![Forum For Good Governance Writes Letter TO Governor Over Nayeem Case - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/3/2_0.jpg.webp?itok=YkocWHKP)
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ అభ్యంతరం తెలిపింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని, కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. నయీం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసింది. నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. బాధితులకు న్యాయం జరగలేదని, నేరస్తులకు శిక్ష పడలేదని లేఖలో పేర్కొంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరింది.
(చదవండి : నయీం కేసులో మరో సంచలనం)
నయీం డైరీని బయట పెట్టాలి
నయీం కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నయీం కేసులో పోలీసులకు క్లీన్ చిట్ ఇవ్వడం అనుమానం కలిగిస్తోందన్నారు. నయీం ఇంట్లో డబ్బులు లెక్కించడానికి రెండు కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్లి.. 3.74లక్షల రూపాయలు మాత్రమే దొరికినట్లు చూపించడం దారుణమన్నారు. 240 కేసులు నమోదు చేసి నాలుగేళ్లయినా.. ఇప్పటి వరకు 173 చార్జషీట్లు మాత్రమే దాఖలు చేశారని విమర్శించారు. నయీం డైరీని బయట పెట్టాలన్నారు. నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించి, నేరస్తులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment