
బాలకృష్ణకు పురస్కారాన్ని అందజేస్తున్న విద్యాసాగర్‌రావు
గన్‌ఫౌండ్రీ: తెలుగు భాష ఉన్నంత కాలం డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) చిరస్థాయిగా నిలిచిపోతారని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్ థియేటర్స్, శుభోదయం, సుశీల నారాయణరెడ్డి ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో సినారె 91వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణకు వంశీ–సినారె–శుభోదయం జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణం ప్రదానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సినారె రచనలపై పరిశోధనలు చేసే అవకాశం కల్పించాలని సినారె కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటితరానికి తెలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ సినారె జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో సినారెకు మంచి అనుబంధం ఉందని, తనకు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. కార్యక్రమంలో సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ గురువారెడ్డి, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్, వంశీ సంస్థ వ్యవస్థాపకుడు వంశీరామరాజులతో పాటు సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు.