
సాక్షి, హైదరాబాద్: గత 6 నెలలుగా రాజేంద్రనగర్ వాసులను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు పట్టుబడింది. రాజేంద్ర నగర్‌లోని వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. రెండు రోజుల క్రితం అధికారులు ఈ బోను ఏర్పాటు చేశారు. ప్రతి 10–15 రోజులకు ఒక్కసారి కనిపిస్తూ హల్‌చల్ చేస్తున్న పులి పట్టుబడటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పటికే లేగదూడలు, ఆవుల మంద, మేకల మందలపై దాడి చేసిన చిరుత గత శుక్రవారం రాత్రి మరోసారి వాలంతరీ ప్రాంతంలోని డైరీఫామ్‌లోకి చోరబడి రెండు లేగదూడలను చంపివేసింది.
ఫిట్‌నెస్ ఉంటే నల్లమలకు
వాలంతరి వ్యవసాయ క్షేత్రంలో పట్టుబడిన చిరుతను అటవీ అధికారులు నెహ్రూ జువాలాజికల్ పార్కుకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వారం పాటు చిరుత అక్కడే ఉండనుంది. పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్ ఉందని భావిస్తే.. నల్లమల అడవుల్లో దానిని వదిలివేస్తారని సమాచారం.
(చదవండి: మరోసారి చిరుత కలకలం)
చిరుత సంచారమిలా
మే 14వ తేదీన చిరుత బుద్వేల్ రైల్వే అండర్‌పాస్‌లో కనిపించింది. రోడ్డుపై గంట పాటు సేదతీరి పక్కనే ఉన్న ఫామ్‌హౌజ్‌లోకి దూరింది. అనంతరం ఫామ్ హౌజ్ నుంచి యూనివర్సిటీ గూండా గగన్‌పహాడ్ అడవుల్లోకి వెళ్ళింది. మే 23వ తేదీన గ్రేహౌన్స్‌లోని సీసీ కెమెరాలలో చిరుత కనిపించడంతో అధికారులు అటవీశాఖ, పక్కనే ఉన్న నార్మ్ అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం 29,30వ తేదీల్లో నార్మ్‌లోని క్వాటర్స్ వద్ద తిరుగుతూ సీసీ కెమెరాలలో కనిపించింది. అనంతరం జూన్ 3వ తేదీన మరోసారి కెమెరాలకు చిక్కింది. ఆగస్టు 25వతేదీన వాలంటరీలో డైరీఫామ్‌పై దాడి చేసి ఆవును చంపివేసింది. తిరిగి సెప్టెంబర్ 11వ తేదీన హనుమాన్‌నగర్ గుట్టలపై మేకల మందపై దాడి చేసి రెండు గొర్రెలను చంపి వేసింది. అక్టోబర్ 2వ తేదీన బుద్వేల్ గ్రీన్‌సీటీ నుంచి కిస్మత్‌పూర్ వైపు వస్తు స్థానికులకు కనిపించింది. తిరిగి శుక్రవారం రాత్రి వాలంతరీలోని డైరీఫామ్‌పై దాడి చేసి రెండు లేగదూడలను చంపి వేసింది.
Comments
Please login to add a commentAdd a comment