గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లో త్రిసభ్య కమిటీకి వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగసంఘాల నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘కోవిడ్–19 నష్టాల నుంచి కోలుకుం టున్నాం. అన్ని రంగాలు తిరిగి యథాతథ స్థితికి వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్లు గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక కారణాలను చూపి ఉద్యో గులకు పీఆర్సీ నివేదికలో సూచించినట్లు ఫిట్‌మెంట్‌ను 7.5 శాతం ఇస్తే ఊరుకునేది లేదు. ఇదివరకంటే మెరుగైన ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పీఆర్సీ నివేదికలోని లోపాలను సరిదిద్ది ఉద్యోగు లకు ఆమోదయోగ్యమైనట్లుగా సవరణలు చేయాలి’అని ఉద్యోగ సంఘాలు త్రిసభ్య కమిటీ ముందు ముక్తకంఠంతో తేల్చి చెప్పాయి. వేతన సవరణ కమిటీ నివేదిక పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధ్యక్షతన మరో ఇద్దరు ముఖ్య కార్యదర్శులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి అభిప్రాయ సేకరణ జరిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలను ఒక్కొక్కటిగా పిలిచి నాయకుల వాదనలు, సూచనలు, డిమాం డ్లను త్రిసభ్య కమిటీ సభ్యులు రికార్డు చేసుకున్నారు. ఇదే సమయంలో పీఆర్సీ నివేదికలోని అంశాలు, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సైతం త్రిసభ్య కమిటీ సభ్యులు ఆయా సంఘాల నేతలకు వివరించే ప్రయ త్నం చేశారు. ప్రధానంగా కోవిడ్–19 దెబ్బ రాష్ట్ర ఖజానాపై తీవ్రంగా ప్రభావం చూపించినట్లు త్రిసభ్య కమిటీ సభ్యులు వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ప్రస్తుతం పీఆర్‌సీ సూచించిన విధంగా ఫిట్‌మెంట్, ఇతర అలవెన్సులకు ఒప్పుకోవాలని చెప్పే ప్రయ త్నం చేశారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరింత లబ్ధి చేకుర్చుతుందని వివరించారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం కమిటీ సభ్యుల సూచనలతో ఏకీభవించలేదు. వేతన పెంపు ఐదేళ్లకోసారి జరుగుతుందని, ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్‌ను ప్రభుత్వం కల్పించాలని, ఇందులో వాయిదాలు వేయొద్దని సంఘాలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఉద్యోగ సంఘ నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్న త్రిసభ్య కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
ఫిట్‌మెంట్ 65 శాతం ఇవ్వాలని కోరాం
ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 65 శాతం ఉండాలని మొదటినుంచి కోరాం. పీఆర్‌సీకి కూడా ఇదే విధమైన ప్రతిపాదనలు ఇచ్చాం. కానీ కమిటీ ఉద్యోగులను తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో రెవెన్యూ శాఖ కూడా పెద్దది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను విజయవంతంగా అమలు చేయడంలో రెవెన్యూ ఉద్యోగుల కృషి ఎంతైనా ఉంది. ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంచాలి. పీఆర్సీ రిపోర్టు ఫైనల్ కాదు. ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్. – వంగ రవీందర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్
జూలై 2018 నుంచి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి
పీఆర్‌సీ సూచించిన 7.5 శాతం ఫిట్‌మెంట్ వద్దు. ఇదివరకు ఇచ్చినదానికంటే మెరుగ్గా ఉండాలి. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలను కూడా జూలై 2018 నుంచే అమలు చేయాలి. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను పెంచాల్సిన అవసరం ఉంది. గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంచాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస బేసిక్‌పేను అమలు చేయాలి. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. – చావరవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
45% ఫిట్‌మెంట్‌తో వేతన స్కేళ్లు సవరించాలి
వేతన సవరణ కమిటీ సిఫారసులను సవరించి 45 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన స్కేళ్లను మార్పు చేయాలి. సీపీఎస్‌ను రద్దుచేసి, ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను యథాతథంగా అమలు చేయాలి. ఇంక్రిమెంట్ రేటును 3 శాతం కొనసాగించాలి. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ కేడర్‌ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తగ్గించాలి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు 50 శాతం వేతనాలు పెంచాలి.
–పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పి.శ్రీపాల్‌రెడ్డి, బి.కమలాకర్‌రావు
ఉద్యోగుల ఆకాంక్షలను గుర్తించాలి
ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వమే గుర్తించి వేతన పెంపుపై నిర్ణయం తీసుకోవాలి. పీఆర్‌సీ నివేదికే వేతన పెంపునకు ప్రామాణికం కాదు. ఉద్యోగ సంఘాల డిమాండ్లను పరిశీలించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలి. గతంలో కంటే మెరుగ్గా వేతన పెంపు ఉండాలనేది మా ప్రధాన డిమాండ్. ఆర్థిక ప్రయోజనాలను జూలై 2018 నుంచి అమలు చేయాలి. హెచ్‌ఆర్‌ఏ పెంచాలి. –జి.సదానంద్‌గౌడ్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment