
పటాన్‌చెరు టౌన్: బాలుడు లోపలి నుంచి గడియ పెట్టుకోవడంతో ఇనుప చువ్వతో తీసే ప్రయత్నం చేసిన ఘటనలో విద్యుదాఘాతానికి గురై తండ్రి, కూతురు మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్‌చెరు పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన బసుదేవ్ మాలిక్ (36) ఇస్నాపూర్ ప్రముఖ్‌నగర్‌లోని ఓ భవనంలో రెండో అంతస్తులో నివాసం ఉంటున్నాడు.
పాశంమైలారంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు బిద్యార్థి మాలిక్(6), కున్ను మాలిక్ (2) ఉన్నారు. సోమవారం ఇంటిపక్కనే ఉండే ఓ బాలుడు వారి ఇంట్లో పొరపాటున లోపలినుంచి గడియ పెట్టుకున్నాడు.
దీంతో బసుదేవ్ మాలిక్, అతడి భార్య రేను మాలిక్ ఇద్దరు కలసి ఇనుప చువ్వతో గడియ తీసే ప్రయత్నం చేస్తుండగా ఇనుపచువ్వ వెనుకభాగం ఇంటి బాల్కనీకి ఆనుకుని ఉన్న కరెంట్ స్తంభం నుంచి వెళ్తున్న 11 కేబీ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై బసుదేవ్ మాలిక్, అతని వద్ద నిల్చున్న కూతురు కున్ను తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. భార్య రేనుమాలిక్‌కు తీవ్రంగా గాయాలవడంతో చికిత్స నిమిత్తం చందానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.