సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల పరిధిలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) శశాంక్ గోయల్ స్పష్టం చేశారు.హుజూరాబాద్ స్థానం కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఎన్నికల కోడ్ ప్రభావం ఉండదని, యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.
ఉప ఎన్నికల నిర్వహణపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నందున రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 6 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉందని, అన్ని రాష్ట్రాలతో చర్చించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
305 పోలింగ్ కేంద్రాలు
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా కోవిడ్–19 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిందని శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారని, ఎలాంటి ర్యాలీలను అనుమతి ఉండదన్నారు. ప్రచార వాహనాల్లో కూర్చునే పార్టీల నేతలు సైతం కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. హుజూరాబాద్ పరిధిలో 2,36,430 మంది ఓటర్లు ఉండగా, 305 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. పోలింగ్‌లో ఉపయోగించనున్న ఈవీఎంలకు ఇప్పటికే అన్ని పార్టీల సమక్షంలో తనిఖీలు పూర్తి చేశామన్నారు. వయోజనులు, దివ్యాంగులు, కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు పోస్టల్‌బ్యాలెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. పోలింగ్‌కు వారం ముందు వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment