సాక్షి, హైదరాబాద్ : ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు.. డబ్బులు కట్టనిదే చచ్చినా శవం ఇచ్చే పరిస్థితి లేదు.. తప్పుడు రిపోర్ట్‌లు, అనవసర వైద్యం.. ప్రైవేట్ బీమా ఉన్నా పట్టించుకునే దిక్కులేదు.. ప్రస్తుతం కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రజల నుంచి వెల్లువెత్తుతోన్న ఫిర్యాదులివి. వీటితోపాటు రోగి ఎలా ఉన్నాడో చెప్పే దిక్కూలేదు. ఎంతంటే అంత డబ్బులు కట్టుకుంటూ పోవడమే బాధిత కుటుంబాల పని. వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచనే లేదు. కొన్ని ఆసుపత్రులైతే శవాలపై పైసలు ఏరుకుంటున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రెండు ఆసుపత్రులపై చర్యలకు దిగింది. మరికొన్ని ఆసుపత్రుల అక్రమాలపై నివేదికలు సిద్ధమయ్యాయి. వాటిపైనా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. ఇంత జరుగుతున్నా అనేక ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల తీరు మారట్లేదు. దీంతో ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో ఒకరోజు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశమై.. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాలని వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నిర్ణయించారు.
శవాలపై పేలాలు ఏరుకుంటారా?
కరోనా మహమ్మారి కల్లోకం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 84,544కి చేరుకుంది. ఇప్పటివరకు 654 మంది చనిపోయారు. నగరాలు, పట్టణాల నుంచి పల్లెల దిశగా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సామాజికవ్యాప్తి జరగడంతో ఇప్పుడు ప్రజలను ఆదుకోవడంపైనే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు దృష్టిసారించాలి. కానీ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఈ కల్లోల పరిస్థితుల్లోనూ ధనార్జనను వీడట్లేదు. దీంతో సర్కారు వాటికి ముకుతాడు వేసేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘సామాజిక బాధ్యతతో మెలగాల్సిన సమయమిది. ఈ పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోకపోగా ధనార్జనే ధ్యేయమా? మిమ్మల్ని ఎవరూ క్షమించర’ని అన్నట్లు తెలిసింది. ఒకానొక సందర్భంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
అంటువ్యాధుల చట్టం కఠిన అమలు
కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలోనూ తెలంగాణ అంటువ్యాధుల (కోవిడ్–19) నియంత్రణ–2020 నోటిఫికేషన్‌ను ప్రభుత్వం మార్చిలోనే అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులపై సర్కారుకు సర్వాధికారాలుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం ప్రకారం ఆయా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు ముకుతాడు వేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్), వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ), వైద్య విధాన పరిషత్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, కార్పొరేషన్ల కమిషనర్లకు ఈ చట్టం ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులపైనా సర్వాధికారాలుంటాయి. కరోనా లక్షణాలున్న కేసులను పరీక్షించడానికి, వైద్యం చేయడానికి అవసరమైనప్పుడు ముందుకు రావాలి. చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ వ్యక్తి లేదా సంస్థ శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్లు పరిగణిస్తారు. దీన్ని కఠినంగా అమలు చేసి, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి అధికారి ఒకరు తెలిపారు.
శవాలపై పేలాలు ఏరుకుంటున్న ఆసుపత్రులు
Published Thu, Aug 13 2020 1:00 AM | Last Updated on Thu, Aug 13 2020 4:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment