సాక్షి, వికారాబాద్: సాగునీటి పొదుపును ప్రోత్సహించాలనే సదాశయంతో ప్రభుత్వం దశాబ్దకాలంగా డ్రిప్, స్ప్రింక్లర్ సేద్యం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. కూరగాయల సాగు కోసం ఉద్యానశాఖ నుంచి చేయూతనిస్తున్నారు. ఇందులో భాగంగా 2016– 17లో జిల్లాలో మంజూరు లక్ష్యం 1,771 హెక్లార్లు ఉండగా 1,072 హెక్టార్లకు గాను 1,008 మంది రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సెట్లు అందజేశారు. అదే విధంగా 2017– 18లో 2,544 హెక్టార్లలో సాగు లక్ష్యానికి గాను 2,372 మంది రైతులకు మంజూరుచేశారు. సాంక్షన్ అనుమతి ఇచ్చిన తర్వాత సబ్సిడీపోనూ మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక రైతుకు గరిష్టంగా 12.5 ఎకరాలకు గాను రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో గత సంవత్సరం జూలై నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి రావడంతో పరికరాలపై 5 శాతం ఉన్న జీఎస్టీ ఏకంగా 18 శాతానికి పెరిగింది. దీంతో తుంపర, బిందు సేద్యానికి అవసరమైన పైపులకు ఆయా కంపెనీలు సైతం వస్తు సేవల పన్ను అమలు చేశారు. ఉదాహరణకు ఒక యూనిట్ కాస్ట్ లక్ష రూపాయలైతే 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. అంటే లక్ష రూపాయల విలువైన వ్యవసాయ పరికరాలు పొందేందుకు జీఎస్టీ కింద రైతులు రూ.18 వేలు చెల్లించాలి. దీంట్లో ప్రభుత్వం తన వాటాగా రూ.5 వేలు మాత్రమే అందిస్తోంది. ఫలితంగా ఒక యూనిట్ మంజూరైన రైతు ప్రస్తుతం రూ.13 వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు 5శాతం జీఎస్టీ అమలులో ఉండడంతో ప్రభుత్వ వాటాపోను యూనిట్ కాస్ట్ ఆధారంగా రైతు కేవలం రూ.2 వేల నుంచి రూ.3 వేలు చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం ఈ మొత్తం రూ.13 వేలకు చేరి భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీఎస్టీ అమలు కాకముందు ఒక సెట్ (25 పైపులు) స్ప్రింక్లర్లకు గాను సబ్సిడీ పోను రూ.4,500 ధర ఉంటే.. జీఎస్టీ అమలు తర్వాత ఒక్కో సెట్టుకు రూ.6,335 చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు.
దరఖాస్తు విధానం ఇలా..
తుంపర, బిందు సేద్యం సాగు ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, చెరకు, వేరుశనగ తదితర పంటలకు ఉద్యానశాఖ ద్వారా రాయితీ అందజేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల సేద్యానికిగాను ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందాలంటే మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటుగా 1– బీ, పాస్‌పుస్తకం, గ్రామ రెవెన్యూ ప్లాన్ (నక్షా), ఆధార్‌కార్డు జిరాక్స్, బ్యాంకు ఖాతా జిరాక్స్, ఫీల్డ్ (పొలం) ఫొటో, రైతు పాస్‌పోర్ట్ సైజు ఫొటో జతచేయాలి.
నిరంతర ప్రక్రియ
’తుంపర, బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకోవడం నిరంతర ప్రక్రియ. గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయగలిగాం. 2017– 18లో సైతం జిల్లాలో 2,544 హెక్టార్ల మంజూరు లక్ష్యానికిగానూ వంద శాతం పూర్తి చేశాం. జిల్లాలో 2,372 మంది రైతులు లబ్ధిపొందారు. బిందు, తుంపర సేద్యంపై ఆసక్తిగల రైతులు ప్రభుత్వ సబ్సిడీకోసం ఆన్‌లైన్‌లో మీసేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అర్హులైన వారికి మంజూరు ఇస్తాం. జీఎస్టీ అమలు తర్వాత రైతులపై ఆర్థిక భారం పడుతున్న మాట వాస్తవమే. – సంజయ్‌కుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment