కొబ్బరి రైతుల నెత్తిన జీఎస్‌టీ పిడుగు
కొబ్బరి రైతుల నెత్తిన జీఎస్‌టీ పిడుగు
Published Mon, May 22 2017 11:05 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- ఎండుకొబ్బరిపై ఐదు శాతం పన్ను
- ఇప్పటి వరకు పన్ను మినహాయింపు
- ఏడాదికి రూ.ఐదు కోట్లకు భారం
- మిగిలిన ఉత్పత్తులపైనా ప్రభావం
- కొబ్బరి నూనెకు ఊతం
- జీఎస్‌టీ 22 శాతం ఉన్న పన్ను 18కి కుదింపు
అమలాపురం /అంబాజీపేట (పి.గన్నవరం) : రైతులు ఆందోళన చెందుతున్నట్టుగానే కొబ్బరిపై జీఎస్‌టీ పిడుగు పడింది. ఎండు కొబ్బరిపై 5 శాతం పన్ను విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. మన రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేళ్లుగా పన్ను మినహాయింపు ఉండగా, తాజాగా పన్నుభారం పడడం రైతులు విస్మయానికి గురిచేస్తోంది. ఇదే సమయంలో కొబ్బరి నూనెపై కొంత వరకు పన్ను మినహాయింపునిచ్చి ఊరట కలిగించేందుకు ప్రయత్నించినా ఎండు కొబ్బరిపై పన్ను వల్ల రైతులపై మోయలేని భారం పడనుంది. గతంలో ఎండుకొబ్బరిపై 4 శాతం పన్ను ఉండేది. దీన్ని తొలుత రెండు శాతానికి తగ్గించి, 2008 నుంచి పూర్తిగా ఎత్తివేశారు. వ్యాట్ అమలులోకి వచ్చినా పన్ను మాత్రం అమలు చేయలేదు. కేవలం సీఎస్‌టీ (ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటప్పుడు) మాత్రమే 2 శాతం పన్ను విధానం ఉంది. పన్ను మినహాయింపు వల్ల వ్యాపారులకు ప్రత్యక్షంగా, రైతులకు పరోక్షంగా మేలు జరిగేది. ఈ మినహాయింపు వల్ల జిల్లాలో 1.25 లక్షల మంది రైతులు లాభపడ్డారు.
కోట్ల రూపాయల భారం...
దేశమంతా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సు (జీఎస్‌టీ) అమలులోకి రావడంతో కొబ్బరి ఉత్పత్తులపై పన్నుపడింది. నిన్నటి మొన్నటి వరకు స్పష్టత రాకున్నా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీఎస్‌టీ పన్ను విధానంలో ఎండుకొబ్బరి, పంచదార వంటి వ్యవసాయ ఆధారిత తయారీ ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఎండుకొబ్బరి ఆధారంగానే కొబ్బరి ఉత్పత్తుల ధరలు ఉంటాయి. ఇప్పటి వరకు ఉన్న పన్ను మినహాయింపు ఇక నుంచి ఉండకపోవడంతో వ్యాపారులు కన్నా రైతులు ఎక్కువుగా నష్టపోనున్నారు. వ్యాపారులు పన్ను భారాన్ని రైతులపై మోపి, వారికి చెల్లించే సొమ్ముల నుంచి తగ్గించడం ఇక్కడ సర్వసాధారణం. అంబాజీపేట మార్కెట్ నుంచి ఎండు కొబ్బరి ఎగుమతులే ఏడాదికి రూ.250 కోట్లకు పైబడి ఉంటాయని అంచనా. అంటే ఏడాదికి సుమారు రూ. 5 కోట్ల పన్నుభారం పడనుందని అంచనా.
మనకు ఇంత వరకు పన్ను లేకున్నా జీఎస్‌టీలో దేశమంతా ఒకే విధమైన పన్ను విధానం అలులోకి రావడంతో మనపై కూడా పన్నుభారం పడుతోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పన్ను విధానాన్ని జీఎస్‌టీలో దేశమంతా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మన రాష్ట్రంతోపాటు కేరళలో మాత్రమే కొబ్బరి, ఎండు కొబ్బరిపై పన్నులేదు. మిగిలిన కొబ్బరి పండించే రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, అస్సాం వంటి రాష్ట్రాల్లో పన్ను విధానం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని జీఎస్‌టీ విధించినట్టు సమాచారం.
కొబ్బరి నూనెపై ఊరట...
ఇదే సమయంలో కొబ్బరి నూనెకు పన్ను తగ్గించడం రైతులకు కొంతలో కొంత ఊరటనిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న 22 నుంచి 24 శాతం పన్ను విధానాన్ని మార్పులు చేసి జీఎస్‌టీలో 18 శాతం శ్లాబ్‌లో పెట్టడంతో వ్యాపారులకు, రైతులకు మేలు జరగనుంది. దీనివల్ల కొబ్బరి నూనె ధరలు తగ్గడంతోపాటు వినియోగం పెరిగి ఇటు కొబ్బరికి సైతం డిమాండ్ వస్తోందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొబ్బరినూనె మార్కెట్‌కు, ఎగుమతులకు అంబాజీపేట చిరునామాగా ఉన్న విషయం తెలిసిందే. రోజుకు ఇక్కడ నుంచి రెండు టన్నుల కొబ్బరి నూనె ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటుంది. పన్ను మినహాయింపు లభిస్తే ఇక్కడ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement