కరీంనగర్ (కోల్‌సిటీ) : సాధారణ కుటుంబంలో పుట్టిన ఓ యువతి సొంత ప్రతిభతో యూట్యూబ్ స్టార్ గా రాణిస్తోంది. తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటూ మల్టీ టాలెంటెడ్ కళాకారిణిగా గుర్తింపు పొందింది. ఆమె గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన వరుమణి వర్షిణి. తెలంగాణ జానద పాటలు, దుమ్మురేపే డీజే సాంగ్స్‌కు వర్షిణి వేదికెక్కి స్టెప్పేసిందంటే చాలు... ఈలలు, చప్పట్లు. యువతను ఉర్రూతలాడించే జానపద నృత్యాలతో ఆకట్టుకుంటున్న వర్షిణీ డ్యాన్సర్‌గా, నటిగా, సింగర్‌గా, యాంకర్, యూట్యూబ్ స్టార్‌గా బహుముఖ రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
ఉత్తమ నృత్యకారిణిగా అవార్డు...
జానపద నృత్యంపై ఇంట్రెస్ట్ ఉన్న వర్షిణి... కరోనా లాక్‌డౌన్ సమయంలో చేసిన నృత్య ప్రదర్శన వీడియోను టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయగా, ఆ వీడియో వైరల్ అయ్యింది. వర్షిణి నృత్య ప్రదర్శకు అబ్బురపడిన ఎన్‌ఎస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు మైపాల్ ‘ఓ పిల్లగో...’ పాటకు వర్శిణితో నృత్య ప్రదర్శన చిత్రీకరించారు. ఇటీవల చిత్రీకరించిన ‘ఏమి జేద్దునే అవ్వో...’ ఈ పాటలో వర్షిణి చేసిన నృత్య ప్రదర్శనకు మూడు మిలియన్స్ వరకు వ్యూస్ వచ్చాయి. ‘పున్నాపు వెన్నెల వలలో...’ పాటకు కూడా 10 మిలియన్స్ వరకు వ్యూస్ రావడం గమనార్హం.
ఇప్పటి వరకు 135 జానపదం పాటలపై నృత్య ప్రదర్శన చేసిన వర్షిణి, నాలుగైదు షార్ట్‌ఫిల్మ్‌ల్లో కూడా నటించింది. జబర్దస్త్ బృందం వెంకీ–మంకీ, రాజమౌళి ఫేంలో ‘మోరియా మెరియా..’ పాటకు, అలాగే ‘కర్రెకోడి గరం మసాలా...’ పాటలకు ఆకట్టుకునే నృత్యం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జగిత్యాలలోని రాయికల్ మండలంలో వర్షిణిని, ‘ఉత్తమ నృత్యకారిణి’ అవార్డుతో ఆణిముత్యం కల్చరల్ డ్యాన్స్ అకాడమీ సత్కరించింది. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా వర్షిణిని ఘనంగా సత్కరించారు.
సినిమాల్లో నటించాలనే కోరిక..
మంచి డ్యాన్సర్, నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి క్రమశిక్షణతో శ్రమిస్తున్నాను. సినిమాల్లో నటించాలని కోరిక. అలాగే వృత్తిపరంగా మంచి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి, ఉత్తమ టీచర్‌గా ఎదగాలని ఉంది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎక్కువగా ఉంది.
– వరుమణి వర్షిణి
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తల్లిదండ్రులు వాణి, వేణుమాధవ్ కూతురు వర్షిణిని జానపద నృత్యంలో ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న వర్షిణికి నృత్యం అంటే ప్రాణం. అలాగే నటన, యాంకరింగ్ అంటే కూడా చాలా ఇష్టం. కూతురు ఇష్టాలను గుర్తించిన తల్లిదండ్రులు, చదువు తోపాటు జాపనద నృత్యంలో రాణించేలా అండగా నిలుస్తున్నారు. సర్వేశ్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో 2వ తరగతి నుంచే ప్రత్యేక నృత్య శిక్షణ తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment