సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ భారమున్నా సూక్ష్మసేద్యం కోసం రైతులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రైతులు జీఎస్టీ భరించాలి. ఆ భారాన్ని కేంద్రం తగ్గిస్తుందని భావించారు. కానీ కేంద్రం కరుణించలేదు. ఈ నేపథ్యంలో భారమైనా సరే సూక్ష్మసేద్యానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో సూక్ష్మసేద్యంపై 5 శాతం వ్యాట్ ఉండేది. అందులో రూ.5 వేలకు మించకుండా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. 18 శాతం జీఎస్టీలో 5 శాతాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మిగిలిన 13 శాతం ఇప్పుడు రైతులు భరిస్తున్నారు. అయితే ఇంత భారమైనా రైతుల నుంచి సూక్ష్మసేద్యం కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
గతంలో కన్నా భారీగా దరఖాస్తులు..
2017–18లో ఇప్పటి వరకు 3.85 లక్షల ఎకరాలకు 1.16 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. జీఎస్టీ లేనప్పటికంటే ఇప్పుడే భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారని చెబుతున్నారు. 2016–17లో 10,550 మంది రైతులు 32,710 ఎకరాలకు దరఖాస్తు చేసుకోగా.. గత ఆర్థిక సంవత్సరం కంటే పది రెట్ల ఎకరాలకు దరఖాస్తులు రావడం విశేషం. గతేడాది సూక్ష్మసేద్యం కోసం దరఖాస్తు చేసుకుంటే నిధుల్లేక చాలా వరకు నిలిచిపోయాయి. ఈ ఏడాది ప్రభుత్వం నాబార్డు నుంచి రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకోవడంతో నిధుల సమస్య తీరింది.
ఎస్సీ, ఎస్టీలకు పథకం ఉచితం..
ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.25–30 వేల వరకు ఖర్చు కానుంది. 4 ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్షకు పైగానే ఖర్చవుతుంది. అయితే ఈ సూక్ష్మసేద్యం కోసం ఎస్సీ, ఎస్టీ రైతులు ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ జీఎస్టీ రావడంతో వారు కూడా తప్పనిసరిగా రూ.13 వేల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీలు, ఇతర వర్గాలపైనా ఇదే భారం పడనుంది. ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సూక్ష్మసేద్యం అందుబాటులోకి తేవడంతో రైతులు జీఎస్టీ గురించి ఆలోచించకుండా దరఖాస్తు చేసుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.
అధికంగా దరఖాస్తులు
‘ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూక్ష్మసేద్యంపై భారాన్ని తగ్గిస్తారని అనుకున్నాం. కానీ తగ్గలేదు. కాబట్టి 18 శాతం వరకు భారం పడుతుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం భరిస్తుంది. మిగిలిన జీఎస్టీ భారం రైతులపై పడుతుంది. విరివిగా సూక్ష్మసేద్యం ఇస్తుండటంతో రైతులు జీఎస్టీ భారాన్ని లెక్కచేయట్లేదు.’
– వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్
‘సూక్ష్మం’పై మక్కువ..!
Published Wed, Jan 3 2018 3:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment