సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయితే, కార్తీకమాసం చివరి రోజు కావడం, అలాగే ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో, స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
వివరాల ప్రకారం.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి.
మరోవైపు.. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు.. ఆలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది మండపంలో ఊరేగించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment