engineering exams
-
స్పష్టమైన వైఖరి తెలపండి: విద్యార్థుల డిమాండ్
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయడం లేదా ఆన్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీనగర్ కాలనీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. అంతకుముందు సత్యసాయి నిగమాగమం నుంచి సబిత నివా సం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా సబిత జోక్యం చేసుకుని ఆందోళనను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. విద్యార్థి నాయకులతో మాట్లాడి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థులు ఎక్కడ కోరితే అక్కడ పరీక్షా కేంద్రాలు ఉండేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే విద్యార్థులు ఆ సమాధానంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. స్పష్టమైన వైఖరి తెలపాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ఓయూ డిగ్రీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కంట్రోలర్ ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూ పరిధిలో ఈనెల 8 నుంచి ప్రారంభంకానున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేశ్ సోమవారం తెలిపారు. కరోనా వ్యాప్తి కారాణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 8 నుంచి వివిధ డిగ్రీ కోర్సుల 3, 5 సెమిస్టర్ పరీక్షలు, ఈనెల 27 నుంచి 6, 1 సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. యూనివర్సిటీ వెబ్సైట్లో పరీక్షల టైం టేబుల్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. గతంలో జారీచేసిన హాల్‌టికెట్లు, ఇంతకు ముందు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే పరీక్షలు జరుగుతాయన్నారు. -
విషమ పరీక్ష
-
వర్సిటీ వరమిచ్చినా కాలేజీల కొర్రీలు!
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈనెల 12 నుంచి బీటెక్, ఎంటెక్ తదితర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉంటున్న చోటే ఏదైనా కాలేజీలో పరీక్ష రాసే అవకాశాన్ని జేఎన్టీయూ కల్పించింది. కానీ విద్యార్థి చదువుతున్న కాలేజీ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. తమ కాలేజీకి వచ్చి పరీక్షలు రాయాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో ఏం చేయాలో అర్థంకాక, కరోనా నేపథ్యంలో హాస్టళ్లలో ఉండేందుకు జంకుతున్నాడు. ఇదీ ఆ ఒక్క విద్యార్థి పరిస్థితే కాదు.. జేఎన్టీయూ పరిధిలో ఇంజనీరింగ్ తదితర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులు చదువుతున్న వేల మందిదీ.. ఆయా విద్యార్థులందరికీ ఇప్పుడు పరీక్షల తంటా వచ్చి పడింది. కరోనా నేపథ్యంలో తమ గ్రామాలకు వెళ్లిపోయిన విద్యార్థులు ఈనెల 12 నుంచి జరిగే సెమిస్టర్ పరీక్షలకు ఎలా హాజరు కావాలన్న ఆందోళనలో పడ్డారు. తామున్న చోటే పరీక్షలు రాసేలా జేఎన్టీయూ అనుమతిచ్చినా చాలా కాలేజీల యాజమాన్యాలు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఏ విద్యార్థి ఎక్కడ పరీక్షలు రాయాలనుకుంటున్నారో ఆ వివరాలను కాలేజీ యాజమాన్యాలు సేకరించి జేఎన్టీయూకు అందజేయాల్సి ఉంది. అయితే ఆ పనిని తప్పించుకునేందుకు యాజమాన్యాలు పరీక్షలు రాసేందుకు కాలేజీకి రావాల్సిందేనని చెబుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాస్టళ్లలో ఉండేదెలా..? జేఎన్టీయూ పరిధిలోని దాదాపు 450 సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులను అందించే కాలేజీలున్నాయి. అందులో 300కు పైగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిల్లో ఆరేడు లక్షల మంది ఉన్నారు. అందులో బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల్లో