సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ర్యాం కుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ పరీక్ష అయిన జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనే ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎత్తివేసిన నేపథ్యంలో.. ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు భవిష్యత్తులో ఇంజనీరింగ్ ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలని కేంద్రం నిర్ణయించడం, రాష్ట్ర ప్రభు త్వం ఇంటర్‌లో గ్రేడింగ్ విధానం అమలు చేయాలని యోచిస్తుండడంతో వెయిటేజీ తొలగింపు అంశం తెరపైకి వచ్చింది.
గ్రేడింగ్ అమల్లోకి వస్తే..
విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో ఇంటర్‌లో మార్కుల ప్రకటన కాకుండా, గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై గతంలో కమిటీ కూడా వేశారు. ఇటీవల ప్రైవేటు కాలేజీల యాజమాన్య ప్రతినిధుల భాగస్వామ్యం కలిగిన బోర్డు సలహా మండలి కూడా 2018 మార్చిలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో గ్రేడ్‌ల ప్రక్రియను ప్రారంభించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు అందజేయనుంది. దానికి ప్రభుత్వ ఆమోదం వస్తే గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది. దీంతో ఎంసెట్ ర్యాంకుల్లో ఇంటర్ మార్కుల వెయిటేజీ పరిస్థితి ఏమిటన్న చర్చ జరిగింది. ఈ సందర్భంగా మూడు రకాల ఆలోచనలు చేసింది. వీటిని కూడా త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది.
వెయిటేజీ రద్దుకే మొగ్గు!
ఇంటర్ బోర్డు సలహా మండలి మూడు రకాల ప్రతిపాదనలు చేస్తున్నా.. ప్రధానంగా వెయిటే జీ రద్దుపైనే దృష్టి సారించినట్లు సమాచారం. సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను బట్టి వెయిటేజీ లెక్కించడం అశాస్త్రీయం అవుతుందన్న భావ న ఉంది. మరో ప్రతిపాదన మేరకు ఎంసెట్ కన్వీనర్‌కు మార్కులను అందజేసినపుడు.. ఆ మార్కుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అభ్యర్థికి ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకు నచ్చకపోతే తన ఇంటర్ మార్కుల కోసం, జవాబు పత్రం ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇలా కార్పొరేట్ సంస్థలు తమ విద్యార్థులతో జవాబుపత్రాల ఫొటో కాపీల కోసం దరఖాస్తు చేయించుకుని.. మార్కులను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఇంటర్ వెయిటేజీని రద్దు చేయడమే మేలని భావిస్తున్నారు.
జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే ఇంజనీరింగ్ ప్రవేశాలు!
జాతీయ స్థాయి పరీక్ష అయిన జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)’ద్వారా జాతీయ స్థాయి పరీక్షలన్నింటినీ నిర్వహించాలని కూడా ఇంతకుముందే నిర్ణయించింది. నీట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలను ఎన్‌టీఏ పరిధిలోకి తేవాలని యోచిస్తోంది. 2019లో ఇది అమల్లోకి తెచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఎంసెట్ పరీక్షే అవసరం లేదన్న భావన వ్యక్తమవుతోంది. జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలను చేపట్టాలని ఓ అధికారి పేర్కొన్నారు.
ఇవీ మూడు రకాల ప్రతిపాదనలు
1 కేంద్రం జేఈఈ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలగించింది. అదే తరహాలో ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించి.. ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలి.
2 మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లను బట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వాలి.
3 విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా ఇంటర్ బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. బోర్డు ఈ మార్కులను ఎంసెట్ కన్వీనర్‌కు అందజేస్తే.. ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ర్యాంకును ఖరారు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment