శంకర్‌సిన్హ్ వాఘేలాకు స్వాగతం పలుకుతున్న కేసీఆర్. చిత్రంలో బాల్కసుమన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రజాస్వామిక ఫెడరల్ స్ఫూర్తిని మంటగలుపుతూ మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి సాగిస్తోందని.. దాన్ని నిలువరించేందుకు సరైన వేదిక అవసరముందని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్ వాఘేలా అన్నారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నాయకత్వం దేశానికి ఎంతో అవసరం ఉందన్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం ద్వారా బీజేపీ దుర్మార్గ రాజకీయాలను తిప్పికొట్టాలన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో వాఘేలా శుక్రవారం సుమారు 5 గంటలపాటు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు జాతీయస్థాయి కీలకాంశాలపై చర్చ జరిగింది. ‘కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు సరైన వేదిక, నాయకత్వం లేకపోవడంపై విపక్ష నేతలంతా ఆందోళన చెందుతున్నారు. మోదీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర పాలన, రాజకీయ విధానాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నా ప్రజాస్వామికవాదులు మౌనం వహించడం సరికాదు.
దేశంలోని ప్రతి విపక్ష రాష్ట్రాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ నియంతృత్వ ధోరణితో లొంగదీసుకోవాలనే కుట్రలను బీజేపీ అమలు చేస్తోంది. దేశంలో మత సామరస్యానికి, ప్రాంతీయ సామరస్యానికి విఘాతం కలిగిస్తున్న బీజేపీ పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలి’ అని వాఘేలా అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రేస్ పార్టీ నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. బీజేపీ దుర్మారా్గలను ఎదుర్కొనేందుకు కావాల్సిన రాజకీయ వ్యూహాన్ని, ఎత్తుగడలను అమలు చేస్తూ అందరినీ కలుపుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.
కేంద్రం ఇబ్బందిపెడుతున్నా కేసీఆర్ తెగువ..
‘కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటిస్తున్న మీ తీరు నా లాంటి సీనియర్ నాయకులను ప్రభావితం చేసింది. శాంతియుత మార్గంలో పార్లమెంటరీ పంథాలో తెలంగాణను సాధించి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. విభజన తర్వాత తెలంగాణకు అండగా నిలవాల్సిన కేంద్రం కొత్త రాష్ట్రాన్ని అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నా తెగువ చూపుతున్నారు. బీజేపీ పీడన నుంచి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలను కూడా విముక్తం చేయాల్సిన అవసరం ఉంది.
మీ అనుభవాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా యావత్ దేశానికి విస్తరించాల్సిన సమయం వచ్చింది. దేశంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ల కోరిక మేరకే నేను మీతో భేటీ అయ్యా. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని కేసీఆర్‌తో భేటీలో శంకర్‌సిన్హ్ వాఘేలా పేర్కొన్నారు. దేశ రాజకీయాలు, పాలనలో గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తానని, వాఘేలా వంటి సీనియర్ జాతీయ నాయకుడు తనకు మద్దతు పలకడంపట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment