సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లను నడపాలా? వద్దా? అనే విషయాన్ని జిల్లా యంత్రాంగమే నిర్ణయించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ప్రాంతంలో వర్షం ప్రభావం ఒక్కోలా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా, కొన్నిచోట్ల వర్ష ప్రభావం అంతగా ఉండటం లేదు. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించడం సరికాదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
వాతావరణ శాఖ నివేదికను పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇవ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ను విద్యాశాఖ తిరస్కరించింది. హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో వర్షం ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో వర్షం ఏమాత్రం లేదని అధికారులు చెబుతున్నారు. కొన్ని జిలా్లల్లో వర్షం కారణంగా స్కూళ్లు నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు, మరికొన్ని జిల్లాల్లో సాధారణ పరిస్థితులు ఉంటున్నాయని గుర్తించారు. వర్షం తీవ్రంగా ఉండి, వరదలు, వాగులు పొంగడం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు విద్యార్థులు స్కూళ్లకు రాలేరని విద్యాశాఖ భావిస్తోంది.
అలాంటప్పుడు జిల్లావ్యాప్తంగా సెలవు ప్రకటించే అధికారం ఆ జిల్లా యంత్రాంగానికే ఉంటుందని, ఈ దిశగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నామని ఓ అధికారి తెలిపారు. వర్షాలతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చిన పక్షంలో ఇతర సా«దారణ సెలవులు తగ్గించి, సిలబస్ పూర్తికి చర్యలు తీసుకోవాలని, అవసరమైనప్పుడు ప్రత్యేక క్లాసులు కూడా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment