ఫుడ్‌ ఫర్‌ ‘పాజిటివ్‌’ | Food For Corona Positive Patients | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ఫర్‌ ‘పాజిటివ్‌’

Published Sun, Apr 18 2021 5:20 AM | Last Updated on Sun, Apr 18 2021 5:20 AM

Food For Corona Positive Patients - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కోవిడ్‌ పాజిటివ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతోంది. పెద్దసంఖ్యలో రోగులకు ఆసుపత్రుల్లో బెడ్స్‌ అందించడం సాధ్యం కాదు కాబట్టి అధిక శాతం బాధితులకు, నాన్‌ సీరియస్‌ కేసులకు హోమ్‌ ఐసోలేషన్‌ ఏకైక మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి చికిత్స అందుకుంటున్న వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఇంటి ముంగిటకే రావడం ఒక వరంలా మారింది. ప్రస్తుతం ఇళ్ల నుంచి, కేటరింగ్‌ సంస్థల ద్వారా ఇలా సరఫరా చేస్తున్న వారు దాదాపు 50కిపైగా ఉంటారు. 

అన్ని రకాల పదార్థాలతో ఫుడ్‌ ప్యాకేజ్‌ ఇలా..

కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయి ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉన్నవారికి హైదరాబాద్‌కు చెందిన కొన్ని కేటరింగ్‌ సంస్థలు ఫుడ్‌ ప్యాకేజ్‌లను అందిస్తూ కొత్త రకం వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ఒంటరిగా నివసిస్తున్నవారితోపాటు ఇతరులకు మరీ ముఖ్యంగా తమ కుటుంబసభ్యులకు కోవిడ్‌ వ్యాప్తికాకుండా  జాగ్రత్త పడే పాజిటివ్‌ రోగులకు ఇవి ఉపయుక్తంగా మారాయి. కరోనా కారణంగా కుప్పకూలిన ఫుడ్‌ బిజినెస్‌కి కొత్త మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించడానికి కూడా ఇది వీలు కల్పిస్తోంది. రెండేళ్లుగా అతలాకుతలమైన కేటరర్లు, రెస్టారెంట్స్‌ నిర్వాహకులకు ఈ ఆహార సరఫరా కొంత వరకూ ఉపశమనాన్నిస్తోంది. పలువురు కేటరర్లు, సంస్థలు ఇప్పటికే నగర వ్యాప్తంగా ఈ తరహా సేవల్ని విస్తరించారు.

సోషల్‌ మీడియాలో ప్రచారం
కేటరింగ్‌ సంస్థలు కోవిడ్‌ బాధితులకు తాము అందిం చే ఆహారం గురించి ప్రచారం కోసం సోషల్‌ మీడి యాను విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. వా ట్సాప్‌ గ్రూపులతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తమ ఆఫర్లను, ప్యాకేజీలను ప్రకటిస్తూ ప్రచారం సాగిస్తు న్నాయి. బాధితుల నుంచి స్పందన కూడా బాగానే ఉంటోందని కేటరింగ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్‌ బాధితుల నుంచి వస్తున్న ఆర్డర్ల మేరకు సమకూర్చలేకపోతున్నామని కొందరు నిర్వాహకులు చెప్పడాన్ని బట్టి చూస్తే ప్రస్తుతం దీనికి ఎంత డిమాం డ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరికొద్ది రోజులు కోవిడ్‌ విజృంభణ కొనసాగుతుందన్న అంచనాలతో ఇప్పుడిప్పుడే ఈ వ్యాపారంలోకి మరికొందరు దిగుతున్నారు. ఈ క్రమంలో మూతపడిన హోటళ్లు, రెస్టారెంట్లు ఈవైపు అడుగులు వేసేందుకు ప్రయ త్నిస్తున్నాయి. ఆయా సంస్థలు రూ.650 నుంచి ప్యాకేజీ ధరను నిర్ణయించాయి. అందించే ఆహార పదార్థాల నాణ్యతను బట్టి ఈ ధర రూ.9 వేల వరకు ఉంది. బాధితులకు వైద్యులు సూచించే పోషకాలన్నీ ఇందులో ఉండేలా నిర్వాహకులు చూస్తున్నారు. ఫోన్‌ చేసి అడ్రస్‌ చెబితే చాలు ఈ ‘ఇమ్యూనిటీ ఫుడ్‌ ప్యాకేజ్‌’ బాధితుల ఇంటికే నిమిషాల్లో చేరుతోంది. 

చారిటీ నుంచి బిజినెస్‌ వైపు
మొదట కోవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు చారిటీగా దీన్ని గత ఏడాది ప్రారంభించాం. అయితే బాధితుల సంఖ్య వందలు, వేలకు చేరడంతో బిజినెస్‌గా మార్చుకున్నాం. కానీ ఇప్పటికీ లాభాపేక్షతో చేయడం లేదు. ఇప్పటిదాకా దాదాపు 3వేల వెజ్‌ మీల్స్‌ సరఫరా చేశాం. రోజూ 300కిపైగా థాలీలు అందిస్తున్నాం. ఒకే ఇంటి నుంచి అరడజను ఆర్డర్స్‌ వస్తే డెలివరీ ఖర్చులు భరిస్తున్నాం. మొత్తంగా 14 రోజుల పాటు లంచ్, డిన్నర్‌లకు రూ.4వేలలో మినీ థాలీస్, రూ.6 వేలలో హోమ్‌ థాలీస్‌ ఇస్తున్నాం.
–అనిల్‌ అగర్వాల్, సాయి కైలాష్‌ దాబా

రోజుకు మూడుసార్లు
15 ఏళ్లుగా పాతబస్తీ కేంద్రంగా కేటరింగ్‌ బిజినెస్‌ చేస్తున్నాం. నెల రోజులుగా కేసుల సంఖ్య బాగా పెరగడంతో ఇప్పుడు రోజుకు 20–25 భోజనాలు సరఫరా చేస్తున్నాం.  నా భార్య వంట చేస్తుంది. మా కుటుంబ సభ్యులు వాటిని డెలివరీ చేస్తారు. కనీసం 25 కి.మీ పరిధిలో ఉన్న వారికి అందించగలుగు తున్నాం. అంతకంటే దూరంగా ఉన్నవారు ఇతర యాప్స్‌ ఉపయోగించి ఇంటి దగ్గరకే ఆహారం రప్పించుకోవచ్చు. మా ఫుడ్‌ ప్యాకేజ్‌ ధర రూ.9వేలు.    
    – ఆనంద్‌ సంఘీ, సంఘీ కేటరర్స్‌

ఫ్రెష్‌.. ఇమ్యూనిటీ బూస్ట్‌
ఇటీవలే కోవిడ్‌ ప్యాకేజ్‌ పేరుతో ఆహార పంపిణీ ప్రారంభించాం. తొలుత మోతీనగర్‌లోని మా ఇంట్లోనే తయారు చేసేవాళ్లం. అయితే ఆర్డర్లు పెరగడంతో మేం మూసేసిన రెస్టారెంట్‌ కిచెన్‌ని తిరిగి ఓపెన్‌ చేయాల్సి వచ్చింది. రోగులకు మంచి ఆహారాన్ని అందించడం మీద మాత్రమే తప్ప లాభాలపై దృష్టి లేదు. ఆహారంతో పాటు కేరళ నుంచి తెప్పించిన ఇమ్యూనిటీ పెంచే ఆయుర్వేదిక్‌ పౌడర్‌ను కూడా మేం జత చేసి ఇస్తున్నాం. దీనితోపాటు పండ్లు, సూప్స్‌ వంటివి కూడా ఇస్తున్నాం. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌ కలిపి రోజుకి రూ.650తో ఇస్తున్నాం. కస్టమర్‌ అవసరాన్ని రోజుకి 3 విడతల వరకూ సరఫరా చేస్తున్నాం.
    – నిఖిల్, ది క్లౌడ్‌ కిచెన్‌    
చదవండి: షాకింగ్‌: కరోనా సోకిందని సూటిపోటి మాటలు.. ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement