నిబంధనలు పాటించకుండా గ్రానైట్ తవ్వకాలు
కాలుష్యం బారిన 40 వేల కుటుంబాలు
సీజేకు లేఖ రాసిన కరీంనగర్‌వాసి
సుమోటోగా స్వీకరించిన హైకోర్టు..
రేపు విచారణ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తికి కరీంనగర్ వాసి డి.అరుణ్‌కుమార్ రాసిన లేఖపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపేందుకు నిర్ణయించింది. ‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో గ్రానైట్ క్వారీలతో పరిసర ప్రాంతాల్లో పర్యావరణం అధ్వానంగా మారింది. అక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి.
విచ్చలవిడిగా, అక్రమంగా గ్రానైట్ తవ్వకాలతో పాటు అనుబంధ పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటంతో పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. గ్రానైట్, స్టోన్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లతో గాలి మాత్రమే కాకుండా నీరు, ధ్వని కాలుష్యం పెరిగిపోయింది. పరిశ్రమల నుంచి వెలువడే ధూళి కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో పచ్చదనం మాయమైంది. శ్వాస పీల్చుకోవడానికి మనుషులే కాదు.. జంతువులు సైతం ఇబ్బందిపడుతున్నాయి’ అని లేఖలో పేర్కొన్నారు.
పశువులకు మేత లేదు..
‘గ్రానైట్ యజమానులకు గుట్టలు బంగారు కొండల్లా మారాయి. గ్రానైట్ అక్రమ తవ్వకాలు జరపడమే కాకుండా నిబంధనలు పాటించకుండా పర్యావరణ హననానికి పాల్పడుతున్నారు. చుట్టూ పంటలు పండక, చెట్లు సరిగ్గా పెరగక, పశువులకు మేత లేక చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. గనుల్లో భారీ బ్లాస్టింగ్‌లు, కాలుష్య కారకాలకు 10కి పైగా గ్రామాలు ప్రభావితమయ్యాయి. సుమారు 40 వేల మంది జీవితాలు ప్రమాదకరంగా మారాయి. దీనిపై వెంటనే చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలి’ అని పిటిషనర్ కోరారు.
విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులు, పరిశ్రమలు, వాణిజ్య, పర్యావరణ, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శు లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, తదితరులను ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై రేపు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment