నేటి నుంచి సూక్ష్మ సేద్యం అనుమతులు
జీఎస్టీతో భారం లేదని నిర్ధారించుకున్న ఉద్యాన శాఖ
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ రాకతో నిలిచిన సూక్ష్మ సేద్యం తిరిగి ప్రారంభం కానుంది. సేద్యం కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు మంగళవారం నుంచి అనుమతులిచ్చేందుకు ఉద్యాన శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సూక్ష్మ సేద్యం పరికరాలపై 18 శాతం జీఎస్టీ విధిం చడంతో కంపెనీలు పరికరాల ఏర్పాటును తాత్కాలికంగా నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే జీఎస్టీతో పెద్దగా భారం ఉండదని తెలుసుకుని సేద్యానికి తిరిగి అనుమతులిచ్చేం దుకు సిద్ధమైనట్లు ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.
గతంలో సూక్ష్మ సేద్యంపై 5 శాతం వ్యాట్ ఉండేది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేది. అలాగే 12 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండగా కంపెనీలు భరించేవి. అయితే తాజా జీఎస్టీలో ఆ 17 శాతం పన్ను కలిసిపోవడం, కేవలం ఒక శాతమే అదనపు భారం పడనుండటంతో ఉద్యానశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాదిరిగా రైతులపై భారం పడ కుండా అదనపు భారాన్ని సర్దుబాటు చేస్తా మని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు.
పెండింగ్‌లో లక్ష దరఖాస్తులు
రాష్ట్రంలో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేం దుకు ప్రభుత్వం నాబార్డు నుంచి రూ.1,000 కోట్లు రుణం తీసుకుంది. సూక్ష్మ సేద్యం ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలకు 90, ఇతరులకు 80 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. ప్రస్తుతం దాదాపు లక్ష మంది రైతులు సూక్ష్మ సేద్యం కోసం ఉద్యాన శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. వాటన్నింటికీ మంగళవారం నుంచి అనుమతులు ఇస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు.