సాక్షి, హైదరాబాద్: పండ్లను పక్వానికి వచ్చేలా చేసేందుకు ఎథిఫాన్, ఎన్‌రైప్‌ల వినియోగానికి అనుమతిస్తూ ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) జారీచేసిన ఉత్తర్వులు చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టంచేసింది. అనేక పరిశోధనల తర్వాత ఎథిఫాన్, ఎన్‌రైప్ రసాయనాలు ప్రమాదకరం కాదనే విషయం తేలడంతో వాటి వినియోగానికి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఎథిఫాన్, ఎన్‌రైప్ వినియోగానికి అనుమతిస్తూ జారీచేసిన ఉత్తర్వులు కొట్టేయాలంటూ కాలేజ్ ఆఫ్ పోస్టుగాడ్యుయేట్ స్టడీస్ డైరెక్టర్ నళిన్ వెంకట్ కిషోర్ కుమార్‌తోపాటు రిటైర్డ్ ఉద్యోగి ఎల్.రమేశ్‌బాబు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని, మరో రెండు పిటిషన్లను కోర్టు కొట్టేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘‘పండ్లను మగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఎన్‌రైప్’వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎన్‌రైప్ ద్వారా కూడా ఎథిలీన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఎన్‌రైప్‌ను మాత్రమే విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు. పరిశోధనలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎథిఫాన్‌కు ప్రత్యామ్నాయంగా మాత్రమే ఎన్‌రైప్‌ను వినియోగించాలని కోరుతోంది. ఎథిఫాన్‌ను విక్రయించరాదని ఎక్కడా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’’అని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment