
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు లేట్ పేమెంట్ సర్‌చార్జీల నుంచి కొంత ఉపశమనం లభించింది. విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు బిల్లులు చెల్లించడంలో జాప్యం జరిగితే జరిమానాగా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్‌చార్జీలు కొంతవరకు తగ్గిపోనున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం డిస్కంలు బకాయిపడ్డ బిల్లు మొత్తంపై.. 18 శాతం వడ్డీని లేట్ పేమెంట్ సర్‌చార్జీగా చెల్లిస్తూ వస్తున్నాయి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన ఎలక్ట్రిసిటీ (లేట్ పేమెంట్ సర్‌చార్జీ) రూల్స్-2021తో సర్‌చార్జీలు కొంతమేర తగ్గాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వార్షిక రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేటుపై మరో 5 శాతాన్ని జత చేసి లేట్ పేమెంట్ సర్‌చార్జీలుగా చెల్లించాలని రూల్స్ పేర్కొంటున్నాయి. ఎస్‌బీఐ వార్షిక రుణాలపై ప్రస్తుతం 7.59 శాతం వడ్డీరేటు ఉండగా, మరో 5 శాతం జత చేసి 12.59 శాతం సర్‌చార్జీగా (జరిమానా) ఇకపై చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా విద్యుదుత్పత్తి కంపెనీలకు 45 రోజుల్లోగా డిస్కంలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. 45 రోజుల గడువు మించిన తర్వాత తొలి నెల జాప్యానికి 12.59 శాతాన్ని (వడ్డీ రేటు) సర్‌చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం... రెండో నెల నుంచి ప్రతి నెలా 0.5 శాతం చొప్పున ఈ సర్‌చార్జీ పెరుగుతుంది. ఈ పెంపుపై గరిష్ట పరిమితిని 3 శాతంగా నిర్ణయించారు. అంటే ఏడు నెలల జాప్యం జరిగితే సర్‌చార్జీలు 15.59 శాతానికి చేరి ఆగిపోనున్నాయి. ఆ తర్వాత జరిగే జాప్యానికి అదనంగా వడ్డీరేటు పెరగదు.
భారీగా బకాయిలు
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ప్రాప్తి (http://praapti.in) పోర్టల్ ప్రకారం విద్యుదుత్పత్తి కంపెనీలకు తెలంగాణ డిస్కంలు గత డిసెంబర్ నాటికి రూ.6,954 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రూ.2,500 కోట్లు, తెలంగాణ జెన్‌కోకు రూ.5 వేల కోట్లు సైతం డిస్కంలు చెల్లించాల్సి ఉంది. అన్ని కలిపి విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.15 వేల కోట్లకు పైనే ఉంటాయని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.15 వేల కోట్ల బకాయిలపై ప్రతి నెలా చెల్లించాల్సిన లేట్ పేమెంట్ సర్‌చార్జీలు (జరిమానా) తాజాగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌తో 18 శాతం నుంచి 12.59– 15.59 శాతానికి (వడ్డీరేటు) తగ్గనుండడంతో ప్రతి నెలా డిస్కంలకు రూ.కోట్లలో భారం తగ్గుతుందని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment