సాక్షి, భద్రాచలం: దక్షిణ గంగ అయిన గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ బ్యారేజీ నుంచి తెలంగాణలోని సీతమ్మసాగర్ దాకా అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శనివారం తెల్లవారుజామున గోదావరి నీటిమట్టం 54.30 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దిగువకు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) హెచ్చరించింది. కాగా, ఈ ఏడాది తొలిసారి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాలు, కాలనీల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. చర్ల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించారు అధికారులు. భద్రాచలం పట్టణంలోని మూడు కాలనీలకు చెందిన వారిని కూడా పునరావస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 8712682128ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నెంబర్‌కు ఫొటోలు, లోకేషన్ పంపించి పోలీసుల సహయం పోందవచ్చని జిల్లా ఏస్పీ వినిత్ వెల్లడించారు. ఇక, పడవలు, బోట్లు , గజ ఈతగాళ్ళు, లైఫ్ జాకెట్లను అధికారులు సిద్దం చేశారు. ఇదిలా ఉండగా.. గోదావరీ ఉధృతి, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలెక్టర్ ప్రియాంక అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58 నుంచి 60 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యలు అందించడానికి సిద్ధంగా ఉంది. జిల్లావ్యాప్తంగా 40 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఇప్పటివరకు 4,900 మందిని సురక్షిత కేంద్రాలకు తరలించాము. అత్యవసర పరిస్థితుల్లో మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్ అందుబాటులో ఉంచాం. గోదావరి 60 అడుగులు వచ్చినా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రంగా సిద్ధంగా ఉంది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలు పునరావస కేంద్రాలకు తరలిరావాలి అని సూచించారు.
ఇది కూడా చదవండి: 19 ప్రాణాలు.. 10 లక్షల ఎకరాలు.. వరదలతో రాష్ట్రం అతలాకుతలం
Comments
Please login to add a commentAdd a comment