పోతన్న (ఫైల్)
నిర్మల్/సారంగపూర్: భార్య వేసిన తప్పటడుగుకు భర్త, బిడ్డ బలయ్యారు. మరో ఇద్దరు .చిన్నారులు అమ్మ ఉన్నా.. అనాథల్లా మారారు. తల్లి వివాహేతర బంధం.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన కుదురు పోతన్న (34)కు 11ఏళ్ల క్రితం భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన దగ్గరి బంధువు పూజిత (30)తో వివాహమైంది. వీరికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పోతన్న గొర్రెలు కాస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
పూజిత కొంతకాలంగా బోరిగాం గ్రామానికే చెందిన శ్రీకాంత్‌రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై గతంలోనే పంచాయితీ నిర్వహించి ఇద్దరూ దూరంగా ఉండాలని పెద్దలు సూచించినట్లు తెలిసింది. మళ్లీ ఇటీవల వారిద్దరూ తమ పాతబంధాన్నే కొనసాగిస్తుండడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఈ నెల 22న పూజిత తన చిన్నకూతురు క్యూటీ(3)ని తీసుకుని శ్రీకాంత్‌రెడ్డితో వెళ్లిపోయింది. మూడు రోజులపాటు వారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గడిపారు.
ఈ నెల 25న శ్రీకాంత్‌రెడ్డి ఆమెను, చిన్నారిని నిర్మల్ బస్టాండ్‌లో వదిలి బోరిగాం వెళ్లిపోయాడు. తమను కూడా తీసుకెళ్లాలని పూజిత కోరగా అతడు నిరాకరించాడు. ఇంటికి ఫోన్ చేయగా, ఆమె వెళ్లిన రోజు సాయంత్రమే పోతన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని, ఎటు వెళ్లాడో సమాచారం లేదని తెలిసింది. దీంతో దిక్కుతోచక బుధవారం రాత్రి నిర్మల్ బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జి వద్ద తన కూతురికి క్రిమి సంహారక మందు తాగించి తానూ తాగింది. అపస్మారక స్థితికి చేరిన వారిని స్థానికుల సమాచారం మేరకు పట్టణ పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు చిన్నారి క్యూటీ మృతిచెందిందని చెప్పారు. పూజితకు ఐసీయూలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
పెళ్లి చేసుకుంటానని..
శ్రీకాంత్‌రెడ్డి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, రెండు రోజులు తన వెంట ఉంచుకొని నిర్మల్ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయాడని పూజిత తెలిపింది. ఇంట్లో పరిస్థితికి భయపడి పురుగల మందును తన బిడ్డకు తాగించి, తాను తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పింది.
పోతన్న బలవన్మరణం..
భార్య వేరే వ్యక్తితో ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అటు పోతన్న జీర్ణించుకోలేకపోయాడు. అవమానభారంతో ఈ నెల 22న సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. గురువారం పూజిత ఘటన బయటపడగానే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, చుట్టుపక్కల గాలించారు. సారంగపూర్ మండలం ఆలూరు చెరువు వద్ద పోతన్న బైక్, సెల్‌ఫోన్, దుస్తులు కనిపించాయి. గజ ఈతగాళ్లను రప్పించి చెరువంతా గాలించారు. గురువారం సాయంత్రం పోతన్న మృతదేహం చెరువులో లభ్యమైంది. శ్రీకాంత్‌రెడ్డి, పూజితలపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం శ్రీకాంత్‌రెడ్డి పరారీలో ఉన్నాడని నిర్మల్ పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. కాగా, పూజిత ప్రాణాలతో బయటపడ్డా.. అటు తల్లిదండ్రులు, ఇటు అత్తగారింట్లో ఆమెను దగ్గరకు తీసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో పిల్లలు అభినయ్ (10), నిత్య (7) అమ్మ ఉన్నా.. అనాథల్లా మారారు.
Comments
Please login to add a commentAdd a comment