వర్సిటీ వరమిచ్చినా కాలేజీల కొర్రీలు!   | Engineering Exams Starts From 12/10/2020 In Telangana | Sakshi
Sakshi News home page

వర్సిటీ వరమిచ్చినా కాలేజీల కొర్రీలు!  

Published Mon, Oct 5 2020 3:25 AM | Last Updated on Mon, Oct 5 2020 3:25 AM

Engineering Exams Starts From 12/10/2020 In Telangana - Sakshi

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈనెల 12 నుంచి బీటెక్, ఎంటెక్‌ తదితర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉంటున్న చోటే ఏదైనా కాలేజీలో పరీక్ష రాసే అవకాశాన్ని జేఎన్‌టీయూ కల్పించింది. కానీ విద్యార్థి చదువుతున్న కాలేజీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. తమ కాలేజీకి వచ్చి పరీక్షలు రాయాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక, కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండేందుకు జంకుతున్నాడు.

ఇదీ ఆ ఒక్క విద్యార్థి పరిస్థితే కాదు.. జేఎన్‌టీయూ పరిధిలో ఇంజనీరింగ్‌ తదితర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు చదువుతున్న వేల మందిదీ.. ఆయా విద్యార్థులందరికీ ఇప్పుడు పరీక్షల తంటా వచ్చి పడింది. కరోనా నేపథ్యంలో తమ గ్రామాలకు వెళ్లిపోయిన విద్యార్థులు ఈనెల 12 నుంచి జరిగే సెమిస్టర్‌ పరీక్షలకు ఎలా హాజరు కావాలన్న ఆందోళనలో పడ్డారు. తామున్న చోటే పరీక్షలు రాసేలా జేఎన్‌టీయూ అనుమతిచ్చినా చాలా కాలేజీల యాజమాన్యాలు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఏ విద్యార్థి ఎక్కడ పరీక్షలు రాయాలనుకుంటున్నారో ఆ వివరాలను కాలేజీ యాజమాన్యాలు సేకరించి జేఎన్‌టీయూకు అందజేయాల్సి ఉంది. అయితే ఆ పనిని తప్పించుకునేందుకు యాజమాన్యాలు పరీక్షలు రాసేందుకు కాలేజీకి రావాల్సిందేనని చెబుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

హాస్టళ్లలో ఉండేదెలా..? 
జేఎన్‌టీయూ పరిధిలోని దాదాపు 450 సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులను అందించే కాలేజీలున్నాయి. అందులో 300కు పైగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిల్లో ఆరేడు లక్షల మంది ఉన్నారు. అందులో బీటెక్, ఎంటెక్‌ తదితర కోర్సుల్లో ఫైనలియర్‌ చదివే విద్యార్థులు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. వారికి గత నెలలో పరీక్షలు నిర్వహించింది. ఇక రెండో, మూడో విడతలో మిగతా సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 12వ తేదీ నుంచి నవంబర్‌ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేసింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో విద్యార్థులు తమ కాలేజీలకు వచ్చి పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తాముంటున్న ప్రాంతంలోని ఏదైనా కాలేజీ పేరు ఇస్తే అక్కడ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఆ వివరాలను విద్యార్థులు తాము చదువుతున్న కాలేజీల్లో అందజేయాలని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది.

ఈ నిబంధనను చాలా కాలేజీలు అనుమతించడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిగా పేరున్న కాలేజీలు ఇందుకు ఒప్పుకోవడం లేదని, కాలేజీకి రావాల్సిందేనని చెబుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని టాప్‌ కాలేజీలు ఇలా చేస్తున్నాయని, విద్యార్థి వారీగా వివరాలను సేకరించి, వాటిని యూనివర్సిటీకి పంపించే పని నుంచి తప్పుకునేందుకే, హాస్టళ్ల ఫీజుల కోసం పిల్లలను కాలేజీలకు రమ్మని చెబుతున్నాయని ఆరోపిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను హాస్టళ్లకు ఎలా పంపాలని, హాస్టళ్లకు వచ్చే వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా, అందరికీ వ్యాపించే ప్రమాదమేనంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడి విద్యార్థులు అక్కడే పరీక్షలు రాసేలా జేఎన్‌టీయూ జారీ చేసిన నిబంధనను కాలేజీలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement