సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏడాదికి 1.10 కోట్ల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు చేతికి వస్తుండగా.. నిల్వ వసతి లేకపోవడం తో అందులో 36.56 లక్షల మెట్రిక్ టన్నులు పాడైపోతున్నాయి. దీంతో ఆయా పంటలను సాగు చేసే రైతులు నష్టపోతున్నారు. సరైన నిల్వ వసతి సౌకర్యాలు లేకపోవడం వల్లే కూరగాయలు, పండ్లు మార్కెట్‌కు తీసుకొచ్చే లోగా కుళ్లిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో వ్యవసాయశాఖ నిర్వహించిన రబీ–2017 సదస్సులో ‘ఉద్యాన పంటలను కోసిన అనం తరం జరిగే నష్టం’పై ఉద్యానశాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఉత్పత్తులకు తగిన నిల్వ వసతి లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకొచ్చి ఆదుకోవాలని కోరారు.
కుళ్లిపోతున్న కూరగాయలు
రాష్ట్రంలో కూరగాయలు, పండ్లు, మిర్చి తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి 26.34 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. అందులో పండ్ల సాగు 10.87 లక్షల ఎకరాల్లోనూ, కూరగాయలు 8.68 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఇక పసుపు, మిర్చి తదితర సుగంధ ద్రవ్యాల పంటల సాగు 6.79 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఆ ప్రకారం ఏడాదికి మామిడి, బత్తాయి, బొప్పాయి, ద్రాక్ష, జామ తదితర పండ్లు 47.52 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. టమాట, వంకాయ, బెండ, బీర, కాకర తదితర కూరగాయలు 50.01 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. పసుపు, మిర్చి వంటి సుగంధ ద్రవ్యాలు 13.28 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయి. కూరగాయలు సరైన నిల్వ వసతి లేకపోవడంతో ఏడాదికి 16.50 లక్షల టన్నులు కుళ్లిపోతున్నాయి. పండ్లు, సుగంధ ద్రవ్యాలు 30 శాతం పాడైపోతున్నాయి.
56 కోల్డ్‌స్టోరేజీలేనా?
కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను పండించాక వాటిని సరైన చోట నిల్వ ఉంచాలి. మార్కెట్‌లో సరైన ధర వచ్చేవరకు శీతల గిడ్డంగుల్లో పెట్టాలి. 5 వేల మెట్రిక్ టన్నులకు ఒకటి చొప్పున ఉద్యాన ఉత్పత్తులను నిల్వ ఉంచడానికి రాష్ట్రంలో 216 శీతల గిడ్డంగులు కావాలి. కానీ కేవలం 56 మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఉద్యానశాఖ తన నివేదికలో తెలిపింది.