ఫైనలియర్ చదివే విద్యార్థులు దాదాపు లక్ష మంది వరకు ఉన్నారు. వారికి గత నెలలో పరీక్షలు నిర్వహించింది. ఇక రెండో, మూడో విడతలో మిగతా సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 12వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో విద్యార్థులు తమ కాలేజీలకు వచ్చి పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదని, తాముంటున్న ప్రాంతంలోని ఏదైనా కాలేజీ పేరు ఇస్తే అక్కడ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఆ వివరాలను విద్యార్థులు తాము చదువుతున్న కాలేజీల్లో అందజేయాలని జేఎన్టీయూ స్పష్టం చేసింది. ఈ నిబంధనను చాలా కాలేజీలు అనుమతించడం లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొద్దిగా పేరున్న కాలేజీలు ఇందుకు ఒప్పుకోవడం లేదని, కాలేజీకి రావాల్సిందేనని చెబుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని టాప్ కాలేజీలు ఇలా చేస్తున్నాయని, విద్యార్థి వారీగా వివరాలను సేకరించి, వాటిని యూనివర్సిటీకి పంపించే పని నుంచి తప్పుకునేందుకే, హాస్టళ్ల ఫీజుల కోసం పిల్లలను కాలేజీలకు రమ్మని చెబుతున్నాయని ఆరోపిస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను హాస్టళ్లకు ఎలా పంపాలని, హాస్టళ్లకు వచ్చే వారిలో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా, అందరికీ వ్యాపించే ప్రమాదమేనంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడి విద్యార్థులు అక్కడే పరీక్షలు రాసేలా జేఎన్టీయూ జారీ చేసిన నిబంధనను కాలేజీలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇంటర్ వెయిటేజీకి మంగళం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ర్యాం కుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ పరీక్ష అయిన జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనే ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎత్తివేసిన నేపథ్యంలో.. ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇంజనీరింగ్ ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలని కేంద్రం నిర్ణయించడం, రాష్ట్ర ప్రభు త్వం ఇంటర్లో గ్రేడింగ్ విధానం అమలు చేయాలని యోచిస్తుండడంతో వెయిటేజీ తొలగింపు అంశం తెరపైకి వచ్చింది. గ్రేడింగ్ అమల్లోకి వస్తే.. విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఇంటర్లో మార్కుల ప్రకటన కాకుండా, గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గతంలో కమిటీ కూడా వేశారు. ఇటీవల ప్రైవేటు కాలేజీల యాజమాన్య ప్రతినిధుల భాగస్వామ్యం కలిగిన బోర్డు సలహా మండలి కూడా 2018 మార్చిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో గ్రేడ్ల ప్రక్రియను ప్రారంభించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు అందజేయనుంది. దానికి ప్రభుత్వ ఆమోదం వస్తే గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ పరిస్థితి ఏమిటన్న చర్చ జరిగింది. ఈ సందర్భంగా మూడు రకాల ఆలోచనలు చేసింది. వీటిని కూడా త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. వెయిటేజీ రద్దుకే మొగ్గు! ఇంటర్ బోర్డు సలహా మండలి మూడు రకాల ప్రతిపాదనలు చేస్తున్నా.. ప్రధానంగా వెయిటే జీ రద్దుపైనే దృష్టి సారించినట్లు సమాచారం. సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను బట్టి వెయిటేజీ లెక్కించడం అశాస్త్రీయం అవుతుందన్న భావ న ఉంది. మరో ప్రతిపాదన మేరకు ఎంసెట్ కన్వీనర్‌కు మార్కులను అందజేసినపుడు.. ఆ మార్కుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థికి ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు