కొబ్బరి రైతులపై జీఎస్‌టీ కత్తి
కొబ్బరి రైతులపై జీఎస్‌టీ కత్తి
Published Fri, Apr 7 2017 10:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
- వై.ఎస్.హయాంలో 2 శాతం పన్నును ఎత్తివేస్తే ఇప్పుడు కొత్త పన్నులా...
- సీఎస్‌టీ స్థానంలో జీఎస్‌టీ రావడంతో అదనపు పన్ను పోటుకు అవకాశం
- రైతులపై రూ.25 కోట్లకు పైగా భారం
- ఇదేమి పాలనంటూ కొబ్బరి రైతులు మండిపాటు
అమలాపురం (అమలాపురం)/ అంబాజీపేట (పి.గన్నవరం) : ‘ములిగే నక్కపై తాటిపండు పడిన’చందాన ఉంది కొబ్బరి రైతుల పరిస్థితి. సంక్షోభంలో చిక్కుకుని అల్లాడుతున్న కొబ్బరి రైతు నెత్తిన జీఎస్‌టీ కత్తి వేలాడుతోంది. గతంలో రాష్ట్ర పరిధిలో ఉన్న సేల్స్‌ట్యాక్స్..దాని స్థానంలో వచ్చిన వ్యాట్‌ట్యాక్స్.. కేంద్రం పరిధిలోని సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్‌టీ)ల స్థానంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) రావడం.. దీనిలో కొబ్బరి ఉత్పత్తులకు ట్యాక్సు మినహాయింపుపై స్పష్టత లేకపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఇలా అయితే వ్యాపారం ఎలా...
పచ్చికొబ్బరి (నీటి కొబ్బరి), ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి), కురిడీ కొబ్బరిలపై రాష్ట్ర పరిధిలో ఇప్పుడు పన్ను మినహాయింపు ఉంది. గతంలో సేల్స్ ట్యాక్సు నాలుగు శాతం, సీఎస్‌టీ రెండు శాతం పన్ను ఉండేది. 1996లో తుపాను, 1998లో నల్లి తెగులు ఆశించి కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం కొబ్బరి నూనె మినహా మిగిలిన కొబ్బరి ఉత్పత్తులైన పచ్చికొబ్బరి, ఎండుకొబ్బరి, కురిడీ కొబ్బరిలపై నాలుగు శాతం ఉన్న పన్నును రెండు శాతానికి కుదించారు. తరువాత వ్యాట్ అములోకి వచ్చినా ఇదే విధానం కొనసాగింది. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు శాతం పన్నును సైతం ఎత్తివేశారు. కేవలం సీఎస్‌టీ రెండుశాతం మాత్రమే ఉండేది. పన్ను అములులో ఉన్నప్పుడు వ్యాపారులు పన్ను చెల్లించినా.. దానిని రైతుల వద్ద నుంచి వసూలు చేసేవారు. పన్ను మినహాయింపు వల్ల రైతులే ఎక్కువుగా ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్‌టీని అమలు చేస్తోంది. రాష్ట్రాల పరిధిలో వ్యాట్, సీఎస్‌టీల స్థానంలో జీఎస్‌టీ అమలులోకి వస్తోంది. జూన్ నుంచి మొదలు కాబోయే జీఎస్‌టీలో కొబ్బరికి మినహాయింపుపై స్పష్టత లేకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జీఎస్‌టీ పరిధిలోకి వస్తే తమపై పన్ను భారం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోనసీమ నుంచి ఏటా రూ.600 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయని అంచనా. జీఎస్‌టీలో పన్ను వసూలు చేస్తే రైతులపై సుమారు రూ.25 కోట్లకుపైగా భారం పడుతోందని రైతులు లెక్కలు కడుతున్నారు.
ఇప్పుడు పన్ను విధానంలో ఉన్న మినహాయింపులు జీఎస్‌టీలో కూడా వర్తించే అవకాశముందనే ప్రచారం ఒకవైపు.. కొబ్బరి ఉత్పత్తులకు పన్ను మినహాయింపు దక్కదని మరోవైపు జరుగుతున్న ప్రచారం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. దీనిపై వ్యాణిజ్య పన్నుల శాఖాధికారులకు సైతం సరైన సమాచారం ఇంత వరకు అందలేదు. కొబ్బరిపై జీఎస్‌టీ పన్ను విధానంపై స్పష్టత వచ్చే వరకు రైతుల్లో ఆందోళన తగ్గేలా లేదు.
Advertisement
Advertisement