అమలాపురం/ అంబాజీపేట(పి.గన్నవరం): కోనసీమలో ప్రభల తీర్థాలతో సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా సీమలో పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలు నభూతో...అన్నట్టుగా సాగాయి. ముఖ్యంగా కనుమ పండగ నాడు పచ్చని సీమలో రంగురంగులు హద్దుకున్న ప్రభలు కొలువుదీరాయి. ఊరేగింపుగా వెళుతూ వీధులు.. చేలు.. తోటలను పుణీతం చేశాయి. ఈ గ్రామం తిరునాళ్లు చూసినా ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడాయి. సముద్ర ఘోషను తలపించేలా వేలాది మంది భక్తుల ఓంకార నాదాలు..వందల మంది భక్తులు తమ భుజస్కాందాలపై ప్రభులను మోస్తూ ముందుకు సాగారు.
బాణా సంచా కాల్పులు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలతో కోనసీమ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లాయి. కోనసీమలో ఈ తీర్థాలు నాలుగు రోజులపాటు సాగుతాయి. కొత్తపేట తీర్థం బుధవారం జరగగా, గురువారం కనుమ పండుగ రోజున అంబాజీపేట మండలం జగ్గన్నతోట, వాకలగరువు, మామిడికుదురు మండలం కొర్లగుంటతోపాటు సుమారు 60కు పైగా తీర్థాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా కొత్త ప్రాంతాల్లో కూడా ప్రభల తీర్థలు జరిగాయి. తీర్థాలకు కొత్త ప్రభలు కూడా తరలివచ్చాయి.
చారిత్రాత్మక ప్రధాన్యత ఉన్న అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోట ప్రభల తీర్థం వేడుకలు ఆకాశమే హద్దుగా అన్నట్టుగా జరిగాయి. తీర్థానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ రాష్ట్రాలకు చెందినవారు..ఎన్‌ఆర్‌ఐలు తీర్థానికి కుటుంబాలతో కలిసి వచ్చారు. సంప్రదాయ వస్త్రధారణలతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడ్డారు. వృద్ధులు, యువకులు, మహిళలు అనే తేడా లేకుండా తీర్థానికి వచ్చి సందడి చేశారు. ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. రంగురంగు ప్రభలు ఒకచోట కొలువుదీరిన అందమైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకరించిపోయారు.
తీర్థానికి వ్యాఘ్రేశ్వరం నుంచి వచ్చిన వ్యాఘ్రేశ్వరరావు స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకెత్తి లేపారు. గంగలకుర్రు అగ్రహారం శ్రీ ఉమా పార్వతి సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర కౌశిక దాటుకుని వచ్చే దృశ్యాన్ని వేలాది మంది భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. తీర్థానికి పెద్దవి 11 ప్రభలు కాగా, వాటితోపాటు చిన్నచిన్న ప్రభలు మరో ఎనిమిది వరకు వచ్చాయి. ఉదయం 11 గంటలకు తీర్థానికి ప్రభల రాక ఆరంభమైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు గంగలకుర్రు, 1.00 గంట సమయంలో గంగలకుర్రు అగ్రహారం ప్రభులు కౌశిక దాటి వచ్చాయి. కేరళ డప్పు వాయిద్యాలు, మేళ తాళాలు, బాణాసంచా కాల్పులతో గంగలకుర్రు ప్రభ ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. భక్తుల దర్శనానికి కొద్దిసేపు ఉంచి తరువాత వెనకకు తీసుకుని వెళ్లారు. ఎప్పటిలానే సంప్రదాయబద్ధంగా పలు కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది.
ఆ ప్రభ ఎత్తు 54 అడుగులు:
అంబాజీపేట మండలం వాకలగరువులో జరిగే ప్రభల తీర్థం మొత్తం కోనసీమలో జరిగే తీర్థాల్లో హైలెట్‌గా నిలిచింది. కోనసీమలో ఎక్కడా లేని విధంగా వాకలగరువుకు చెందిన శ్రీ ఉమా సర్వేశ్వరస్వామి ప్రభను భక్తులు 54 అడుగుల ఎత్తున తయారు చేశారు. గత ఏడాది 48 అడుగులు ఉన్న ప్రభను ఈసారి ఏకంగా ఆరు అడుగులు పెంచారు. అదే విధంగా తీర్థానికి వచ్చే తొండవరం ఉమా తొండేశ్వరస్వామి 48 అడుగులు ఎత్తున ఏర్పాటు చేశారు. గత ఏడాది ఇది 46 అడుగులు మాత్రమే. ఈ రెండు ప్రభలు వాకగరువు రావిచెట్టు సెంటరు వద్ద ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున భక్తులు తిలకించారు. ఇదే మండలం చిరతపూడి చిట్టి చెరువు గట్టు వద్ద కూడా ప్రభల తీర్థం జరిగింది.
పి.గన్నవరం మండలం గాజులుగుంట, నాగుల్లంక, ఉడిమూడిలోను, వాడ్రేవుపల్లి, కొత్తపేటలో మందపల్లి, అవిడి డ్యామ్ సెంటరు, వాడపాలెం, రావులపాలెం మండలం దేవరపల్లిలో గురువారం ప్రభల తీర్థాలు జరిగాయి. మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. ఇక్కడకు సైతం ప్రభలు పంటచేలు, కాలువులు దాటుకుని వచ్చాయి. అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, రాజోలు నియోజకవర్గ పరిధిలో మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, చెయ్యేరు, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవిలల్లో ప్రభలు తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి.
Comments
Please login to add a commentAdd a comment