ఏడడుగుల దారిలో జీఎస్‌టీ ముళ్లు
- ఈ నెలలో వందలాది వివాహ వేడుకలు..
- తప్పించుకోలేని ఖర్చులు అనేకం..
- తల్లిదండ్రులకు భారంగా నగదు కొరత..
- వచ్చే ఫిబ్రవరిలోనే మళ్లీ ముహూర్తాలు
- కల్యాణ మండపాల్లో 85 శాతం బుక్
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :
పెళ్లంటే సందళ్లు, పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, భాజాలు, భజంత్రీలు, మూడే ముళ్లు, ఏడే అడుగులు అని ఒక సినీ కవి తేలిగ్గా చెప్పేశాడు. కానీ పెళ్లంటే ప్రస్తుత రోజుల్లో తలప్రాణం తోకకొస్తోందని తల్లిదండ్రులు హడావుడి పడిపోవడం చూస్తూనే ఉంటాం. పెళ్లి అనగానే పసుపుకొట్టడం నుంచి అప్పగింతల వరకూ ఎన్ని కష్టాలు, ఎంత ఒత్తిడి ఉంటుందో పెళ్లి వేడుకలు పెట్టుకున్నవారికే తెలుస్తుంది. ముహూర్తాలు కుదిరిన నాటి నుండి ఇక వారి హడావుడి చెప్పనే అక్కర లేదు.
శుభలేఖల నుంచి తమ స్థోమతు బంధుమిత్రులకు తెలియచేయడానికి చేయాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. ఏ కల్యాణ మండపంలో పెళ్లి చేయాలి, వాటికి పచ్చిపూలతో అలంకరణ చేయాలా, విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలా, ఎంతమందిని పిలవాలి, ఎంతమంది వస్తారు, విందులో ఏమేమి పదార్థాలు పెట్టాలి, బంధువులకు సమర్పించాల్సిన లాంఛనాలు, పెళ్లికి హాజరయ్యే బంధుమిత్రులకు ఏ బహుమతులు ఇవ్వాలి ఇలా అనేక ఆలోచనలు వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా వధూవరుల తల్లిదండ్రులకు ఇప్పుడు కొత్తగా ఒక సమస్య వచ్చిపడింది. అదే కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన జీఎస్‌టీ. నగదు కొరత దీనికి తోడయింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ముహూర్తాలు లేవు..
ఈ నెలలో 16, 17, 18 తేదీలతో పాటు 23, 24, 31 తేదీల్లో మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అనంతరం వచ్చే భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో సరైన ముహూర్తాలు లేకపోవడంతో సంబంధాలు కుదుర్చుకున్న వారు ఈ నెలలోనే వివాహ వేడుకలు కూడా పెట్టుకున్నారు. అక్టోబర్ 12 నుండి నవంబర్ 9వ తేదీ వరకూ గురు మూఢమి, నవంబర్ 28 నుంచి శుక్రమూఢమి రావడంతో వచ్చే ఫిబ్రవరి వరకూ అడపాదడపా తప్ప ముహూర్తాలు లేకపోవడం కూడా ఈ శ్రావణ మాసంలోనే అధికంగా పెళ్లిళ్లు జరిపేయడానికి కారణంగా భావించవచ్చు.
బుక్కైపోయిన కళ్యాణ మండపాలు..
శ్రావణ మాసం తరువాత వివాహాలకు ముహూర్తాలు లేకపోవడంతో ఈ మాసంలోనే అధికంగా పెళ్లిళ్లు చేయడానికి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 800 కల్యాణ మండపాల్లో దాదాపు 85 శాతం మండపాలు మంచి ముహూర్తాల రోజుల్లో బుక్కైపోయాయి. ఇప్పటికిప్పుడు ముహూర్తాలు పెట్టుకునే వారికి మంచి కల్యాణ మండపాలు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.
జీఎస్‌టీతో తడిసి మోపెడు ఖర్చులు..
అంతాబాగానే ఉన్నా ప్రస్తుతం పెళ్లి వేడుకలు పెట్టుకున్న వారిపై జీఎస్‌టీ ప్రభావం పడడంతో పెళ్లి ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. వివాహ వేడుకలకు కచ్చితంగా కావాల్సిన ప్రతీ వస్తువుపై జీఎస్‌టీ ప్రభావం పడడంతో పెళ్లి బడ్జెట్ అనుకున్న దాని కంటే సుమారు రూ. 50 వేల నుండి రూ. 2 లక్షల వరకూ అదనంగా అవుతోంది. మధ్యతరగతి ప్రజలు కూడా ఏసీ కల్యాణ మండపాల్లోనే వేడుకలు చేయడానికి ప్రయత్నించడంతో వాటికి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో అందుబాటులో ఉన్న ఏసీ కల్యాణ మండపాల కనీస అద్దె సుమారు రూ. 30 వేలు ఉండగా పెద్దపెద్ద ఏసీ కళ్యాణ మండపాల అద్దెలు సుమారు రూ. లక్ష నుండి రూ. 2 లక్షల మధ్య ఉంటున్నాయి. వాటికి పచ్చిపూలతో అలంకరణ చేయాలన్నా, విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలన్నా సుమారు రూ. 15 వేల నుండి రూ. 75 వేల వరకూ అడుగుతున్నారు.
ఇక భోజనాల విషయానికి వచ్చే సరికి మధ్యతరగతి ప్రజలు ఆకుల్లో కనీసం మూడు రకాల స్వీట్లు, రెండు రకాల హాట్లు పెట్టడం సంప్రదాయంగా మారిపోయింది. వారి తాహతును బట్టి పప్పు, రెండుమూడు రకాల కూరలు, వేపుళ్ళు, ఉలవచారు, సాంబారు ఇలా పదార్థాల జాబితా ఎక్కువగానే ఉంటోంది. వీటన్నింటినీ తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకులపై జీఎస్‌టీ పడడంతో వాటి ధరలకు రెక్కలు వచ్చి కొనుగోలు చేయడానికి మరింత అధికంగా సొమ్ము చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే వివాహ వేడుకల్లో ప్రధాన భూమిక వహించే బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలపై కూడా జీఎస్‌టీ పడడంతో ఖర్చు మరింతగా పెరిగిపోతోంది.
ఇదిలా ఉండగా పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త కరెన్సీని కేంద్ర ప్రభుత్వం అరకొరగా విడుదల చేయడంతో బ్యాంకుల్లో తమ వద్ద నిల్వ ఉన్న సొమ్మును ఆయా ఖర్చులకు తీసుకోవాలనుకున్నా బ్యాంకు అధికారులు ఖాతాదారులకు అవసరమైనంత సొమ్ము ఇవ్వలేకపోతున్నారు. దీనితో సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఖర్చు అయ్యే వివాహ వేడుకలకు వధూవరుల తల్లిదండ్రులకు సమయానికి నగదు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో వివాహ వేడుక చేయడం తలకుమించిన భారంగా పరిణమించింది.
సెప్టెంబర్‌లో శూన్యమాసం అటుపై మూఢమి
వారణాశి శ్రీ రాఘవేంద్ర శర్మ, అర్చకులు, పురోహితుడు..
శ్రావణ మాసం తరువాత వివాహాలకు మంచి ముహూర్తాలు పెద్దగా లేవు. సెప్టెంబర్ నెలలో శూన్యమాసం రాగా, నవంబర్, డిసెంబర్ నెలల్లో మూఢమి చోటుచేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ వరకూ సరైన ముహూర్తాలు లేవనే చెప్పాలి.