సాక్షి, ముమ్మిడివరం: కోనసీమలో కార్తీక మాసం సందడి నెలకొంది. అటు భక్తిభావంతో, ఇటు వినోద, విహారయాత్రలతో కోనసీమ కళకళలాడుతోంది. తన సహజ సిద్ధమైన అందాలతో సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. పచ్చని తీవాచీ పరిచినట్టుగా ఉండే పంటపొలాలు, అడుగడుగునా దర్శనమిచ్చే దేవాలయాలు, గోదావరి పాయల గలగలలు, ఇసుక తిన్నెలతో కూడిన సముద్రపు సోయగాలు చారిత్రక ప్రదేశాలతో కోనసీమలో ప్రకృతి రమణీయత ఉట్టి పడుతోంది. కార్తికమాసం వచ్చిదంటే కోనసీమ వాసుల ఆనందానికి అవధులుండవు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో సరదాగా వనభోజనాల్లో పాల్గొంటారు. మరికొందరైతే ఉపవాస దీక్షలతో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
సముద్రం వెంబడి సరుగుడు తోటలు, రిసార్టులు, లైట్ హౌస్‌లు, తీరప్రాంతాలు, కోరంగి అభయారణ్యం, కందికుప్ప లైట్‌హౌస్, అన్నంపల్లి అక్విడెక్టు, పీడబ్యూడీ బంగ్లాలు, ముఖ్యమైన పిక్నిక్ స్పాట్‌లుగా గుర్తింపు పొందాయి. వీటితో పాటు ఆదుర్రు బౌద్ధ స్తూపం, దిండి బోటు హౌస్, రిసార్టులు, పర్యాటక కేంద్రాలుగా అందరినీ అలరిస్తున్నాయి. అలాగే అయినవిల్లి శ్రీసిద్ధి వినాయక స్వామి, ముక్తేశ్వరంలోని క్షణముక్తేశ్వరస్వామి, మురమళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి, అమలాపురం వేంకటేశ్వరస్వామి, కుండలేశ్వరం కుండలేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి.
విహారం కాకూడదు.. విషాదం
పిక్నిక్‌లంటే తమను తాము మరిచిపోయేంత సంతోషంగా గడుపుతారు.అయితే ఈ విహారం ఒక్కొక్కసారి విషాదంగా మారుతోంది. ముఖ్యంగా సముద్రం స్నానాలకు వెళ్లే పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా అంతర్వేది, ఓడలరేవు, కొమరిగిరిపట్నం, కాట్రేనికోన సముద్ర తీరాల వద్ద ఏటా ఏదొక దుర్ఘటన జరుగుతూనే ఉంది. ఏదొక ప్రమాదం జరిగే వరకు పోలీసులు సైతం స్పందించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్ర తీరంలో గస్తీ ఏర్పాటు చేస్తున్నా అనుకున్నంత ప్రయోజనం చేకూరడం లేదని పర్యాటకులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment