సాక్షి, బంజారాహిల్స్: గ్రేటర్ హైదరాబాద్‌లో త్వరలోనే బస్తీ యాత్ర చేపట్టి స్థానిక సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండే విధంగా నగరంలోని ప్రతి బస్తీలో బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హాళ్లు ఉండాలన్నదే తన లక్ష్యమని, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు మరింత పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. డ్రెయినేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని మెరుగు పరిచేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తామని తన తొలి ప్రాధాన్యత కూడా ఇదేనన్నారు. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్న విషయాన్ని గుర్తించామని, వాటిని కూడా బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అవినీతి రహిత జీహెచ్‌ఎంసీని రూపొందించడమే తన లక్ష్యమని వెల్లడించారు. కరప్షన్ ఫ్రీ అనేది తన లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. అవినీతిపై ఎందాకైనా వెళ్లి పోరాడతానని స్పష్టం చేశారు. నగర అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరి సలహాలు తీసుకుంటానని వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తానని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు మహిళలకు ఇవ్వడంపై సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు గ్రేటర్ మహిళల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. గతంలో మహిళా మేయర్లు ఉన్నా ఒకే సమయంలో మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలకే ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. హైదరాబాద్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పాటుపడతానని, ఐటీ హబ్‌గా ఉన్న నగరాన్ని హెల్త్ హబ్‌గా, పరిశుభ్రమైన నగరంగా మార్చడమే తన లక్ష్యమన్నారు.
హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు
నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత మందే మహిళలు ఉండేవారని, కార్పొరేటర్‌గా గెలిచిన తర్వాత ఒక్కొక్కరిగా వందల సంఖ్యలో మహిళలు రావడం తనకెంతో తృప్తి కలిగించిన అంశమన్నారు. ఈ ప్రభుత్వంలోనే మహిళలకు ఎన్నో అవకాశాలు దక్కాయని, ప్రతి రంగంలోనూ మహిళలు దూసుకుపోతున్నారని వెల్లడించారు. మహిళగా గర్వపడుతున్నానన్నారు. మహిళలే ముందుండి తనను నడిపించారని ప్రతి గెలుపులోనూ బంజారాహిల్స్ డివిజన్ మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. తన వెన్నంటి నిలిచి ఉన్నతిని కోరుకున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంలో పని చేస్తున్నందుకు ప్రతిఒక్కరూ గర్విస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నగర అభివృద్ధి విషయంలో అలుపెరుగని కృషి చేస్తా. జీహెచ్‌ఎంసీలో లోటు బడ్జెట్ ఉందన్న విషయాన్ని బాధ్యతలు స్వీకరించిన తర్వాత సమీక్షిస్తా. అందరితో కలిసి ప్రజలకు మెరుగైన సేవలందించే విధంగా ప్రణాళికలు
రూపొందిస్తాం. విశ్వనగరం సాధిస్తాం.
చదవండి: ‘మంచిగ ఉంటేనే బట్టకాల్చి మీదేసే రోజులివి’
ప్రమాణ స్వీకారంలో పదనిసలు
నాన్న ఆశీర్వాదం..
బంజారాహిల్స్: జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. ఉదయం టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తెలంగాణ భవన్‌కు వచ్చారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి పేరును మేయర్‌గా సీల్డ్ కవర్‌లో తీసుకెళ్లారు. సమావేశానికి హాజరయ్యే ముందు గద్వాల విజయలక్ష్మి తన నివాసంలో తండ్రి కేకే ఆశీస్సులు తీసుకున్నారు.
పూజలు చేసి..
బంజారాహిల్స్: ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లేముందు జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఎన్బీటీనగర్‌లోని శివాలయంలో, అయ్యప్ప స్వామికి, సాయిబాబాకు పూజలు నిర్వహించారు. దైవభక్తి అధికంగా ఉన్న ఆమె ప్రతిరోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ సాయిబాబా ఆలయాన్ని ఆమె సొంత నిధులతో కట్టించారు.
బయోడేటా
పేరు : గద్వాల విజయలక్ష్మి
భర్త : బాబిరెడ్డి
తల్లిదండ్రులు: కే.కేశవరావు, వసంత కుమారి
పుట్టిన తేదీ: 28–01–1964
వయసు : 56
విద్యార్హత : బీఏ, ఎల్‌ఎల్‌బీ, జర్నలిజం
నివాసం : బంజారాహిల్స్, ఎన్బీటీ నగర్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా: డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి
సికింద్రాబాద్: తనకు లభించిన జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ పదవిని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారా లభించిన గౌరవంగా భావిస్తున్నానని మోతె శ్రీలతారెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన మోతె శ్రీలతారెడ్డి గురువారం జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. \
మొదటిసారి కార్పొరేటర్‌గా గెలిచి, డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక కావడంతో ఎలా ఫీలవుతున్నారు?
నన్ను డిప్యూటీ మేయర్ చేయడంతో ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందన్న భావనను మరోమారు బలపరిచింది. తెలంగాణ ఉద్యమం తొలిరోజు నుంచి నా భర్త శోభన్‌రెడ్డి ఉన్నారు. ఆయన ఉద్యమ పటిమకు ప్రతిఫలం అనుకుంటున్నాను.
డిప్యూటీతో అసంతృప్తికి గురయ్యారా?
ఉద్యమ సమయంలోనూ, రాష్ట్రం ఏర్పాటయ్యాక మొత్తంగా 21 సంవత్సరాలు టీఆర్‌ఎస్‌తోనే ప్రయాణించాం. మేయర్ పదవి ఆశించింది వాస్తవమే. డిప్యూటీతో అయినా గుర్తింపు లభించినందుకు సంతృప్తి లభించింది.
నగర అభివృద్ధిలో మీ భాగస్వామ్యం ఎలా ఉంటుంది?
మేయర్ గద్వాల విజయలక్ష్మికి నగర అభివృద్ధిలో సంపూర్ణ సహకారం అందిస్తా. టీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి నుంచి నగరం శరవేగంగా అభి వృద్ధి చెందుతోంది. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ చూపిన మార్గంలో అభివృద్ధి పనులు చేపడతాం.
ఈ ప్రాంతం నుంచి గెలిచిన మీరు సికింద్రాబాద్ ప్రాంతానికి ఏం చేస్తారు?
దశాబ్దాలుగా సికింద్రాబాద్ ప్రాంత సమస్యలు తెలుసు. ఇక్కడి నుంచి డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావుగౌడ్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి డిప్యూటీ మేయర్ కావడం గర్వంగా ఉంది. వారిద్దరి సహకారంతో సికింద్రాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నిస్తాను.
బయోడేటా
పేరు: మోతె శ్రీలతారెడ్డి
భర్త: శోభన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు.
తల్లిదండ్రలు: బేతి యశోధ, రంగారెడ్డి.
పుట్టిన తేదీ: 01–03–1971.
వయసు: 49 సంవత్సరాలు.
విద్యార్హత: బీఏ
సంతానం: ఇద్దరు అమ్మాయిలు. రాజీవి, శ్రీతేజస్విని (అమెరికాలో ఉంటున్నారు).
నివాసం: తార్నాక, సికింద్రాబాద్.
Comments
Please login to add a commentAdd a comment