భక్తజన గిరి
-
కార్తిక ఏకాదశి సందర్భంగా కిటకిటలాడిన అన్నవరం
-
సత్యదేవుని దర్శించిన 70 వేల మంది భక్తులు
-
వ్రతాలు 7,400... ఆదాయం రూ.70 లక్షలు
అన్నవరం :
కార్తికమాసం శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం రత్నగిరి సత్యదేవుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి బుధవారం రాత్రి నుంచే రత్నగిరికి భక్తులు తరలివచ్చారు. దేవస్థానం సత్రాల్లో గదులు బుధవారం సాయంత్రానికే భక్తులతో నిండిపోయాయి. గదులు దొరకని వారు ఆలయప్రాంగణంలోనే విశ్రమించారు.
తెల్లవారు జాము నుంచి టికెట్ల విక్రయం..
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి స్వామివారి వ్రతాల టికెట్లు విక్రయించారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, నాలుగు గంటల నుంచి సత్యదేవుని దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల సమయంలో భక్తులు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా తొమ్మిది గంటల నుంచి మరలా రద్దీ ఏర్పడింది. భక్తుల రద్దీ కారణంగా పలు మార్లు స్వామివారి అంతరాలయ దర్శనం బయట నుంచే అమలు చేశారు.
స్వామివారి సాధారణ దర్శనానికి గంట సమయం పట్టింది. ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. రూ.150 వ్రతాలను దేవస్థానం అధికారులు తాత్కాలికంగా నిలిపివేయడంతో భక్తులు రూ.300 వ్రతాలు ఆచరించారు. స్వామివారి వ్రతాలాచరించిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారు. అనంతరం గోశాలలో సప్తగోవులకు, రాజగోపురం ఎదురుగా గల రావిచెట్టుకు ప్రదక్షణం చేశారు.
రూ.75 లక్షల ఆదాయం
స్వామివారిని గురువారం 75వేల మంది భక్తులు దర్శించారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి స్వామివారి వ్రతాలు 7,400 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.75 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
ఐదు వేలమందికి పులిహోర, దద్దోజనం పంపిణీ దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మ«ధ్యాహ్నం మూడు గంటల వరకూ పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు.