
దోమకొండ (కామారెడ్డి): ఆస్తి పంపకం విషయంలో తల్లిని బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంఘమేశ్వర్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన బైకరి లచ్చవ్వకు కుమారులు పెద్ద నర్సయ్య, చిన్న నర్సయ్య ఉన్నారు. ఇద్దరు కొడుకులకు వేర్వేరు ఇళ్లు ఉండగా.. మరో పాత ఇంట్లో లచ్చవ్వ ఉంటోంది. తల్లి ఉంటున్న ఇల్లు విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి.
దీంతో పెద్ద కుమారుడు పెద్ద నర్సయ్య, అతడి భార్య రేణుక, వారి కుమారులు.. లచ్చవ్వ ఇంటికి వచ్చి దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్న నర్సయ్యనూ కొట్టారు. తల్లి లచ్చవ్వను ఇంటి బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశారు. చిన్న నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్సై సుధాకర్ తెలిపారు. తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి తాళం వేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూ..! మీ బతుకు చెడ అంటూ తిట్టిపోశారు.
(మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం)