సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు కూడా స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో కుక్కల దాడి ఘటనలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కుక్క కాటు నియంత్రణపై 13 అంశాలతో మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. వీధి కుక్కలను దత్తత తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇదే సమయంలో హెల్ప్‌లైన్ నంబర్ 040-2111 1111 తీసుకువచ్చింది.
ఇదిలా ఉండగా.. జీహెచ్‌ఎంసీలో వీధి కుక్కల దాడుల ఘటనలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మున్సిపల్, వెటర్నరీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలో జరిగిన ఘటన బాధాకరం. నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. మేయర్ వ్యాఖ్యలను విపక్షాలు వక్రీకరించాయి. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీమ్స్‌తో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం. టోల్ ఫ్రీ నంబర్, ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. చనిపోయిన జంతువుల దహనానికి జీహెచ్‌ఎంసీ సూచించిన ప్రాంతాల్లోనే దహనం చేయాలి.
ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. విమర్శలు చేసే వారికి మేము సమాధానం చెప్పాము. ట్రైనింగ్ క్యాంపు పెట్టి వీటి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము. మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి(శుక్రవారం) నుండి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాము. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. రాత్రి సమయంలో స్పెషల్ టీమ్స్ తనిఖీల్లో ఉంటాయి. అక్కడే కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment