మావైపే గ్రేటర్‌ ఓటర్.. కాదు మా వైపు‌! | GHMC Elections 2020 Poor Polling TRS Great Hope On Mayor Seat | Sakshi
Sakshi News home page

మావైపే గ్రేటర్‌ ఓటర్‌!

Published Wed, Dec 2 2020 8:13 AM | Last Updated on Wed, Dec 2 2020 9:27 AM

GHMC Elections 2020 Poor Polling TRS Great Hope On Mayor Seat - Sakshi

బల్దియా పోలింగ్‌ ముగియడంతో రాజకీయ పార్టీలు గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. పోలింగ్‌ సరళిని బట్టి విజయం మాదంటే.. మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ మేయర్‌ కుర్చీ తమదేనని, ఈసారి కచ్చితంగా 100 స్థానాల్లో గెలుస్తామని, పోలింగ్‌ జరిగిన తీరు, ప్రజాభిప్రాయం కూడా ఇదే చెబుతోందని టీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్‌ సరళిపై ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఇక, గ్రేటర్‌ ఎన్నికల్లో దుబ్బాక ఫలితాన్ని పునరావృతం చేస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ కూడా మెజార్టీ స్థానాలు తమవేనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని, 50కి పైగా స్థానాల్లో విజయం సాధించి తీరుతామని కమలనాథులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల్లోనూ గెలుపు ధీమా గట్టిగానే కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సరళిలో తాము వెనుకబడినట్టు కనిపించినా కనీసం 20 స్థానాల్లో గెలుస్తామని, మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధి నుంచి మంచి ఫలితాలు వస్తాయని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. ఎంఐఎం ఎప్పటిలాగే పాతబస్తీలో పాగా వేస్తామనే విశ్వాసంతో ఉండగా, వామపక్షాలు, ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా గెలుపు తీరం చేరుతామని లెక్కలు వేసుకుంటున్నాయి.    – సాక్షి, హైదరాబాద్‌

సెంచరీ కొట్టేనా..?
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌ మళ్లీ మేయర్‌ పీఠం తమదేనన్న ధీమాతో ఉంది. పోలింగ్‌ శాతం తగ్గినా, గతంలో మాదిరి 100కు డివిజన్లలో పాగా వేయడం ఖాయమనే అంచనాలో ఉంది. మంగళవారం ఉదయమే ఓటు వేసిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. తన నివాసంలోని వార్‌రూం నుంచి పార్టీ అభ్యర్థులు, డివిజన్‌ ఇన్‌చార్జ్‌లతో పోలింగ్‌ తీరుతెన్నులపై సమీక్షించారు. ఏ డివిజన్‌లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్న ఆయన బీజేపీతో గట్టిపోటీ ఉన్న డివిజన్లలో పోలింగ్‌ గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. అయితే, నగర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం భారీగా తగ్గుతోందనే సమాచారం మేరకు అభ్యర్థులు, డివిజన్‌ ఇన్‌చార్జ్‌లను అప్రమత్తం చేశారు. పార్టీకి పట్టున్న కాలనీలు, బస్తీల నుంచి ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తరలించేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోల్‌ అయిన ఓట్లలో మెజార్టీ ఓట్లు తమ ఖాతాలోనే పడ్డాయనే లెక్కల్లో గులాబీ నేతలున్నారు.(చదవండి: గ్రేటర్‌ వార్‌: స్పందించని నగర వాసులు)


జనం మావైపే...
ఈ ఎన్నికల్లో గ్రేటర్‌ ప్రజలు తమ వైపే నిలిచారని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ శాతం తగ్గినా... పోలైన ఓట్లు తమకే పడ్డాయని, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటర్లు బ్యాలెట్‌ బాక్సులు నింపారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో తాము సెంచరీ కొడతా మని పైకి చెబుతున్నా.. కనీసం 50 కన్నా ఎక్కువ డివిజన్లలో గెలిచి తీరుతామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు భరోసాగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్య నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణ, ధర్మపురి అరవింద్‌ తదితరులు పోలింగ్‌ సరళిపై ఎప్పటికప్పుడు డివిజన్ల వారీగా ఆరా తీస్తూ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. గెలిచే స్థానాల్లో పోలింగ్‌ ముగిసేంత వరకు పట్టువీడొద్దని సూచించారు. అయితే, తగ్గిన పోలింగ్‌ శాతం ఏం చేస్తుందన్న టెన్షన్‌ కూడా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. యువత, విద్యాధికుల ఓట్లు పెద్దగా పోల్‌ కాకపోవడం నష్టం చేస్తుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. 

కాంగి‘రేసు’ఎంత వరకు?
రాష్ట్రంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ విషయం లో జీహెచ్‌ఎంసీ ఓటర్లు ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్‌ సరళిని పరిశీలించిన నాయకులు తాము 15–20 స్థానాల్లో గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్‌గిరి పరిధిలోని 47, చేవెళ్ల పరిధిలోని 18 డివిజన్లలో గట్టిపోటీ ఇచ్చామని చెబుతున్నారు. కోర్‌సిటీలో కొన్ని డివిజన్లలో తమకు అనుకూల పోలింగ్‌ జరిగిందని అంటున్నారు.  

పాతబస్తీ పతంగిదేనా..? 
పాతబస్తీలో మంచి పట్టు ఉన్న ఎంఐఎం మళ్లీ తన స్థానం అక్కడ పదిలమేనని అంటోంది. గతంలో గెలిచిన 44 స్థానాలకు ఒకట్రెండు ఎక్కువే కానీ తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్‌ సరళిని పార్టీ ముఖ్య నేతలు అసద్, అక్బర్‌లు సమీక్షించి కేడర్‌ను అప్రమత్తం చేశారు. పాతబస్తీపై పట్టు అలాగే కొనసాగుతుందన్న ధీమా దారుస్సలాం వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక, 29 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ, సీపీఎం లతో పాటు 26 చోట్ల బరిలోకి దిగిన టీజేఎస్‌ కూడా తాము గట్టిపోటీ ఇవ్వగలిగామనే అభిప్రాయంతో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో సత్తా చాటుతామనే ధీమాలో ఉన్నారు. ఎవరికి వారే తమ డివిజన్లలో పోలైన ఓట్లలో ఎన్ని తమకు సానుకూలమనే లెక్కలు కట్టుకుంటున్నారు. ఏం జరుగుతుంది... రాజకీయ పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుందన్నది ఈనెల 4న తేలనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement