ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుష్మ
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత అనారోగ్యం పాలైన నలుగురు మహిళల్లో ఒకరు మరణించగా మరో ముగ్గురు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 25న వివిధ మండలాలకు చెందిన 37 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు.
ఇద్దరు వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఆపరేషన్ల అనంతరం ఇంటికి వెళ్లిన వారిలో మాడ్గులకు చెందిన మమత (30) రెండు రోజుల క్రితం వాంతులు, విరోచనాలతో తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో కుటుంబ సభ్యులు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఆమె మరణించింది.
మంచాల మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుష్మ ఆపరేషన్ చేయించుకున్న రెండు రోజులు బాగానే ఉన్నప్పటికీ ఈ నెల 27 ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లింది. సుష్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
మరో ఇద్దరు మహిళలు కూడా వాంతులు, విరోచనాలతో నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్ చేసినప్పుడు బాగానే ఉన్నారు
ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన సమయంలో అందరూ బాగానే ఉన్నట్లు తెలిసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఆపరేషన్లు జరిగాయి. ఆపరేషన్లు చేసిన ఇద్దరు వైద్యులు అనుభవం ఉన్నవారే. ఆపరేషన్ చేసిన చోట ఎలాంటి సమస్యలు రాలేదు. ఇప్పుడు అనారోగ్యానికి గురైన మహిళలకు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తెలిసింది. వైద్యులతో సమీక్షించి పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం.
– నాగజ్యోతి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఇబ్రహీంపట్నం
Comments
Please login to add a commentAdd a comment