సాక్షి, హైదరాబాద్: నివాస ప్రాంతాల్లో, ఆస్పత్రులు, మతపరమైన ప్రార్థనా మందిరాలు, పాఠశాలల సమీపంలో మద్యం దుకాణాలు, పర్మిట్ రూంలు, బార్లు ఉండటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పర్మిట్ రూంలు, బార్లలో మినహా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తెలంగాణ ఎక్సైజ్ (గ్రాంట్ ఆఫ్ లైసెన్స్ ఆఫ్ సెల్లింగ్ బై షాప్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ లైసెన్స్) నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు రెండు నెలల్లో ఆడిట్ నిర్వహించాలని, నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఉంటే వాటిని రెండు నెలల్లోగా తొలగించాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలతోపాటు పర్మిట్ రూంలకు అనుమతి ఇస్తున్నారని, దీంతో చిన్నారులు, మహిళలు వేధింపులకు గురవుతున్నారంటూ న్యాయవాది మహేందర్‌రాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారణ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment