సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంతో సహా ఏదైనా కేటగిరీ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రాయితీలు ఇవ్వాలనుకుంటే, నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయానికి ఉచితంగా, గృహాలు, ఇతర వినియోగదారులకు రాయితీపై తక్కువ టారిఫ్‌తో విద్యుత్ సరఫరా కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు విద్యుత్ సబ్సిడీలను చెల్లిస్తున్నాయి. డీబీటీ విధానం వస్తే ముందుగా రైతులు, ఇతర వినియోగదారులు పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు విద్యుత్ సబ్సిడీ మొత్తాలను బదిలీ చేస్తాయి.
విద్యుత్ విధానంలో కీలక సిఫారసులు
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటిం చిన ముసాయిదా జాతీయ విద్యుత్ విధానం– 2021లో పలు కీలక సిఫారసులు చేసింది. కాలుష్య రహిత, సుస్థిర విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడం, అవసరాలకు తగ్గట్టు విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను అభివృద్ధి పరచడం, డిస్కంలకు పునరుజ్జీవనం కల్పించడం, విద్యుత్ రంగంలో వ్యాపారాలను ప్రోత్సహించడం, విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలకు సంబంధించిన పరికరాల ఉత్పత్తిని దేశంలో ప్రోత్సహించడం, నిబంధనలను సరళీకరించడం వంటి లక్ష్యాలతో ఈ ముసాయిదాకు కేంద్రం రూపకల్పన చేసింది. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం రానున్న ఐదేళ్లలో దీనిని అమలుపరచనుంది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
డిసెంబర్ 22లోగా మీటర్ల అనుసంధానం
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఫీడర్లు అన్నింటికీ కమ్యూనికబుల్ మీటర్లు్ల/ ఏఎంఆర్ మీటర్లను బిగించి, వాటిని నేషనల్ పవర్ పోర్టల్ (ఎన్‌పీపీ)తో డిసెంబర్ 22లోగా అనుసంధానం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు గడువు విధించింది. నాన్–కమ్యూనికబుల్ మీటర్లు ఉన్న స్థానంలో కమ్యూనికబుల్ మీటర్లు బిగించాలని స్పష్టం చేసింది. కచ్చితమైన విద్యుత్ సరఫరా లెక్కలు, ఆడిటింగ్ కోసం రానున్న మూడేళ్లలో 100 శాతం డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించాలని కోరింది.
ఇక రెండు టారిఫ్‌ల విధానం...
విద్యుత్ డిమాండ్ అత్యధికం (పీక్), అత్యల్పం (ఆఫ్–పీక్) ఉన్న సమయాల్లో వేర్వేరు విద్యుత్ టారిఫ్‌లను వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలి. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్న వేళల్లో తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలు చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించాలి. ఏటా గడువులోగా క్రమం తప్పకుండా విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు సమర్పించేలా ఈఆర్సీలు చర్యలు తీసుకోవాలి. విద్యుత్ సరఫరాకు అవుతున్న మొత్తం వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో రాబట్టుకునేలా టారిఫ్‌ను ఈఆర్సీలు ఖరారు చేయాలి.
ప్రైవేటీకరణే శరణ్యం..
విద్యుత్ పంపిణీ రంగంలో సుస్థిరత, అభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యాన్ని (పీపీపీ) ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణతో వినియోగ దారులకు మెరుగైన సేవలు లభించడంతో పాటు పోటీతత్వం వృద్ధి చెందుతుంది. ప్రైవేటు ఫ్రాంచైజీల ఏర్పాటు ద్వారా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టాలి. ఇందుకు డిస్కంల పరిధిలోని కొంత ప్రాంతంలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను థర్డ్‌పార్టీకి కాంట్రాక్టు పద్ధతిలో అప్పగించాలి. రాష్ట్ర ఈఆర్సీ ఆమోదంతో సబ్ లైసెన్సీల ఏర్పాటు ద్వారా కూడా ప్రైవేటీకరణను ప్రవేశపెట్టవచ్చు.
10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి
ప్రస్తుతం దేశం 6,780 మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండగా, రానున్న 10 ఏళ్లలో మరో 10 వేల మెగావాట్ల అణు విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఉన్న అవకాశాలపై పరిశీలన జరపాలని నిర్ణయించింది.
స్మార్ట్ మీటర్లతో చాలా చేయొచ్చు
విద్యుత్ చౌర్యం నివారణ కోసం విద్యుత్ ఆడిటింగ్ వ్యవస్థలో భాగంగా స్మార్ట్ మీటర్లను వినియోగించాలి. వ్యవసాయ వినియోగ దారులకు మీటర్లు ఏర్పాటు చేయడంలో ఆశించిన పురోగతిని రాష్ట్రాలు సాధించలేదు. ఈ విధానాన్ని ప్రకటించిన తర్వాత ఏడాదిలోగా వ్యవసాయ వినియోగదారులతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు
100 శాతం మీటర్లు బిగించాలి. 3 ఏళ్లలోగా 100 శాతం వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించాలి. దీని ద్వారా పీక్, ఆఫ్ పీక్ టారిఫ్ విధానాన్ని అమలు చేయవచ్చు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వినియోగంలోకి తీసుకొస్తే సుదూర ప్రాంతం (రిమోట్) నుంచి మీటర్ రీడింగ్, బిల్లింగ్, బిల్లుల కలెక్షన్, బిల్లులు చెల్లించకుంటే డిస్ కనెక్షన్ వంటి పనులను డిస్కంలు నిర్వహించవచ్చు. ఇకపై విడుదల చేసే కొత్త కనెక్షన్లకు తప్పనిసరిగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలి.
Comments
Please login to add a commentAdd a comment