సాక్షి, ప్రతినిధి, సూర్యాపేట: మానాపురం మాగాణంలో పచ్చళ్లమిర్చి ‘ఎర్ర బంగారం’లా మెరుస్తోంది. కల్లాల్లో ఎర్రగా నిగనిగలాడే మిర్చికుప్పలు బంగారం రాశుల్లా తళుక్కుమంటున్నాయి. మిర్చి పంటకు మానాపురం తండా కేరాఫ్‌గా నిలిచింది.. మానాపురం మిర్చి ఘాటే కాదు, యమా హాట్ కూడా! 8 జిల్లాలకు ఈ మిర్చి రుచి చూపిస్తోంది ఈ తండా.. ఈ తండా సూర్యాపేట జిల్లాలో ఓ మారుమూల ప్రాంతం. హైబ్రిడ్, లబ్బ విత్తన రకాల సాగు ఈ ప్రాంతం ప్రత్యేకత. మానాపురంతోపాటు ఏనెకుంట తండా, రావులపల్లి క్రాస్ రోడ్డు తండా, పప్పుల తండాలో పచ్చళ్ల మిర్చి పంట సాగవుతోంది. నాలుగు తండాల్లో 500 ఎకరాలపై చిలుకు ఈ పంట ఉంటే, అందులో 300 ఎకరాల వరకు మానాపురంలోనే సాగైంది.
పదిహేనేళ్లుగా సాగు..
తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం మండలం మానాపురంలో 150 కుటుంబాలు, ఏనెకుంట తండాలో 100, పప్పుల తండాలో 60, రావులపల్లి క్రాస్‌రోడ్డులో 200 గిరిజన కుటుంబాలున్నాయి. బోర్లు, బావుల కింద పదిహేనేళ్లుగా గిరిజన రైతులు సాధారణ మిర్చిని సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి కొద్దోగొప్పో బావులు, బోర్లలో నీళ్లున్న కాలంలోనూ ఇతర పంటలు వేయకుండా పచ్చళ్ల మిర్చినే సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ జలాలు వచ్చి భూగర్భ జలాలు పెరగడంతో దీని సాగుకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతి.. తండాలకు కాంతి
సెపె్టంబర్‌లో మిర్చిపంట సాగు చేస్తే సంక్రాంతికల్లా కోతకు వస్తుంది. సంక్రాంతి వచి్చందంటే తండాలకు కొత్తకాంతి వచి్చ నట్టే. చేలల్లో కూలీలు పంటను కోయడం, వీటిని ఆటోలు, ట్రాలీల్లో అమ్మకపు ప్రాంతాలకు తరలించడంతో ఈ తండాల్లో సందడి నెలకొంటుంది. ఎర్రగా నిగనిగలాడే మిర్చిని కోత కోసి చేలల్లోనే రాసులుగా పోస్తారు. కూరగాయల వ్యాపారులు చేల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, జనగామ, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు కూడా ఈ మిర్చి వెళుతోంది.
ఆదాయం భళా
పంటకాలం నాలుగున్నర నెలలు. ఎకరా సాగుకు లక్ష ఖర్చవుతుంది. ఎకరానికి 40 – 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తే రూ.2 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతుంది. తొలి కాయ కిలో రూ.50 – రూ.70 మధ్య ధర పలికితే, ఆ తర్వాత వచ్చే కాయ ధర రూ.50 నుంచి రూ.60 వరకు ఉంటుంది. ఈ పంటకు నీళ్లు ఎక్కువ కావాల్సి ఉండటం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో తక్కువ విస్తీర్ణంలోనే సాగు చేస్తున్నారు.
మా మిర్చికి హైదరాబాద్‌లో గిరాకీ
పచ్చళ్లకు ఉపయోగించే లబ్బ మిర్చికి హైదరాబాద్‌లో బాగా గిరాకీ ఉంటుంది. ధర కూడా కేజీకి రూ.100 పైనే ఉం టుంది. అంత దూ రం వెళ్లలేక చుట్టుపక్కల ఉన్న మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, జనగామ తీసుకెళ్తాం. పిల్లల చదువులు, వ్యవసాయ ఖర్చు ఈ పంట పైనే వెళ్లదీస్తున్నాం.
– జాటోతు విజయ, మానాపురం, నాగారం మండలం
లాభాలొస్తున్నందునే..
ఏటా ఎకరంలో నాటు, హైబ్రిడ్ లబ్బమిర్చి, బజ్జీ మిర్చి సాగు చేస్తాం. ఎకరానికి రూ.లక్షన్నర ఖర్చు చేస్తే ఈ పెట్టుబడి పోను ఎకరానికి రూ.రెండు లక్షల వరకు లాభం వస్తుంది. 20 ఏళ్లుగా ఈ పంట పెడుతున్నాం. ఎన్నడూ నష్టం రాలేదు.
–ఆంగోతు రంగమ్మ, ఏనెకుంట తండా, నాగారం మండలం
విదేశాలకు మా మిర్చి పచ్చడి
లబ్బమిర్చి మాకు ఎర్ర బంగారం. ఈసారి రెండు ఎకరా ల్లో పెట్టాం. పదిహే ను రోజుల నుంచి కాయ కోస్తున్నాం. ‘మీ మిర్చితో పచ్చడి చేసి ఇతర దేశాల్లో ఉన్న తమ పిల్లలకు పంపిస్తున్నామ’ని ఇక్కడికి వచ్చి కాయ కొనుక్కొనేవారు చెబుతుంటారు.
- లకావత్ తావు, మానాపురం, నాగారం మండలం
Comments
Please login to add a commentAdd a comment