సాక్షి, సిటీబ్యూరో: కరోనా మహమ్మారికి ఎవరూ ఆందోళన చెందాల్సిందేమీ లేదని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వీడియో క్లిప్‌ను ఉంచారు. ఇదిలా ఉండగా జీహెచ్‌ఎంసీలో ఇప్పటి వరకు పలువురు అధికారులు, క్షేత్రస్థాయిలో పనులు చేసే వివిధ విభాగాల సిబ్బందికి కోవిడ్ సోకగా, తాజాగా ప్రథమ పౌరుడైన మేయర్‌కు కూడా కరోనా నిర్ధారణ కావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందిలో ఆందోళనలు మరింత పెరిగాయి. జీహెచ్‌ఎంసీలో ఇప్పటికే ఎంతోమందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అధికారులు కచ్చితమైన లెక్కలు వెల్లడించలేదు. పారిశుద్ధ్యం, ఎంటమాలజీ కార్మికుల నుంచి కార్యాలయాల్లోని ఉద్యోగులు, డిప్యూటీ కమిషనర్ల నుంచి జోనల్ కమిషనర్ వరకు పాజిటివ్ రావడం తెలిసిందే. నగరంలో కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి కూడా మేయర్ బొంతు రామ్మోహన్ విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.
లాక్‌డౌన్ సమయంలోనూ రోజూ ఏదో ఒక క్షేత్రస్థాయి పర్యటన చేసి, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. తన కార్యాలయంలో అధికారులతో తరచు సమీక్షలు నిర్వహించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ పుట్టినరోజున నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ క్రాస్‌రోడ్–ఒవైసీ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్, ఎల్‌బీనగర్ జోన్‌లో పది ఎకరాల్లో యాదాద్రి మోడల్‌లో ప్లాంటేషన్, తదితర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు కేటీఆర్, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొన్న విషయం తెలిసిందే.
వీడియోలో ఏమన్నారంటే..
‘మిత్రులు.. నగర ప్రజలకు అందరికీ.. నాకు కరోనా వచ్చిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను కరోనా వచ్చినా ఎలాంటి లక్షణాలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నాను. తగుజాగ్రత్తలు తీసకుంటూ, ఎవరినీ దగ్గరకు రానీయకుండా ప్రత్యేక గదిలో ఉంటూ కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ, మందులు తీసుకుంటూ ఉన్నా. ఎవరూ కరోనాకు భయపడి ఏదో అవుతుందని చెప్పి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు. కరోనా వచ్చినా ఎదుర్కొనగలమనే మనోధైర్యంతో ముందుకు వెళ్తే.. మనల్ని ఏమీ చేయలేదు. మనోధైర్యాన్ని మించింది ఏమీ లేదు. ఈ కరోనా సమయంలో కూడా మునిసిపల్ మంత్రి ఆదేశాలతో నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నందున ఎప్పటికప్పుడు ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహిస్తా. అదరక బెదరక గుండె నిబ్బరంతో ముందుకు వెళ్తే విజయవంతంగా జయించగలుగుతాం. మంచికోరే మిత్రులందరికీ.. నగర ప్రజలందరికీ ధన్యవాదాలతో..
– మీ బొంతు రామ్మోహన్’అని మేయర్ సందేశం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment