
బాలానగర్: మరుగుదొడ్డిలో నివసిస్తున్న ఆ కుటుంబ కష్టాలను సాక్షి వెలుగులోకి తీసుకువచ్చింది. సాక్షి కథనానికి స్పందించిన మానవతామూర్తులు ఆ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరికి చెందిన సుజాతకు పక్కా ఇల్లు కట్టించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గ్రామానికి చెందిన సుజాత భర్త ఆరేళ్ల కిందట మృతి చెందాడు. అయితే వారి ఇల్లు మూడేళ్ల కిందట కూలిపోయింది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో ఇల్లు నిర్మించుకోవడం కష్టమవడంతో ఇంటి ముందు ఉన్న మరుగుదొడ్డిలోనే నివసిస్తున్నారు.
చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు
సుజాతతోపాటు తన ఇద్దరు పిల్లలు, అత్తతో కలిసి మరుగుదొడ్డిలో ఉంటున్నారు. వీరి కష్టాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఆదిబట్లకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన బంధువు రాఘవరెడ్డి, రత్నాకర్‌రెడ్డి ముందుకు వచ్చారు. తమ స్నేహితుల సహకారంతో సుజాతకు ఇల్లు కట్టించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చురుకుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి గ్రామానికి చెందిన మోహన్‌నాయక్‌కు రూ.1.60 లక్షలు అందజేసి ఇంటి నిర్మాణం పూర్తి బాధ్యతను అప్పగించారు. రెండు నెలల్లోగా ఇంటి నిర్మాణం పూర్తిచేయాలని వారు కోరారు.
చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’