ్చిపోయి రూ.20లక్షల వరకు ఆడతారని జూదరులు చెప్పారు. 

2017లో మారియట్‌ హోటల్లో...  
హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 2017 అక్టోబర్‌లో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటల్‌ మారియట్‌పై దాడి చేశారు. దీపావళి నేపథ్యంలో ఏర్పాటు చేసిన క్యాసినో గుట్టురట్టు చేశారు. కేవలం మూడు రోజుల్లో రూ.80 లక్షలకు పైగా చేతులు మారింది. వారాసిగూడకు చెందిన సంజయ్‌కుమార్‌ ఈ శిబిరం ఏర్పాటు చేయగా... ప్రవీణ్‌ సహా నలుగురు కీలకపాత్ర పోషించి పోలీసులకు చిక్కారు. ఈ శిబిరంలో ప్రవేశించడానికి పేకాటరాయుళ్లు కనీసం రూ.2 లక్షలు చెల్లించి కాయిన్స్‌ (చిప్స్‌) తీసుకుని పేకాట టేబుల్‌పై కూర్చునేలా చేశారు. ఏడో అంతస్తు మొత్తాన్ని బుక్‌ చేసి... సూట్‌ రూమ్‌లో ఒక్కో టేబుల్‌పై 8 మంది కూర్చునేలా మొత్తం ఆరు టేబుళ్లు ఏర్పాటుచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement