karthikamasam
-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లు ఫుల్
సాక్షి, యాదగిరిగుట్ట: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయితే, కార్తీకమాసం చివరి రోజు కావడం, అలాగే ఆదివారం కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో, స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. వివరాల ప్రకారం.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో యాదాద్రి ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా లైన్లలో వేచివున్నారు. స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కొండ కింద వ్రత మండపంలో భక్తులతో నిండిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు వ్రతమాచరించారు. దీపారాధనలో భక్తులు భారీగా పాల్గొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. మరోవైపు.. వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులు.. ఆలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్లను రథసేవలో తీరిదిద్ది మండపంలో ఊరేగించనున్నారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. -
తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం (ఫొటోలు)
-
'కార్తీకమాసంలో ఇలా చేస్తే సర్వ పాపాలు తొలుగుతాయి'
మాసాల్లో కార్తీకం..యుగాల్లో కృత యుగం..శాస్త్రాల్లో వేదం..తీర్థాల్లో గంగానదికి సమానమైనవి లేవన్నది పురాణ వచనం. అంతటి మహత్యం గల కార్తిక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైది. అందుకే భక్తులు వేకువనే చన్నీటి స్నానాలు.. జప, తప నియమాలు..పూజలు.. ఉపవాసదీక్షలు చేస్తారు. కార్తీక మాస విశిష్టతపై ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్: కార్తీక మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉండడంతో ఈ నెలకు ఆ పేరు వచ్చింది. ఈ నెల శివకేశవులిద్దరికీ ప్రీతికరం. ఈ నేపథ్యంలో ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రి వేళల్లో వదీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం వచ్చే నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తుల సందడితో కిటకిటలాడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,197 దేవాలయాలున్నాయి. వీటిలో శివాలయాలు 45 వరకు ఉన్నాయి. ఈ ఆలయాల్లో కార్తిక పూజలు శ్రేష్టంగా జరుగుతుంటాయి. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఆలయాలు భక్తులతో కళకళలాడనున్నాయి. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను ఆయా ఆలయ నిర్వాహకులు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు లేకుండా దీపారాధన చేసేందుకు పనులు పూర్తి చేశారు. కార్తీక స్నానం కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి కృతికా నక్షత్రం అస్తమించేలోపు నది, చెరువు, కాలువల్లో కానీ, ఈ వనరులు అందుబాటులో లేకుంటే ఇంట్లో కానీ తలస్నానం చేయాలి.అప్పుడే కార్తీక స్నానం అవుతుంది. ఈ నియమంతో స్నానం చేసి, శివుడు, విష్ణువు, మరే దైవాన్ని అయినా ధ్యానించి, అర్ఘం ఇవ్వడంతో గంగానది, పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతాయి. సర్వ పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. పుణ్యప్రదం.. కార్తీక దీపం భారతీయ సంస్కృతిలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలో దీపారాధనకే ప్రథమ స్థానం. అందుకే ఇంట్లోకానీ, శివాలయంలో కానీ ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేస్తారు. ఎవరైనా తెలిసికానీ, తెలియకుండా కానీ ఎక్కడైనా సరే దీపం పెడితే వారి పాపాలు హరిస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి. దీపం, బంగారం, నవధాన్యాలు, అన్నం దానం చేస్తే సీ్త్రలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దీపారాధనతో పాటు శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపిస్తారు. వన భోజనం ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అప్యాయతలను పంచుకునే అపురూప సందర్భం వనభోజనం కార్తిక మాస ప్రత్యేకం. ఐక్యత సాధనకు ఇది ఎంతో ఉపకరణం. కలిసిమెలసి మసలుకునే తత్త్వం వనభోజన సంబరాలతో అలవడుతుంది. ఈ కార్యక్రమం వనాలపై మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ భోజన సంబరంలో పూర్తి సాత్విక వంటకాలనే భుజిస్తారు. కార్తీకం.. ఆచరణ ఇలా కార్తిక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికైన ఆహారం భూజించాలి. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. పాలు, పండ్లు భుజించవచ్చు. రాత్రి భోజనం చేయకూడదు. అబద్ధాలు, దైవదూషణ చేయకూడదు. తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యఫలం సిద్ధిస్తుంది కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా అత్యంత శ్రేష్టమైనది. కార్తిక మాసం శివకేశవులకు చాలా ప్రీతపాత్రమైనది. తెల్లవారుజామునే ఆలయాలను దర్శించుకుని పూజలు చేయాలి. ఈ మాసంలో శివకేశవులను పూజిస్తే మహాపుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతులు కావాలి. ఈ నెలలో 17న నాగుల చవితి, 18న స్కంధషష్టి, 26న కార్తీకదీపం అతిముఖ్యమైన పండుగలు. –సుధాకర్ గురుక్కల్, వేదపండితులు, చిత్తూరు -
రాజానగరం లో ఘనంగా కాపు కార్తీకమాస వన సమారాధన సభ
-
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ..పోటెత్తిన జనం
కార్తీకమాసం సందర్భంగా శివాలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈ కార్తీక మాస పర్వదినంలో శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ మాములుగా ఉండదు. ఈ మేరకు కర్నూల్ జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం వంటి పుణ్య క్షేత్రం గురించి చెప్పనవసరం లేదు. వారాంతపు సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ విధుల్లో దీపారాధనలు చేసుకున్నారు. ఇక కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు పడుతోంది. లోక కళ్యాణం కోసం లక్ష దీపోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. అలాగే లక్ష దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు కావాల్సిన వస్తువులను దేవస్థావం వారే ఉచితంగా అందించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్తిక పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలన్ని భక్తుల కోలహలంతో శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. (చదవండి: రబ్బర్ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్ హాజరు ) -
సంఘటితం.. సమారాధనం
సాక్షి, అమరావతి: అనుకూలమైన వనంలో బంధుమిత్రుల కలయిక. లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టుకు పూజలు. అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు.. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం. మరోవైపు ఆహ్లాదకరమైన సమారాధనం.. ఇదీ కార్తీక మాస వనభోజనాల ప్రత్యేకం. గతంలో ఇలా జరిగిన వన భోజనాల రూపు నేడు మారింది. ఒక కులానికి చెందిన వారంతా ఒక చోటకు చేరుతున్నారు. రాజకీయాలు, ఆర్థిక తారతమ్యాలకు అతీతంగా వనభోజనాల్లో ఐక్యతారాగం పాడుతున్నారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తమ కులస్థులు ఉన్నత స్థాయికి ఎదిగే ప్రణాళికలు వేస్తున్నారు. కుల జనోద్దరణ కోసం కార్తీక వనభోజనాలను వేదికగా చేసుకోవడం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలైంది. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. కులస్థులను సంఘటితం చేసే సంకల్పంతో సమారాధనలు జరుగుతున్నాయి. తమ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయాత నిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఎదుగుతున్న వారికి వెన్నుదన్నుగా ఎలా ఉండాలి అనే ప్రణాళికలు కూడా వేస్తున్నారు. మునుల కాలం నుంచి.. మాసాల్లో కార్తీకమాసానిది ప్రత్యేకం. శివకేశవులు ఆరాధన, ఉపవాస నియమాలు, పుణ్యతీర్థాల్లో స్నానాలు, ఆలయాల సందర్శనలు, వివిధ మాల ధారణలు ఇలా ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తూ ఉంటుంది. మరో పక్క వనభోజనాల సందడి కనిపిస్తూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజునే నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు ‘కార్తీక పురాణం’లో ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయంలో వనవిహారానికి ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో ఉసరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇలా అన్నీ కలసిన కార్తీకం మానసిక ఉల్లాసాన్నిస్తుంది. స్థానికంగా కుల సమారాధన.. రాష్ట్రంలో ప్రధానంగా కాపు, రెడ్డి, గౌడ–శెట్టిబలిజ, యాదవ, వైశ్య, కమ్మ, క్షత్రియ తదితర కులాల వారీగా సామాజిక వన భోజనాల సందడి కొనసాగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులకు విరామం దొరికే ఆదివారం అయితే మరింత జోరుగా జరుగుతుంది. ఈ ఏడాది కార్తీకమాసం తొలి ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కుల సమారాధనకు పార్టీలకు అతీతంగా పలువులు నేతలు హాజరయ్యారు. గత ఆదివారం భీమవరంలో నిర్వహించిన ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సైతం అక్కడి కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తీక వనభోజనాలను నిర్వహించుకోవడం విశేషం. చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద యోగి వేమన రెడ్ల సత్రంలో ఈ నెల 14న కార్తీక వన భోజనాలను నిర్వహించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో రెడ్లు, కురుబ, యాదవ, బలిజ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ, కాపు, గౌడ కులాలు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ–గౌడ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఉత్తరాంధ్రలో తూర్పుకాపు, నగరాలు, కాళింగ తదితర కులాల వారీగా వన సమారాధనలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ట్రెండ్ మారింది.. సంఘటిత శక్తి చాటుతోంది గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమంగా బంధు మిత్రుల సమక్షంలో కార్తీక వన భోజనాలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఆ వేదికలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఉపయోగించుకున్నారు. మరింత సామాజిక స్పృహ పెరిగి సొంత కులంలో ఆర్థికంగా దెబ్బతిన్న వారిని ఆదుకోవడానికి, విద్యా, వైద్యానికి సాయమందించడానికి కార్తీక వన సమారాధనలను వేదికగా చేసేవారు. క్రమంగా సామాజిక సంఘటిత శక్తిని చాటేందుకు ఉపయోగించుకోవడంతో పాటు రాజకీయంగా రాణించేందుకు దిశానిర్దేశం చేసేలా వన సమారాధనలు మారాయి. – పాకా వెంకట సత్యనారాయణ, కన్వీనర్, బీసీ కులాల సమాఖ్య పుణ్యం.. పురుషార్థం రాష్ట్రంలో కార్తీక సమారాధనలో పూజలతో పుణ్యం వస్తుంది. బంధు మిత్రులు ఒకే చోట కలుసుకుని సాధకబాధకాలు చర్చించుకుని, ఐక్యంగా పరిష్కారాలు కనుగొని ముందుకు సాగేందుకు చేసే ప్రయత్నాలతో పురుషార్థం నెరవేరుతుంది. రాష్ట్రంలో చాలా కాలంగా అనేక విధాలుగా కాపులు వన సమారాధనలు నిర్వహించి కులస్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. విహారయాత్రలు, వన సమారాధనలు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లోను రాణించేలా సంఘీయులు దిశానిర్దేశం చేస్తుంటారు. – చినమిల్లి వెంకట్రాయుడు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా సంఘటితం.. చైతన్యం వెనుకబడిన తరగతులకు చెందిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత వంటి గీత కులాల వారు ఒకే సామాజికవర్గంగా ఉన్నారు. వీరంతా మరింత సంఘటితమై చైతన్యవంతంగా ముందుకు సాగేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కార్తీక వనభోజనాలను నిర్వహిస్తున్నారు. సమాజంలో వారిని వారు రక్షించుకునేందుకు మొదలైన సంఘటిత నిర్మాణం.. కార్తీక వన సమారాధనలతో మరింత చైతన్యవంతమైంది. –వేండ్ర వెంకటస్వామి, గౌడ–శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా. -
TSRTC: రాత్రివేళల్లోనూ శ్రీశైలం బస్సులు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఈ నెల 20 వరకు రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ప్రస్తుతం రాత్రివేళల్లో ఘాట్ రోడ్ల వద్ద బస్సులను నిలిపి తిరిగి ఉదయం వేళల్లో ఫారెస్ట్ అధికారులు బస్సులను అనుమతించేవారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రిజినల్ రీజియన్ మేనేజర్ ఎ.శ్రీధర్ ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని ఫారెస్ట్ అధికారులకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన తెలంగాణ ఫారెస్ట్ అధికారి రాకేష్ మోహన్ డోపిడియాల్ ఈ నెల 20 వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రాత్రివేళల్లో బస్సులను అనుమతించిన ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. (క్లిక్ చేయండి: ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చేస్తున్నాయ్!) -
కార్తిక మాసం ప్రారంభం ఫొటోలు
-
Kurnool: నయనాలప్ప క్షేత్రాన్ని చూసొద్దాం రండి..
కోవెలకుంట్ల (కర్నూలు): కోరిన కోర్కెలు తీరుస్తూ ఓం కారేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచారు. సహజసిద్ధ ఎర్రమల కొండల్లో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన నయనాలప్ప క్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు, తిరుణాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నయనాలప్ప క్షేత్ర చరిత్ర: కర్నూలు జిల్లాలోని కోవెల కుంట్ల నుంచి జమ్మల మడుగుకు వెళ్లే రహదారిలో సంజామల మండలంలోని అక్కంపల్లె సమీపంలో కొండలో వెలసిన నయనాలప్ప క్షేత్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన చెన్నబసప్ప అనే శివభక్తుడు ఈప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ప్రకృతి సౌందర్యము, కొండగుహలను చూసి ముగ్దుడై కుటుంబసమేతంగా వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఒకరోజు రాత్రి నిద్రిస్తుండగా ఓం అను ప్రణవ శబ్ధం వినబడటంతో లేచి ఆ శబ్ధం ఈశ్వరతత్వమని గ్రహించి శివున్ని ధ్యానించి ఇక్కడ శివాలయం నిర్మించ కోరిక కలదని భార్య శివాంబతో చెప్పారు. ఆలయ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నదని ఆలోచన విరమించుకోవాలని భార్య చెప్పగా ప్రశాంత వాతావరణంలో ఆలయం నిర్మించడం వల్ల శివభక్తులను ఉపయోగకరంగా ఉంటుందని శివాలయాన్ని నిర్మించ తలపెట్టారు. శివాలయ నిర్మాణంపై ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదని, పక్కనే ఉన్న అక్కంపల్లె గ్రామస్తులు మహా భక్తులని, వారిని ఆశ్రయించిన దేవాలయ నిర్మాణం సులభతరమవుతుందని ఓంకారేశ్వరునిగా ఆలయంలో ప్రతిష్టించాలని ఒక రోజు రాత్రి శివుడు కలలో కన్పించి చెప్పడంతో ఈ విషయాన్ని భార్యకు తెలియజేశారు. శివుడు చెప్పినట్లు చేయాలని భార్య సలహా ఇవ్వడంతో చెన్నబసప్పా అక్కంపల్లె చేరుకుని శివుడు కలలో ఆజ్ఞాపించిన విషయాన్ని గ్రామస్తులకు వివరించగా వారు దేవాలయ నిర్మాణానికి చేయూత నిస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బసప్పా తన దగ్గర ఉన్న ఎద్దులసాయంతో రాళ్లను పైకి చేర్చి ముందుగా తాను పూజిస్తున్న గర్భగుడికి సరిగా కింద భూమిలో నేలగుహ అను పేరుతో పై ఆలయములోకి వచ్చునట్లుగా సోపానములను అమర్చారు. శివ మహిమతో నేల గుహ ఇప్పటికి ఎయిర్ కండీషన్ గదిలా ఉంది. రాత్రి సమయాల్లో శివ మహిమతో రాళ్లు పైకి చేరుతుండటమేకాక, పగలు నిర్మించిన కట్టడాలు సరిగా లేని పక్షంలో చక్కగా సరిదిద్దబడేవని చరిత్ర. ఒక రోజురాత్రి నిద్రిస్తున్న సమయంలో శివాంబ శివాలయ ప్రాంతంలో అలికిడి విని లేచి చూడగా పరమేశ్వరుడు శివగణంబులతో శివాలయ నిర్మాణ విశేషములను తిలకించి వాటికి కావాల్సిన సద్దుబాట్లు చేయించుకున్న దృశ్యాలను చూసి నిశ్చేష్ఠురాలైంది. ఈ విషయాన్ని భర్తను లేపగా శివుడు అదృశ్యమయ్యాడు. శివుని ప్రత్యక్షంకోసం పర్వతం కింద కఠోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాకుండా అదృశ్యవాణితో బసప్పను దీక్ష విరమించి భార్య, కుమారుడు సుజాతప్పను కలుసుకోవాలని, త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఓంకారేశ్వరునిగా తనను ప్రతిష్ఠింపచేసి కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడి నుంచి కాశీ జలాన్ని తెచ్చి అభిషేకించాలని, అప్పుడు దర్శనభాగ్యం కలుగునని పలికెను. దీక్షను విరమించి ఇంటికి చేరుకున్న బసప్ప కాశీ విషయాన్ని భార్యకు చెప్పి మునీశ్వరుల వెంట కాశీకి బయలు దేరాడు. భర్త వెళ్లే సమయానికి శివాంబ రెండు నెలల గర్బవతి. భర్త కాశీకి వెళ్లడంతో ఆమె ప్రతి రోజు పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆవుపాలు, నెయ్యితో వీబూది ముద్దలుగా చేసి గదిలో భద్రపరిచేది. శివాంబకు అచ్చం తన పోలికలతో కూడిన కుమార్తె జన్మించడంతో శరణమ్మనామకరణం చేసి 16 సంవత్సరాల పాటు కఠోరంగా శివున్ని ప్రార్థించింది. ఒక రోజు శివాంబ బిక్షాటనకై అక్కంపల్లె గ్రామానికి వెళ్లగా ఆ సమయంలో కాశీ నుంచి బసప్ప ఇంటికి చేరుకున్నాడు. ఆయన రాకను చూసిన మునులు మీ తండ్రి కాశీ క్షేత్రం నుంచి వచ్చాడని చెప్పడంతో శరణమ్మ కలశంతో నీటిని తెచ్చి తండ్రి పాదములు కడుగుటకు ఎదురుగా వచ్చింది. బపస్ప కాశీ క్షేత్రానికి వెళ్లే సమయానికి భార్య గర్భవతని, తనకు కుమార్తె పుట్టిన విషయం తెలియకపోవడంతో బసప్ప కలశంతో నీళ్లు తెచ్చిన శరణమ్మ తన భార్యగా భావించి ముసలితనంలో ప్రాయం వచ్చనా అన్న మాటలు అనడంతో వెంటనే తండ్రి మనోభావాన్ని గ్రహించిన కుమార్తె తండ్రి వద్దకు వెళ్లి నేను నీ కుమార్తెనని తెలిపింది. దీంతో బసప్ప కుమార్తెను అక్కున చేర్చుకుని తాను పొరబడ్డానని బాధించి ఓంకారేశ్వరుని సన్నిధికి చేరుకుని నయనములు కల్గి ఉండుటవల్లే ఈ తప్పిదం జరిగిందని, ఈ నయనములు ఉండటానికి వీల్లేంటూ రెండు కళ్లూ పీకి శివసన్నిధిని ఉంచారు. భార్య, పిల్లలు ఎంత చెప్పినప్పటికీ వినకుండా అంధత్వ జీవితం భరించుట సాధ్యం కాదని, జీవసమాధి అయ్యారు. కొంతకాలానికి ఎద్దులు కూడా మృతి చెందటంతో బసప్ప పక్కనే వాటిని సమాధి చేశారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది తర్వాత అంతటి ప్రాధాన్యత నయనాలప్ప క్షేత్రానికే ఉంది. ఓంకారేశ్వర ఆలయంలో బసప్ప పూజలు నిర్వహించిన నేలగుహ ఇప్పటికి చెక్కు చెదరలేదు. నేలగుహలో ప్రతిష్టించిన శివలింగానికి బసప్ప పూజలు చేసేవారు. శివమహిమతో ఉన్న ఈ గుహను అలాగే ఉంచి దానిపై ఆలయాన్ని నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆలయం ఉన్న గర్భగుడిలో నేలగుహ ఎయిర్‌కండీషన్ గదిని పోలి ఉంది. ఇది నయనాలప్ప క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత. ఓంకారేశ్వర క్షేత్రంలో కార్తీక కడసోమవార ఉత్సవాలు: ప్రతిఏటా కార్తీక మాసంలో ఓంకారేశ్వరస్వామి క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీకమాస కడ సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో మూడు రోజులపాటు తిరుణాల ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శుక్రవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండగా కడ సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, ధ్వజరారోహణ నిర్వహిస్తారు . అదేవిధంగా.. స్వామివార్ల గ్రామోత్సవం, కోలాటాలు, హరిభజనలు, భక్తిరసపూరిత కార్యక్రమాలు, హరికథా కాలక్షేపం, నాటకాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచేకాక కడప, అనంతపురం జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు క్షేత్రాన్ని చేరుకుని ఓంకారేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. నయనాలప్ప క్షేత్రానికి ఇలా చేరుకోవాలి: కర్నూలు జిల్లా కేంద్రం నుంచి బేతంచెర్ల, బన గానపల్లె, కోవెలకుంట్ల, మాయలూరు మీదుగా సంజామల మండలం అక్కంపల్లె గ్రామ శివారు నుంచి నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి గోస్పాడు, కోవెలకుంట్ల మీదుగా, ఆళ్లగడ్డ నుంచి పెద్దముడియం మీదుగా, వైఎస్ఆర్ జిల్లా నుంచి భక్తులు జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం మీదుగా నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. -
అలంకార ప్రియుడికి పుష్పయాగం
శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. ఆభరణాలతో పాటు పుష్పాలంకరణ కూడా స్వామివారికి విధిగా నిర్వహిస్తారు. పుష్పాలంకరణలో ఉన్న ఆ శేషాచలవాసుడి నిలువెత్తు రూపాన్ని దర్శించుకోవడానికి రెండు కళ్లు చాలవు. భక్తులు తన్మయత్వంతో పొంగిపోతారు. తిరుమలలోని ప్రతి పుష్పం పుష్పించి, వికసించి సేవించి తరిస్తోంది. అలాంటి అలంకార ప్రియుడికి సోమవారం మధ్యాహ్నం పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు ఆగమ శాస్త్రోక్తంగా సంప్రదాయ పుష్పలు,పత్రాలతో శాస్త్రోక్తంగా కలియుగదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని అర్చించనున్నారు. సోమవారం ఉదయం వైభవంగా పుష్పయాగం ప్రారంభమైంది. పుష్పాల బుట్టలతో స్వామివారిని అధికారులు ఆలయానికి తీసుకు వచ్చారు. సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి వైభవాన్ని, సేవలను కళ్లారా తిలకించి తరించడం పూర్వజన్మ సుకృతం. ఏటా స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తెలిసీ, తెలియక జరిగే తప్పులకు మన్నింపు కోరతూ శ్రీవారికి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. గతంలో బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజున ఈ పుష్పయాగాన్ని నిర్వహించేవారు. అయితే స్వామివారి సేవల్లో జరిగే తప్పులకు మన్నింపు కోరుతూ పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నందున ఈ ఉత్సవాన్ని కార్తీక మాసానికి మార్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. స్వామివారికి కార్తీక శ్రవణా నక్షత్రం రోజున ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి నిత్యారాధన అనంతరం బంగారు తిరుచ్చిలో శ్రీదేవి,భూదేవి సమేతంగా రాచమర్యాదలతో యాగశాలకు వేంచేస్తారు. అక్కడ స్వామివారికి తొలుత అభిషేకాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి తులసిమాలలు ధరింపజేస్తారు. అనంతరం సహస్రధారాభిషేకంతో అభిషేకం కొనసాగిస్తారు. విష్ణుగాయత్రీ మహామంత్రంతో 108 సార్లు బిల్వపత్ర హోమం నిర్వహిస్తారు. మూర్తి హోమంతో 12 సార్లు పుష్పాధిపతికి సంబంధించిన హోమం కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి పుష్ప సమర్పణలో భాగంగా స్వామివారి కంఠం వరకూ వివిధ రకాల పుష్ప సమర్పణ జరుగుతుంది. అర్చకులు అ పుష్పాలను పాద పద్మములకు సరిగా సరిచేస్తారు. అప్పుడు నీరాజనం జరుగుతుంది. ఇదేవిధంగా 20 పర్యాయాలు చేస్తారు. ఆపై హవిర్నవేదనం జరిగుతుంది. తదనంతరం అగ్ని విసర్జనం కూడా జరుపుతారు. స్వామిదేవేరులతో సన్నిధానం చేరుకుంటారు. దీంతో పుష్పయాగం ముగుస్తుంది. పూల బావికే సొంతం శ్రీవారికి అలంకరించిన, వినియోగించిన పుష్పాలను ఎవ్వరికీ ఇవ్వరు. ప్రతి పుష్పాన్ని ఆలయంలోని బావిలో వేస్తారు. ఆలయంలోని అద్దాల మండపానికి ఉత్తర దిశలో పూలబావి ఉంది. దీనినే భూతీర్థం అని కూడా అంటారు. ఇందులో వేసిన పూలను తర్వాత స్వామివారి పూతోటకు ఎరువుగా వినియోగిస్తారని టీటీడీ ఉద్యానవన విభాగం తెలుపుతోంది. నిత్యం పుష్పార్చనే తిరుమల శ్రీవారికి ఒకరకంగా నిత్యం పుష్పాభిషేకమే. రోజూ 18 రకాల పుష్పాలతో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారికి పుష్పార్చన చేస్తారు. ఇందులో చామంతి, సంపంగి, రోజా, నందివర్ధనం, మరువం, దవనం, పన్నీరుఆకు, తులసి, మల్లెలు, కనకాంబరాలు, మొలలు, సెంటుజాజులు, తామర, కలువ, మొగిలిరేకులు తదితర పుష్పాలను సమర్పిస్తారు. కేవలం ఒక్కరోజు స్వామివారి అలంకరణకు 120 కేజీల పుష్పాలు వినియోగిస్తారు. నిత్య సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవవరకు జరిగే ప్రతి సేవలో 60 కిలోల పుష్పాల వినియోగం ఉంటుంది. వీటితోపాటు ప్రతి గురువారం శ్రీవారికి పూలంగిసేవ నిర్వహిస్తారు. ఈసేవలో 100 నుంచి 120 కేజీల పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్వామివారి నిత్య సేవలో ప్రశస్తమైన తోమలసేవకు 60 కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్వామివారికి పూల హారాలను మార్చుతారు. శ్రీవారి తలనుంచి భుజం వరకు అమర్చే పూలసెట్ను శిఖామణి అంటారు. భుజాల నుంచి పాదాల వరకు అలంకరించే పూలమాలను సాలిగ్రామం అంటారు. వక్షస్థలంలో ఉండే శ్రీదేవి, భూదేవి, కంఠహారం అలంకరణలు అన్నింటినీ కలిపి తోమాలసెట్ అంటారు. ఇలా నిత్యం తిరుమల స్వామి అలంకరణ, ఉత్సవాలు, సేవల్లో అలంకరణకు వందలాది కేజీల పుష్పాలను వినియోగిస్తారు. ఎన్ని పుష్పాలో.. పత్రాలో.. తిరుమల ఆలయంలోని కల్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగే పుష్పయాగంలో 7 నుంచి 10 టన్నుల సంప్రదాయ పుష్పాలను ఉపయోగించనున్నారు. చామంతి, రోజా, సంపంగి, గన్నేరు, నూరు వరహాలు, మల్లెలు, మొల్లలు, సెంటు జాజులు, కనకాంబరాలు, తామరపూలు, కలువపూలు, మాను సంపం గి,నందివర్ధనం, సెంటుజాజులు, మొగిలిపూలు తదితర పుష్పాలు మొగిలిరేకులు, మొరవం, దవనం, మారేడుదళం, పన్నీరుఆకు, కదిరికజ్జాతదితర పత్రాలతో సప్తగిరివాసుడిని వేదోక్తంగా అర్చించనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రతి పుష్పం స్వామి సేవకే.. తిరుమల పుష్పించే ప్రతి పుష్పం స్వామివారికే. ఇది తిరుమల క్షేత్రం సంప్రదాయం. స్వామి సేవలకు అవసరమయ్యే పుష్పాల కోసం 9వ శతాబ్దంలో అనంతాళ్వార్ అనేభక్తుడు ఆలయం వెనుకభాగంలో పూతోటను ఏర్పాటు చేశాడు. తోటలో పుష్పించిన పుష్పాలతో స్వామివారిని పూజించేవారు. ఆయన తదనంతరం ఆయన వారసులు ఈ సంప్రదాయాన్ని పాటించారు. 1996లో టీటీడీలో మీరాశీ వ్యవస్థను రద్దు చేశాక టీటీడీ ఆధీనంలోనే పూతోటను నెలకొల్పారు. శ్రీవారికి అవసరమైన పుష్పాలను సేకరించే బాధ్యతను టీటీడీ ఉద్యానవన శాఖకు అప్పగించింది. సుమారు వంద ఎకరాల్లో ఉద్యానవనశాఖ పూతోటను నిర్వహిస్తోంది. ఇక్కడి పుష్పాలను స్వామివారి సేవకు వినియోగిస్తున్నారు. వీటితోపాటు దాతలు స్వామివారి సేవకోసం పుష్పాలను వితరణగా అందిస్తుంటారు. తమిళనాడులోని సేలం, శ్రీరంగం, కుంభకోణం, చెన్నై, కర్ణాటకలోని కరూర్తోపాటు మనరాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి టన్నుల కొద్దీ పుష్పాలు తిరుమలకు చేరుతుంటాయి. -
కార్తీకం వచ్చిందమ్మా.. కోనసీమ చూసొద్దామా!
సాక్షి, ముమ్మిడివరం: కోనసీమలో కార్తీక మాసం సందడి నెలకొంది. అటు భక్తిభావంతో, ఇటు వినోద, విహారయాత్రలతో కోనసీమ కళకళలాడుతోంది. తన సహజ సిద్ధమైన అందాలతో సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. పచ్చని తీవాచీ పరిచినట్టుగా ఉండే పంటపొలాలు, అడుగడుగునా దర్శనమిచ్చే దేవాలయాలు, గోదావరి పాయల గలగలలు, ఇసుక తిన్నెలతో కూడిన సముద్రపు సోయగాలు చారిత్రక ప్రదేశాలతో కోనసీమలో ప్రకృతి రమణీయత ఉట్టి పడుతోంది. కార్తికమాసం వచ్చిదంటే కోనసీమ వాసుల ఆనందానికి అవధులుండవు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా వనభోజనాల్లో పాల్గొంటారు. మరికొందరైతే ఉపవాస దీక్షలతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. సముద్రం వెంబడి సరుగుడు తోటలు, రిసార్టులు, లైట్ హౌస్‌లు, తీరప్రాంతాలు, కోరంగి అభయారణ్యం, కందికుప్ప లైట్‌హౌస్, అన్నంపల్లి అక్విడెక్టు, పీడబ్యూడీ బంగ్లాలు, ముఖ్యమైన పిక్నిక్ స్పాట్లుగా గుర్తింపు పొందాయి. వీటితో పాటు ఆదుర్రు బౌద్ధ స్తూపం, దిండి బోటు హౌస్, రిసార్టులు, పర్యాటక కేంద్రాలుగా అందరినీ అలరిస్తున్నాయి. అలాగే అయినవిల్లి శ్రీసిద్ధి వినాయక స్వామి, ముక్తేశ్వరంలోని క్షణముక్తేశ్వరస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి, అమలాపురం వేంకటేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. విహారం కాకూడదు.. విషాదం పిక్నిక్‌లంటే తమను తాము మరిచిపోయేంత సంతోషంగా గడుపుతారు.అయితే ఈ విహారం ఒక్కొక్కసారి విషాదంగా మారుతోంది. ముఖ్యంగా సముద్రం స్నానాలకు వెళ్లే పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా అంతర్వేది, ఓడలరేవు, కొమరిగిరిపట్నం, కాట్రేనికోన సముద్ర తీరాల వద్ద ఏటా ఏదొక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఏదొక ప్రమాదం జరిగే వరకు పోలీసులు సైతం స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర తీరంలో గస్తీ ఏర్పాటు చేస్తున్నా అనుకున్నంత ప్రయోజనం చేకూరడం లేదని పర్యాటకులు వాపోతున్నారు. -
శైవక్షేత్ర దర్శనభాగ్యం
బస్‌స్టేషన్(విజయవాడ పశ్చిమం): కార్తీక మాసం ప్రారంభం కానున్న నేప«థ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ భక్తులకు శైవక్షేత్రాల దర్శన భాగ్యం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఒకే రోజు ఐదు పంచారామాల్లోని వెలసిన శివుని దర్శనం చేసుకోనేలా ప్యాకేజీ ప్రకటించింది. కృష్ణా రీజియన్ పరిధిలోని నవంబర్ 2వ తేదీ నుంచి 13 రోజుల పాటు భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు తిప్పునున్నారు. ఐదు పంచారామాలకు బస్సులు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని పంచా రామాల శైవక్షేత్రాల్లో వెలసిన శివుని దర్శనం చేసుకొనేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. మాసంలోని ప్రతి శనివారం, ఆదివారం, సోమవారాల్లో పాటు ముఖ్యమైన రోజుల్లో ఈసదుపాయం కలిగేవిధంగా నవంబర్ 2,3,4,9,10, 11, 16,17,18,23,24,25 తేదీలు నిర్ధారించారు. ఈమేరకు విజయవాడ నుంచి ఆటోనగర్ టెర్మినల్, పండిట్‌నెహ్రూ బస్టాండ్ నుంచి ఉదయం 3 నుంచి 4 గంటల వ్యవధిలో బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ సర్వీసులు నడుపుతున్నట్లు జయరావు తెలిపారు. ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు ముందుగా ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో, ఆథరైజ్డ్ టిక్కెట్ బుకింగ్ సెంటర్లలో రిజర్వేషన్ చేయించుకోవచ్చని వారు తెలిపారు. బస్ చార్జీలు ఇలా.. విజయవాడ నుంచి పంచారామాలలోని శైవక్షేత్రాలకు సూపర్‌లగ్జరీ టిక్కెట్ పెద్దలకు రూ.880 , పిల్లలకు రూ.660 వరకు నిర్ణయించారు. అలాగే అల్ట్రా డీలక్స్‌లో పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.630 వరకు చెల్లించాల్సి ఉందని ఆర్ఎం జి.నాగేంద్రప్రసాద్ తెలిపారు. త్రిలింగ దర్శిని యాగంటిలో కొలువైఉన్న శ్రీఉమామహేశ్వర స్వామిని దర్శనం, శ్రీశైలంలోని శ్రీమల్లిఖార్జున స్వామి వారి, వాటితోపాటు మహానందిలోని స్వామి వారిని దర్శించుకునేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేశారు. సూపర్ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేయగా పెద్దలకు రూ.1430, పిల్లలకు రూ.1080 కేటాయించారు. త్రిలింగదర్శిని కోసం ఏర్పాటు చేసిన సర్వీసులు శనివారం రాత్రి గం.8.00 బయల్దేరి తిరిగి సోమవారం ఉదయం విజయవాడ బస్టాండ్‌కు చేరుతాయి. మరింత సమచారం కోసం ఫోన్ నెంబరులో 8074298487 సంప్రదించాలని కోరారు. -
కార్తీక మాసాన... ఇల కైలాసాన...
పరమేశ్వరుడు మల్లికార్జున మహాలింగమూర్తిగా, పార్వతీదేవి భ్రమరాంబగా, గణపతి సాక్షిగణపతిగా, సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖునిగా, వీరభద్రస్వామి క్షేత్రపాలకుడిగా, నంది శనగల బసవన్నగా, గంగ పాతాళ గంగగా సమస్త మునులు వృక్షాలుగా, ఆ కైలాసమే భూమిపై అవతరించిందా అన్నట్లు దర్శనమిచ్చే ప్రదేశం శ్రీశైలం. అందుకే ఇది ఇలకైలాసం. శ్రీశైలాన్ని దర్శించడం ఒక యజ్ఞం ఆచరించిన ఫలితాన్నిస్తుందని, ఈ క్షేత్రాన్ని ఒక్కో మాసంలో దర్శిస్తే ఒక్కో ఫలితం లభిస్తుందని శ్రీపర్వతపురాణం చెప్పింది. కార్తీకమాసాన శ్రీశైలదర్శనం అతి గొప్పదైన వాజపేయ యాగాన్ని చేసిన ఫలితాన్ని ఇస్తుందని కూడా అదే పురాణం చెప్తోంది. కార్తీకమాసంలో శ్రీశైలఆలయంలో జరిగే కైకర్యాలెన్నో.... వాటిలో కొన్ని సాక్షి పాఠకుల కోసం నిరంతర శివ భజన కార్తీకమాసం ప్రారంభమైనరోజే ఆలయంలో నిరంతర శివనామభజన ప్రారంభమౌతుంది.ఈ మాసమంతా, ఇరవైనాలుగు గంటలూ వీరశిరోమండపం వద్ద శివనామస్మరణతో భజన కొనసాగుతూనే ఉంటుంది. ఆకాశదీపం ఆలయంలో ఆకాశదీపం నెలకొల్పే ఘట్టం కన్నులపండువగా ఉంటుంది. ముందుగా దీపానికి పూజాదికాలు నిర్వహిస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి కట్టిన తాడుతో ఆకాశదీపాన్ని పైకి లాగుతుంటే పంచాక్షరీ నామస్మరణతో, ఆకాశదీపకాంతులతో ఆ ప్రాంతమంతా మరింత కాంతిమంతమౌతుంది. సోమవారం... సేవలతోరం కార్తీక సోమవారం క్షేత్రమంతా భక్తులతో కిటకిటలాడుతుంటే, ఆలయంలో అనేక ఉత్సవాలతో స్వామి అమ్మవార్లు కొలువు తీరుతారు. ఆ రోజు సాయంత్రం స్వామీ అమ్మవార్లు నంది వాహనంపై కొలువుదీరి ఆలయ ఉత్సవంగా ఆలయం చుట్టూ ఊరేగి ఈశాన్యభాగంలో ఉన్న పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆలయపుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన లక్షదీపోత్సవ కార్యక్రమంలో ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపి లక్షదీపాలను వెలిగిస్తారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించి కార్తికదీపారాధనతో పునీతులవుతారు. ఆ తర్వాత ఆలయపుష్కరిణిలో జలాన్ని శివతీర్థంగా భావించి హారతి కార్యక్రమం జరుగుతుంది. పురాణ ప్రవచనకర్తలు కార్తికమాస మాహాత్మ్యాన్ని భక్తులకు తెలియజెప్తారు. ఈ కార్యక్రమం నాలుగు సోమవారాలు పౌర్ణమి నాడు జరుగుతుంది. వారోత్సవాలు మల్లికార్జునస్వామి వారికి ప్రతిరోజూ తెల్లవారుజామునపదకొండు మంది ఆలయపండితులతో మహాన్యాసపారాయణ, ఆరుద్రానక్షత్రం, మాసశివరాత్రి, పౌర్ణమి రోజుల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ప్రాతఃకాలంలో జరుగుతుంది.అలాగే అమ్మవారి ఆలయప్రాంగణంలో ప్రతి శుక్రవారం,మూలానక్షత్రం, పౌర్ణమి రోజున స్వామీఅమ్మవార్లకు పుష్పాలంకత ఊయలసేవ మరియు ప్రతి ఆదివారం, పౌర్ణమి,మూలానక్షత్రంరోజున పల్లకీసేవ, మాసశివరాత్రి రోజున నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సాక్షిగణపతికి నిత్యం గణపతి హోమాన్ని ఆర్జితసేవగా భక్తులకు ఆచరించుకునే అవకాశం కల్పిస్తుండగా, ప్రతి బుధవారం, పౌర్ణమి, సంకటహర చవితి రోజుల్లో ప్రత్యేక గణపతి హోమాన్ని, విశేష అభిషేకాన్ని దేవస్థానం సర్కారిసేవగా నిర్వహిస్తోంది. సుబ్రహ్మణ్యస్వామికి ప్రతిమంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథుల్లో విశేష అభిషేకం నిర్వహిస్తారు. ఆలయంలోని శనగల బసవన్నకు ప్రతి మంగళవారం, త్రయోదశి సమయాల్లో వృషభసూక్తంతో విశేష అభిషేకం ఆచరిస్తారు. దీన్ని నందిసేవగా పిలుస్తారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో, ఆలయప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి ప్రతి బుధవారం ప్రదోషకాలంలో విశేష అభిషేకం, పూజలు నిర్వహిస్తారు, అంకాళమ్మ అమ్మవారికి ప్రతి శుక్రవారం ఉదయం విశేష అభిషేకం జరుగుతుంది. జ్వాలాతోరణం ఆలయానికి ముందు భాగంలో గంగాధర మండపం ఉన్న ప్రదేశంలో దేవాంగభక్తుడితో సమర్పించబడిన నూలు దారాలను ఆవునేతితో తడిపి అక్కడ ఏర్పాటు చేసిన స్తంభాలకు వేలాడదీస్తారు. భక్తుల నమశ్శివాయ భజనలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతుంది. స్వామీ అమ్మవార్లు వెండి పల్లకిలో అక్కడికి చేరుకుంటారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆ నూలుదారపు గుత్తులను వెలిగిస్తారు. స్వామీ అమ్మవార్ల పల్లకిని మూడు సార్లు అటూ, ఇటూ దాటించి తీసుకుని వెళ్తారు. భక్తులు కూడా దాటి ఆ భస్మాన్ని తీసుకుని ధరిస్తారు. కొందరు దాన్ని దాచుకుంటారు. త్రిపురాసురసంహారం జరిగి కైలాసానికి తిరిగి వచ్చిన స్వామివారి గౌరవార్థం అమ్మవారు ఈ జ్వాలాతోరణకార్యక్రమాన్ని నిర్వహించిందనీ, దాన్నే నేటికీ ఆచరించడం జరుగుతోంది. కార్తీక పౌర్ణమి – నదీహారతి ఈరోజు సాయంత్రం పవిత్ర కృష్ణానదీమతల్లికి ప్రత్యేక పూజలు ఆచరించి సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించి, నదీహారతి కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి ఆలయ అర్చకులు, అమ్మవారి ఆలయ అర్చకులు పదకొండు రకాలహారతులను కృష్ణానదికి చూపుతారు. హారతిదీపకాంతులు నదిలో ప్రతిబింబించే దృశ్యం చూసి భక్తులంతా అత్యంత ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. – కె.వి.సత్యబ్రహ్మాచార్య ‘ఆలయాలు– ఆగమాలు’ గ్రంథ రచయిత -
ఉల్లాసంగా..ఉత్సాహంగా
-
భక్తజన గిరి
కార్తిక ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన అన్నవరం సత్యదేవుని దర్శించిన 70 వేల మంది భక్తులు వ్రతాలు 7,400... ఆదాయం రూ.70 లక్షలు అన్నవరం : కార్తికమాసం శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం రత్నగిరి సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి బుధవారం రాత్రి నుంచే రత్నగిరికి భక్తులు తరలివచ్చారు. దేవస్థానం సత్రాల్లో గదులు బుధవారం సాయంత్రానికే భక్తులతో నిండిపోయాయి. గదులు దొరకని వారు ఆలయప్రాంగణంలోనే విశ్రమించారు. తెల్లవారు జాము నుంచి టికెట్ల విక్రయం.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి స్వామివారి వ్రతాల టికెట్లు విక్రయించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, నాలుగు గంటల నుంచి సత్యదేవుని దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల సమయంలో భక్తులు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా తొమ్మిది గంటల నుంచి మరలా రద్దీ ఏర్పడింది. భక్తుల రద్దీ కారణంగా పలు మార్లు స్వామివారి అంతరాలయ దర్శనం బయట నుంచే అమలు చేశారు. స్వామివారి సాధారణ దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. రూ.150 వ్రతాలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడంతో భక్తులు రూ.300 వ్రతాలు ఆచరించారు. స్వామివారి వ్రతాలాచరించిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం గోశాలలో సప్తగోవులకు, రాజగోపురం ఎదురుగా గల రావిచెట్టుకు ప్రదక్షణం చేశారు. రూ.75 లక్షల ఆదాయం స్వామివారిని గురువారం 75వేల మంది భక్తులు దర్శించారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి స్వామివారి వ్రతాలు 7,400 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.75 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఐదు వేలమందికి పులిహోర, దద్దోజనం పంపిణీ దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మ«ధ్యాహ్నం మూడు గంటల వరకూ పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు.