‘జీఎస్టీ వల్ల రైతులకు భారమే’
హైదరాబాద్: జీఎస్‌టీ వల్ల ట్రాక్టర్లపై అదనపు పన్నులు పడడం ద్వారా రైతులకు భారమవుతుందని టీ అసెంబబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి తెలిపారు. నేతలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకుల్లో సేవాపన్ను కూడా వసూలు చేస్తారని, దీని వల్ల వ్యవసాయం అంటే ఆసక్తి తగ్గే పరిస్థితి కనపడుతోందని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ నిర్వహించి అప్పుల మీద స్పష్టత ఇవ్వలేదన్నారు. పెట్టుబడులకు కనీసం 25 శాతం కూడా ఇవ్వలేదంటూ 15 రోజుల్లో పంట రుణాలు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. మియాపూర్ భూముల విషయంలో హోం మంత్రి తమకు సమయం ఇవ్వలేదు.. కనీసం ఎప్పుడు ఇస్తారో చెప్పకపోవడం దురదృష్ణకరమని అన్నారు.
జూలై 3న తమ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ రాష్ట్రానికి వస్తారని తెలిపారు. మద్దతు ఇచ్చేవాళ్ళని కలుస్తారని చెప్పారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్.. నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చింది నువ్వే దాని వల్ల బ్యాంకులు రైతులకు ఇప్పుడు డబ్బులు ఇస్తాలేరని అన్నారు. కేంద్రంతో మాట్లాడి అదనంగా రూ. 5 వేల కోట్లు డబ్బులు బ్యాంకులకు తెప్పించాలని సూచించారు. బీడీ కార్మికులకు జీఎస్‌టీలో 28 శాతం పన్ను వల్ల 10 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉందని తెలిపారు. వస్త్ర పరిశ్రమ, గ్రానైట్ పరిశ్రమ మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం హైదరాబాద్ కు తిరిగి రావడంలో ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. జీఎస్‌టీని బహిరంగంగా వ్యతిరేకించే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు.
ఉపాధి హీమీ కూలీలకు కూడా నగదు లేక ఇబ్బంది పడుతున్నారిని ఆయన అన్నారు. సీఎల్పీ ఉప నేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంకర్లు మానవీయ కోణంలో ఉండాలని మంత్రి అంటున్నారు.. అసలు సీఎంకు మానవీయ కోణం ఉన్నదా అని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీలో ప్రణాళిక ఉన్నదా.. అసలు ఎస్‌ఎల్‌బీసీ సమావేశానికి సీఎం రావాల్సి ఉండగా ఆయనకు ఆ మాత్రం సమయం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రైతుల డబ్బు రైతులకే ఇవ్వడానికి బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో అప్పుడు నోట్ల రద్దు రోజులు.. ఇప్పుడు జీఎస్టీ రోజులు అని అన్నారు. చెవిలో పువ్వులు పెట్టే విధానమని తెలిపారు. కేంద్రాన్ని రాష్ట్రాలు అడుక్కునే పరిస్థితి ఏమిటంటూ రాష్ట్రం ఎందుకు అడుక్కునే స్థితికి తెచ్చారని ప్రశ్నించారు. అఖిలపక్షాన్ని పిలవండి.. ఇది గ్యాంబ్లింగ్ టాక్స్ విధానం అని అనొచ్చు. రాష్ట్రం, కేంద్రం మధ్య ఏమైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.