నచ్చకపోతే తన ఇంటర్ మార్కుల కోసం, జవాబు పత్రం ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలా కార్పొరేట్ సంస్థలు తమ విద్యార్థులతో జవాబుపత్రాల ఫొటో కాపీల కోసం దరఖాస్తు చేయించుకుని.. మార్కులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇంటర్ వెయిటేజీని రద్దు చేయడమే మేలని భావిస్తున్నారు. జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే ఇంజనీరింగ్ ప్రవేశాలు! జాతీయ స్థాయి పరీక్ష అయిన జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)’ద్వారా జాతీయ స్థాయి పరీక్షలన్నింటినీ నిర్వహించాలని కూడా ఇంతకుముందే నిర్ణయించింది. నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షలను ఎన్టీఏ పరిధిలోకి తేవాలని యోచిస్తోంది. 2019లో ఇది అమల్లోకి తెచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఎంసెట్ పరీక్షే అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాలని ఓ అధికారి పేర్కొన్నారు. ఇవీ మూడు రకాల ప్రతిపాదనలు 1 కేంద్రం జేఈఈ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలగించింది. అదే తరహాలో ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించి.. ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలి. 2 మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లను బట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వాలి. 3 విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా ఇంటర్ బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. బోర్డు ఈ మార్కులను ఎంసెట్ కన్వీనర్‌కు అందజేస్తే.. ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ర్యాంకును ఖరారు చేయవచ్చు. -
రేపటి నుంచి ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథం
హైదరాబాద్: మే 3 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్ పరీక్షలు యధాతథంగా జరగనున్నట్టు జేఎన్టీయూహెచ్ ఆదివారం వెల్లడించింది. అయితే సిబ్బంది సహకరించడం లేదంటూ కాలేజీ యాజమాన్యాలు చేస్తున్న ప్రయత్నాలు పట్టించుకోమని పేర్కొంది. అలాగే యూనివర్సిటీ డైరెక్షన్లో కాలేజీలు పనిచేయాలే తప్పా.. కాలేజీల డైరెక్షన్లో యూనివర్సిటీ వ్యవహారించదని జేఎన్టీయూహెచ్ అధికారులు స్పష్టం చేశారు. -
జిల్లాలో ఎంసెట్ పరీక్షా కేంద్రాల వివరాలు
వైవీయూ : ఈ నెలలో నిర్వహించనున్న ఎంసెట్-2015కు సంబంధించిన పరీక్షా కేంద్రాలను ఎంసెట్ కడప ప్రాంతీయ సమన్వయకర్త, వైవీయూ ప్రవేశసంచాలకుడు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి ప్రకటించారు. మెడిసిన్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ పరీక్షలు రాసే కేంద్రాలను తెలియజేశారు. ఇంజినీరింగ్ పరీక్షా కేంద్రాలు 1. కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్, కడప 2. ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల, నాగరాజుపేట, కడప 3. నాగార్జున డిగ్రీ, పీజీ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా, కడప 4. శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల, బాలాజీనగర్, కడప 5. ప్రభుత్వ పురుషుల కళాశాల, రిమ్స్రోడ్, కడప 6. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సెన్సైస్, ఆర్టీఓ కార్యాలయం వెనుక, ఊటుకూరు, రాయచోటిరోడ్డు, కడప 7. కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్డు, కడప 8. కేఓఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్డు, కడప 9. శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ (స్విస్ట్), పులివెందుల రోడ్, కడప 10. గ్లోబల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, అశోక్‌లేలాండ్ ఎదురుగా, చిన్నమాచుపల్లి, చెన్నూరు మండలం, కడప మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పరీక్షా కేంద్రాలు.. 1. కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, పులివెందులరోడ్, కడప 2. ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల, నాగరాజుపేట, కడప 3. నాగార్జున డిగ్రీ, పీజీ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్టీసీ బస్టాండు ఎదురుగా, కడప 4. శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాల, బాలాజీనగర్, కడప 5. ప్రభుత్వ పురుషుల కళాశాల, రిమ్స్రోడ్, కడప 6. అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సెన్సైస్, ఆర్టీఓ కార్యాలయం వెనుక, ఊటుకూరు, రాయచోటిరోడ్డు, కడప. -
సబ్జెక్టుపై పట్టు సాధిస్తేనే అనుకున్న మార్కులు
ఇంజనీరింగ్.. ప్రాక్టికల్ ఓరియెంటెడ్ అయినప్పటికీ థియరీ పరంగా సాధించిన మార్కులకు కూడా ఎనలేని ప్రాధాన్యత ఉంటోంది. క్యాంపస్/ఆఫ్ క్యాంపస్ ఏ రిక్రూట్మెంట్ విధానంలో చూసినా నిర్దేశిత మార్కులు సాధించని విద్యార్థులను ఇంటర్వ్యూ కోసం కనీసం షార్ట్‌లిస్ట్ చేయడానికి కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదంటే.. మార్కుల ఔన్నత్యం తెలుస్తోంది. పదుల సంఖ్యలో ఉండే సబ్జెక్టులు.. విస్తృత సిలబస్.. నిరంతరంగా సాగే మూల్యాంకన ప్రక్రియ నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులు పక్కాప్రణాళికతో ముందుకు సాగాలి. అప్పుడే చక్కని పర్సంటేజ్‌తో కోర్సును పూర్తి చేయడంతోపాటు అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. కంపెనీలు ఉద్యోగ నియామకాల సందర్భంలో అభ్యర్థుల అర్హతను ప్రకటించేటప్పుడు కనీసం 60-75 శాతం మార్కులు ఉండాలని పేర్కొంటున్నాయి. మరికొన్ని కంపెనీలు అగ్రిగేట్ మార్కులతోపాటు అన్ని సబ్జెక్టులలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన పెడుతున్నాయి. విద్యార్థులు దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించాలి. మంచి మార్కుల సాధనకు పక్కాగా ప్రిపేరవ్వాలి. లేదంటే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఇక్కడ విద్యార్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ఎక్కువ మార్కులు సాధించడానికి ఎటువంటి షార్ట్‌కట్స్ లేవు. సబ్జెక్టుపై పట్టు సాధిస్తేనే పరీక్షల్లో మంచి మార్కులు సాధ్యం. రెండు రకాలు: ఇంజనీరింగ్ విద్యార్థులు కోర్సులో భాగంగా రెండు రకాల పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. అవి.. ఒకటి ఇంటర్నల్ పరీక్షలు (మిడ్ ఎగ్జామ్స్). రెండోది ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ (యూనివర్సిటీ పరీక్షలు). ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కులను కలిపి పర్సంటేజీ లెక్కించి మార్కులు కేటాయిస్తారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని విశ్వవిద్యాల యాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నల్ పరీక్షలకు 20 నుంచి 30 శాతం మార్కులు, ఎక్స్టర్నల్ పరీక్షలకు 70 నుంచి 80 శాతం మార్కుల వెయిటేజీ ఇస్తున్నారు. ఇంజనీరింగ్‌లో స్కోరింగ్‌లో ఇంటర్నల్స్ది ప్రధానపాత్ర. అయితే కోర్సు మధ్యలో నిర్వహించే ఇంటర్నల్స్‌లో విద్యార్థులు సులువుగా మార్కులు సాధించొచ్చనే ధోరణితో వ్యవహరించొద్దు. ఇంటర్నల్స్‌కు పక్కాగా ప్రిపేరైతే సెమిస్టర్ పరీక్షల్లోనూ సులువుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో ఇంటర్నల్స్, ఎక్ ్సటర్నల్స్ మార్కులపై దృష్టిసారించి తద్వారా మంచి మార్కుల శాతాన్ని పొందడానికి కృషిచేయాలి. ఎందుకు? ప్రతి సెమిస్టర్లో రెండుసార్లు ఆయా కళాశాల అధ్యాపకులు విద్యార్థి ప్రగతి (ప్రోగ్రెస్)ని పరీక్షించడానికి నిర్వహించే పరీక్షలు ఇంటర్నల్ ఎగ్జామ్స్. ఈ పరీక్షలు విద్యార్థి నిరంతర సాధనకు ఉపయోగకారిగా ఉంటాయి. ఇంజనీరింగ్ పాఠ్యాంశాల్లోని ప్రతి అంశం ప్రాధాన్యతతో కూడుకుని ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఏ ఒక్క అంశాన్నీ చాయిస్ కింద విడిచి పెట్టకూడదు. కాబట్టి విద్యార్థి అన్ని అంశాలను అధ్యయనం చేసేందుకు ఈ పరీక్షలు ఉపయుక్తంగా ఉంటాయి. అంతేకాకుండా విద్యార్థి ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి. అపరిమిత స్వేచ్ఛ కారణంగా డిగ్రీ స్థాయి విద్యార్థుల్లో కొంత అలసత్వం, ఇతర వ్యాపకాల కారణంగా తరగతులకు సరిగా హాజరు కాకపోవడం, చదువు పట్ల అశ్రద్ధ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటువంటి విద్యార్థులను తిరిగి చదువుపై దృష్టి సారించేలా చేయడానికి ఇవి కొంతవరకు దోహదం చేస్తాయి. మరికొంత మంది విద్యార్థులు సంవత్సరం చివర పరీక్షలకు ముందుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. బట్టీ పట్టి పరీక్షల్లో గట్టెక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అలాకాకుండా విద్యార్థి నిరంతరంగా సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టడానికి కూడా ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. కొత్తగా వస్తున్న గ్రేడింగ్ విధానంలోనైతే రోజువారీ తరగతులకు కూడా కొన్ని మార్కులు కేటాయిస్తున్నారు. దీనివల్ల విద్యార్థి నిరంతర అధ్యయనానికి వీలుంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్‌ను సంబంధిత సబ్జెక్ట్ అధ్యాపకులే నిర్వహించి మార్కులు కేటాయిస్తారు. ఈ పరీక్షలు రెండు విధాలు. అవి.. ఒకటి అసైన్మెంట్లు. రెండోది సెషనల్స్. అసైన్మెంట్స్: ఇంటి దగ్గర చేయాల్సిన హోమ్ వర్క్ వంటివి అసైన్మెంట్స్. అధ్యాపకుడు తరగతి గదిలో ఎక్కువ ఉదాహరణలు ఇవ్వలేడు. కాబట్టి అటువంటి అంశాలను హోమ్‌వర్క్ కింద విద్యార్థులకు కేటాయిస్తాడు. ఈ అసైన్మెంట్స్ వల్ల విద్యార్థి సబ్జెక్ట్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయవచ్చు. అంతేకాకుండా ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి రెండు-మూడు రకాల పుస్తకాలను రిఫర్ చేయాల్సి ఉంటుంది. తద్వారా సబ్జెక్ట్‌పై మరింత అవగాహనకు ఆస్కారం ఉంటుంది. ఈ క్రమంలో లైబ్రరీని ప్రభావం తంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. సెషనల్స్: ఇవి ఇంటర్నల్ పరీక్షలు. పబ్లిక్ పరీక్షలను పోలి ఉంటాయి. కాబట్టి పబ్లిక్ పరీక్షలకు ముందుగానే సంసిద్ధులు కావడానికి ఇంటర్నల్ పరీక్షలు దోహదపడతాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో హాజరు (అటెండెన్స్)కు కూడా మార్కులు కేటాయిస్తున్నారు. 100 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు గరిష్టంగా 5 మార్కులను సంబంధిత సబ్జెక్ట్‌లో కలుపుతున్నారు. అవగాహనతో: తరగతులను నిర్లక్ష్యం చేయకుండా 100 శాతం హాజరు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సబ్జెక్ట్‌పై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. తరగతి గదిలో పాఠాలను జాగ్రత్తగా విని, ఎప్పటికప్పుడు వాటిని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి. సొంత ప్రిపరేషన్‌తో ఇంజనీరింగ్ సబ్జెక్టులపై పట్టు పెంచుకోవాలి. చదవాల్సిన సబ్జెక్టులను వాయిదా వేయడం మంచి పద్ధతి కాదు. అలా చేస్తే చివరికి సిలబస్ కొండలా మారుతుంది! ఏరోజు పాఠాలు ఆ రోజు చదివి అప్డేట్గా ఉంటే ఇంటర్నల్స్‌లో మంచి మార్కులు సాధించవచ్చు. ప్రతి చాప్టర్ చివర ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో కామన్ సిలబస్‌ను అభ్యసించి రెండో సంవత్సరం కోర్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఈ దశలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సబ్జెక్టులను లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రయత్నించాలి. కోర్సు మొత్తానికి దిశానిర్దేశం జరిగేది ఇక్కడే. మంచి మార్కులు సాధించాలన్నా.. కోర్సుపై పూర్తి అవగాహన ఏర్పడాలన్నా ఈ దశే కీలకం. కాబట్టి మొదటి సంవత్సరం నుంచి అగ్రిగేట్ మార్కులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక ప్రకారం చదవాలి. కీలకం.. నోట్స్: చక్కని మార్కులు సాధించడంలో కీలకమైన అంశం.. నోట్స్ ప్రిపరేషన్. సాధారణంగా అధ్యాపకులు ప్రతి అంశానికి రన్నింగ్ నోట్స్ ఇస్తుంటారు. దాని సహాయంతో, వివిధ రిఫరెన్స్ పుస్తకాల సహాయంతో నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా పరీక్షలకు ప్రస్తుతం గైడ్స లభిస్తున్నాయి. వాటి ద్వారా విద్యార్థులు పాస్ మార్కులు సాధించగలరేమో కానీ సబ్జెక్టుపై పరిజ్ఞానం పొందలేరు. ప్రామాణిక పుస్తకాల నుంచి ప్రాథమిక భావనలను సంగ్రహించి నోట్స్ తయారు చేసుకుంటే ప్రయోజనం. అంశాలవారీగా, సబ్జెక్టులవారీగా, ముఖ్యమైన నిర్వచనాలు, ఫార్ములాలను ఒకచోట రాసుకోవడం ద్వారా క్విక్ రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత సాధన: ఇంజనీరింగ్ సబ్జెక్టులు పూర్తి అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి కాబట్టి బట్టీ తరహా విధానాలు ఏ మాత్రం ఉపకరించవని విద్యార్థులు తెలుసుకోవాలి. సబ్జెక్టుల్లో అంతర్భాగంగా ఉన్న సమస్యలను వీలైనంత ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడొచ్చు. ఏదో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు సాధించినందుకు బాధపడితే ఫలితం ఉండదు. సంబంధిత సబ్జెక్టులో తక్కువ మార్కులు రావడానికి కారణమేంటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రాక్టికల్స్ కూడా : థియరీ మాదిరిగానే ప్రాక్టికల్స్‌లో కూడా ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. వీటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఇంటర్నల్ మార్కులను మూడు అంశాలాధారంగా కేటాయిస్తారు. అవి.. ఒకటి హాజరు, రెండు రికార్డు, మూడోది చేసిన ఎక్స్పెరిమెంట్. ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతివారం విద్యార్థి చేసే ప్రాక్టికల్స్‌కు మార్కులు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి ప్రతి ప్రాక్టికల్‌ను శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది. తద్వారా సబ్జెక్ట్‌పై మరింత పట్టు సాధించడం సులభమవుతుంది. ఏదైనా అంశాన్ని ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే సంపూర్ణ విషయ పరిజ్ఞానం సొంతమవుతుంది. ప్రయోగాత్మకంగా లేని పుస్తక విజ్ఞానం ప్రయోజనం చేకూర్చదు. ల్యాబ్స్‌లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలు సెమిస్టర్ పరీక్షల్లోనూ మేలు చేస్తాయి. అప్పుడే ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. పరీక్షల సమయంలో: పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. ప్రణాళిక ప్రకారం చదివి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమించాలి. గతంలో సరిగా ప్రిపేరవ్వని, వదిలేసిన సబ్జెక్టులపై దృష్టి సారించాలి. అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యమివ్వాలి. కష్టంగా ఉన్నాయనే కారణంగా కొన్ని సబ్జెక్టులను వదిలేయడం మంచిది కాదు. ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పటికీ అర్థం కాని అంశాలుంటే ప్రొఫెసర్లు, స్నేహితులను సంప్రదించాలి. ప్రశ్నపత్రం విధానం, యూనిట్స్ వారీగా అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అప్పుడే పరీక్షల్లో పూర్తిస్థాయిలో రాణిస్తారు. పరీక్షలకు సన్నద్ధంగా: కేవలం పుస్తకాల్లో ఉన్నది చదివి... పరీక్షలకు సిద్ధమయ్యామని భావిస్తే పొరపాటే. ఎందుకంటే ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో ప్రశ్నలు ఎక్కువగా అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా అడుగుతారు. వాటికి సమాధానాలు రాయాలంటే అన్ని అంశాలపై లోతైన అవగాహన ముఖ్యం. నేర్చుకున్న అంశాలపై ఏ కోణంలో ప్రశ్నలు అడిగినా రాసేలా సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మరో ముఖ్య విషయం.. పరీక్షలో ప్రజెంటేషన్. నేర్చుకున్న విషయాలను పేపర్‌పై సరిగ్గా పెట్టగలగాలి. స్పెల్లింగ్ లోపాలు లేకుండా వీలైనంత వరకు జాగ్రత్తపడాలి. సబ్జెక్టును సాధన చేస్తున్నప్పుడే సంబంధిత అంశాలను పేపరుపై రాస్తూ సాధన చేయొచ్చు. పరీక్షలకు ముందు గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా కావాల్సినంత ప్రాక్టీస్ పొందొచ్చు. ఏవైనా సందేహాలుంటే సంబంధిత అంశంపై పూర్తి విషయ పరిజ్ఞానానికి ప్రయత్నించాలి. దీంతోపాటు వెంటనే నివృత్తి చేసుకోవాలి. సబ్జెక్టుపై ఎంతమేరకు పట్టు సాధించారనేదానికే విద్యార్థులు ప్రాధాన్యమివ్వాలి. ................................................... సిలబస్ ప్రకారం ప్రతి సబ్జెక్టులో యూనిట్ల వారీగా ప్రిపేరవ్వాలి. ప్రతి యూనిట్ నుంచి కనీసం ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. మంచి మార్కులు కోరుకునే వారు మొత్తం సిలబస్ చదవడానికి ప్రాధాన్యమివ్వాలి. ................................................... పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇవ్వగానే రెండు నిమిషాలు జాగ్రత్తగా చూడాలి. అన్ని ప్రశ్నలను చూసి సమాధానాలు రాయగలిగేవాటిని గుర్తించాలి. ................................................... ఆన్సర్‌షీట్‌లో సమాధానాలు రాసేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తలు పాటించాలి. పక్కాగా రాయగలిగే సమాధానాలను ముందుగా రాయాలి. ................................................... పరీక్షల్లో సాధారణంగా డిస్క్రైబ్, ఎక్స్‌ప్లేన్, ఎక్స్‌ప్లేన్ ఇన్ డీటైల్, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అని అడుగుతుంటారు. అటువంటి ప్రశ్నలకు మొదట్లో కొద్దిగా వివరణ రాసి మిగతా సమాధానాన్ని పాయింట్ల వారీగా రాస్తే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ................................................... మార్కులకు అనుగుణంగా మీ సమాధానాలుండాలి. దీర్ఘ సమాధాన తరహా ప్రశ్నలకు క్లుప్తంగా సమాధానాలు రాయడం ద్వారా మార్కులను కోల్పోయే ప్రమాదం ఉంది. ................................................... సమాధాన పత్రంలో కొట్టివేతలు లేకుండా జాగ్రత్తపడాలి. తప్పనిసరిగా కొట్టేయాల్సి వస్తే బాక్స్‌గా చేసి క్రాస్మార్క్ చేయాలి. .................................................. పరీక్షల్లో సాధారణంగా చాలామంది చేసే పొరపాటు... ప్రశ్న నంబర్లను సరిగా వేయకపోవడమే. మార్జిన్ లోపలే ప్రశ్న నంబరు, దాని ఉప సంఖ్య నంబర్లను స్పష్టంగా రాయాలి. ................................................... సమాధానాలను స్పష్టంగా, అర్థమయ్యేలా రాయాలి. ................................................... డా॥ఇ.శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపల్, ఏఎన్‌యూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.