సత్యదేవునికి పన్ను పోటు!
సత్యదేవునికి పన్ను పోటు!
Published Sat, Jul 1 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM
- అన్నవరం దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ జీఎస్‌టీ?
- రత్నగిరీశుని వార్షికాదాయం రూ.125 కోట్లు
- రూ.20 లక్షలు దాటితే తప్పని పన్నుభారం
- ఇంకా అందని ఆదేశాలు
అన్నవరం (ప్రత్తిపాడు) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానానికి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పోటు తగలనుంది. నూతన పన్ను విధానం వలన దేవస్థానంపై రూ.5 కోట్ల వరకూ భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదాయ పరంగా రాష్ట్రంలో తిరుమల - తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాల తరువాతి స్థానంలో అన్నవరం ఉంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో సత్యదేవుని వార్షికాదాయం రూ.125 కోట్లు దాటింది. ఈ నేపథ్యంలో నూతన పన్ను విధాన ప్రభావం అన్నవరం దేవస్థానంపై అధికంగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయిలో ఇంకా నిర్ధారణ జరగకపోయినా దేవస్థానంలో వివిధ సేవల టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదం తయారీకి ముడిసరుకుల కొనుగోళ్లు, అన్నదానం పథకంలో ఆహార పదార్థాల తయారీకి కొనుగోలు చేసే ముడి సరుకులవంటి వాటిపై జీఎస్‌టీ పడే అవకాశం ఉంది. ఇది ఎంతమేరకు అనేదానిపై ఇంకా స్పష్టత రానందున ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేమని దేవస్థానం అధికారులు అంటున్నారు.
రూ.20 లక్షల వార్షికాదాయం మించితే..
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ.20 లక్షల వార్షికాదాయం దాటిన దేవస్థానాలన్నీ జీఎస్‌టీ పరిధిలోకి వస్తాయి. దాని ప్రకారం జిల్లాలోని తలుపులమ్మ లోవ దేవస్థానం సహా సుమారు 50 దేవస్థానాలు జీఎస్‌టీ పరిధిలోకి వస్తున్నాయి. వీటన్నింటికంటే అన్నవరం దేవస్థానం వార్షికాదాయం అధికం. కాబట్టి ఈ దేవస్థానమే ఎక్కువ జీఎస్‌టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నారు.
ఏటా రూ.26 కోట్లతో ముడిసరుకుల కొనుగోళ్లు
అన్నవరం దేవస్థానంలో ఏటా రూ.26 కోట్లతో వివిధ ముడిసరుకులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో రూ.23 కోట్లను ప్రసాదం తయారీలో వాడే గోధుమలు, పంచదార, నెయ్యి, యాలకులు, గ్యాస్, వ్రతాల్లో వాడే నూనె, ఇతర పూజాసామగ్రి, వివిధ సత్రాల్లో వాడే వస్తువుల కొనుగోళ్లకు వెచ్చిస్తున్నారు. అన్నదానం పథకంలో ప్రత్యేకంగా రూ.3 కోట్లతో బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె తదితర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో కొన్నింటిపై ప్రస్తుతం వ్యాట్, కొన్నింటిపై సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఒకే పన్ను కావడంతో ఇకనుంచి జీఎస్‌టీ విధించనున్నారు.
తలనీలాల విక్రయంపై కూడా..
దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాల విక్రయం మీద కూడా జీఎస్‌టీ విధించే అవకాశం ఉంది. ఏటా ఇక్కడి తలనీలాలను బహిరంగ వేలం ద్వారా దేవస్థానం విక్రయిస్తుంది. తద్వారా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకూ ఆదాయం వస్తోంది.
జీఎస్‌టీపై ఎటువంటి ఆదేశాలూ రాలేదు
దేవస్థానంలో కొనుగోళ్లు, అమ్మకాలపై జీఎస్‌టీ విధింపు అంశానికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఇంతవరకూ ఎటువంటి ఆదేశాలూ రాలేదు. జీఎస్‌టీ ఎంతమేరకు ఉంటుంది? దేనిపై ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఆడిటర్లను అడిగాం. ప్రస్తుతానికి దేవస్థానంలో యథాతథ స్థితి కొనసాగుతోంది. జీఎస్‌టీ అమలుపై ఉన్నతాధికారులు సర్క్యులర్ పంపిస్తే దాని ప్రకారం వ్యవహరిస్తాం.
- ఈరంకి వేంకట జగన్నాథరావు, ఇన్‌చార్జి ఈఓ, అన్నవరం దేవస్థానం
Advertisement