
శశిధర్(ఫైల్)
బజార్‌హత్నూర్: ఇటీవల కురిసిన భారీ వర్షా ల కారణంగా పంట నష్టపోయిన ఓ రైతు పెట్టుబడికోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన ఎకెలారి శశిధర్(28)కు బజార్‌హత్నూర్ మండలం కొలారి శివారులో మూడెకరాల పొలం ఉంది. ఈ ఏడాది మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు.
నాలుగు ఎకరాల్లో పత్తి, మరో ఏడు ఎకరాల్లో సోయా పంట సాగు చేశాడు. పెట్టుబడి కోసం గ్రామీణ బ్యాంకులో రూ.90 వేలు, ప్రైవేటుగా రూ.3.8 లక్షలు అప్పు చేశాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పులు తీర్చే మార్గంలేక తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం ఉదయం పొలానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం కొందరు రైతులు శశిధర్ తన చేను సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. శశిధర్‌కు భార్య సుమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment